Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్‌ను వీడిన డెవిడ్ వార్నర్
- పాత జట్లతోనే ధోని, కోహ్లి, రోహిత్, పంత్
- ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా ఖరారు
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ప్రాంఛైజీల ముఖచిత్రం మారిపోనుంది!. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీలు, అత్యంత ఆదరణ కలిగిన ప్రాంఛైజీలు కీలక ఆటగాళ్లను నిలుపుకోగా.. తమ ప్రాంఛైజీల ముఖచిత్రంగా నిలిచిన ఐకాన్ క్రికెటర్లను మరికొన్ని ప్రాంఛైజీలు కోల్పోయాయి. ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లను ప్రాంఛైజీలు అట్టిపెట్టుకోగా.. డెవిడ్ వార్నర్‌ను హైదరాబాద్, కెఎల్ రాహుల్‌ను పంజాబ్ కింగ్స్ నిలుపుకోవటంలో విఫలమయ్యాయి.
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15 సీజన్ హంగామా అప్పుడే మొదలైంది. రెండు నూతన జట్ల చేరికతో వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ పది జట్లతో అలరించనుంది. మెగా సీజన్‌కు ముందు మెగా ఆటగాళ్ల వేలం నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. అంతకముందు ప్రాంఛైజీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రిటెన్షన్ అవకాశాన్ని కొన్ని ప్రాంఛైజీలు అందిపుచ్చుకోగా.. మరికొన్ని ప్రాంఛైజీలు ప్రధాన ఆటగాళ్లను నిలుపుకోవటంలో విఫలమయ్యాయి. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాకు తుది గడువు నవంబర్ 30న ముగియగా.. ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లను ప్రకటించాయి.
దిగ్గజాలు పాత జట్లతోనే..! : ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లు పాత ప్రాంఛైజీల తరఫునే బరిలోకి దిగనున్నారు. ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లిలు గత సీజన్లో అందుకున్న మొత్తం కంటే తక్కువ వేతనం అందుకోనున్నారు. ధోని రూ.12 కోట్లు, కోహ్లి రూ. 16 కోట్లు తీసుకోనున్నారు. రోహిత్ శర్మ రూ.16 కోట్లకు ముంబయికి నాయకత్వం కొనసాగించనున్నాడు. ఐపీఎల్ తొలి విజేత రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, జోశ్ బట్లర్ సహా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను నిలుపుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఊహించినట్టే రిషబ్ పంత్, అక్షర్, పృథ్వీ, నొకియాలను అట్టిపెట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తోడు కాశ్మీర్ సంచలనాలు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను నిలుపుకుంది.
ఐకాన్లు వెళ్లిపోయారు : ముంబయి ఇండియన్స్ పాండ్య సోదరులు, ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్‌లను వేలంలోకి వదిలేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు ఐకాన్ ఆటగాళ్లను కోల్పోయింది. డెవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌లను వేలంలోకి వదిలింది. రషీద్ ఖాన్ కోసం ఆరెంజ్ ఆర్మీ వేలంలో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్‌ను కెఎల్ రాహుల్ వదిలేశాడు. జట్టు యాజమాన్యం రాహుల్‌ను కోరుకున్నా.. అతడు కొత్త జట్టుతో ప్రయాణానికి నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సహా బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను వదులుకోవటం ఆశ్చర్యానికి గురి చేసింది.
కొత్త జట్లకు ఓ చాన్స్ : ఎనిమిది ప్రాంఛైజీలు వేలం లోకి వదిలేసిన ఆటగాళ్ల జాబితా నుంచి ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం రెండు కొత్త ప్రాంఛైజీలకు ఇవ్వనున్నారు. డిసెంబర్ 1-25 వరకు ఆటగాళ్లపై తేల్చుకునేందుకు సమయం ఇవ్వనున్నారు. ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ ఆటగాడిని ఎంచుకునేందుకు చాన్స్ ఉంది. కెఎల్ రాహుల్, డెవిడ్ వార్నర్, ఇయాన్ మోర్గాన్‌లు కొత్త ప్రాంఛైజీ కెప్టెన్సీ రేసులో కనిపిస్తున్నారు.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : విరాట్ కోహ్లి (15 కోట్లు), గ్లెన్ మాక్స్వెల్ (11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (7 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్
వేలంలో మిగిలిన మొత్తం : రూ.57 కోట్లు
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (16 కోట్లు), జశ్‌ప్రీత్ బుమ్రా (12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (8 కోట్లు), కీరన్ పొలార్డ్ (6 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్.
వేలంలో మిగిలిన మొత్తం : రూ.48 కోట్లు
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (12 కోట్లు), అర్షదీప్ సింగ్ (4 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : కెఎల్ రాహుల్, మహ్మద్ షమి.
వేలంలో మిగిలిన మొత్తం : రూ.72 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : డెవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, జానీ బెయిర్‌స్టో.
వేలంలో మిగిలిన మొత్తం : రూ.68 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్ : రవీంద్ర జడేజా (16 కోట్లు), ఎం.ఎస్ ధోని (12 కోట్లు), మోయిన్ అలీ (8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (6 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : సురేశ్ రైనా, అంబటి రాయుడు, శామ్ కరణ్.
వేలంలో మిగిలిన మొత్తం : రూ.48 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : రిషబ్ పంత్ (16 కోట్లు), అక్షర్ పటేల్ (9 కోట్లు), పృథ్వీ షా (7.5కోట్లు), ఎన్రిచ్ నొకియా (6.5 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : శ్రేయస్ అయ్యర్, కగిసో రబాడ, శిఖర్ ధావన్.
వేలంలో మిగిలిన మొత్తం : రూ.47.5 కోట్లు
కోల్‌కత నైట్‌రైడర్స్ : అండ్రీ రసెల్ (12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు) , సునీల్ నరైన్ (6 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్.
వేలంలో మిగిలిన మొత్తం : రూ. 48 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (14 కోట్లు), జోశ్ బట్లర్ (10 కోట్లు), యశస్వి జైస్వాల్ (4 కోట్లు)
వదిలేసిన కీలక ఆటగాళ్లు : బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్
వేలంలో మిగిలిన మొత్తం : రూ. 62 కోట్లు