Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్‌ఏఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
హైదరాబాద్ : తెలుగు తేజం, హైదరాబాదీ సందీప్ రెడ్డి పోతిరెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం వేదికగా డిసెంబర్ 6-8న జరిగే ఐఎఫ్‌ఏఎఫ్ (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ ఫుట్‌బాల్) ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే భారత జట్టుకు సందీప్ రెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చీఫ్ కోచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 42 మందితో కూడిన భారత జట్టు శిక్షణ శిబిరం బుధవారం హైదరాబాద్‌లో ముగిసింది. భారత జట్టులో కెప్టెన్ సందీప్ రెడ్డి సహా ఏడుగురు తెలుగు ఆటగాళ్లు చోటు సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సండ్రి సంతోష్, కేతన్ జోగ, రోహిత్ బండ, అవనీష్, శివ ప్రసాద్ గుండ, మణికంఠ వీరలు ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొననున్నారు. చివరగా 2018లో జరిగిన పనామా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తొలిసారి పోటీ పడినా, పదో స్థానంలో నిలిచి సత్తా చాటింది. 2020 డెన్మార్క్‌లో జరగాల్సిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ కోవిడ్-19 కారణంగా రద్దు అయ్యింది. 23 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ అగ్ర జట్లతో కూడిన గ్రూప్-ఏలో నిలిచింది. నాలుగు సార్లు చాంపియన్ అమెరికా సహా స్పెయిన్, ఫ్రాన్స్, చిలీలతో భారత్ గ్రూప్ దశలో పోటీపడాల్సి ఉంది. ఈ టోర్నీలో టాప్-8లో నిలిచిన జట్లు 2022 బర్మింగ్‌హామ్ వరల్డ్ గేమ్స్‌కు అర్హత సాధించనున్నాయి.
సందీప్పైనే ఆశలు! : ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు ఆశలు కెప్టెన్ సందీప్ రెడ్డిపైనే ఉన్నాయి. 2018 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పదో స్థానంలో నిలువటంలో సందీప్ రెడ్డి మెరుపు ప్రదర్శనే కారణం!. ఆ టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడి అవార్డు సైతం సందీప్ రెడ్డి అందుకున్నాడు. భారత్‌కు 30కి పైగా మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన సందీప్ రెడ్డి రన్నింగ్ బ్యాక్ అండ్ రిసీవర్‌గా జట్టులో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. 'అమెరికన్ ఫుట్‌బాల్ కఠినమైన ఆట. మన దగ్గర పెద్దగా ప్రాచుర్యం లేకపోయినా, విదేశాల్లో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడ ఇది. ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం మెరుగ్గా సన్నద్ధమయ్యాం. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీ జట్లకు గట్టి పోటీ ఇవ్వగలమనే నమ్మకం ఉంది. వరల్డ్ గేమ్స్‌కు అర్హత సాధించటమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది' అని కెప్టెన్ సందీప్ రెడ్డి తెలిపాడు.