Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాంఖడే టెస్టుకు భారత్, న్యూజిలాండ్
- భారత్‌లో సిరీస్‌పై కన్నేసిన కివీస్
- ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
న్యూజిలాండ్ జట్టు భారత్‌లో ఏండ్లుగా పర్యటిస్తోంది. అధిక శాతం టెస్టులో ఆతిథ్య జట్టు ఆధిపత్యంతో ఏకపక్షంగానే ముగిశాయి. 1969 పర్యటనలో బ్లాక్‌క్యాప్స్ సిరీస్ విజయానికి చేరువగా వచ్చారు. వరుస పర్యటనలు, వరుస సిరీస్‌లు న్యూజిలాండ్ కోల్పోయినా.. ప్రతిసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమై వచ్చింది. 2021 పర్యటనలోనూ న్యూజిలాండ్ అదే పని చేసింది. ఐదు రోజుల ఉత్కంఠ సమరంలో కాన్పూర్ టెస్టును డ్రా చేసుకున్న కివీస్.. నేడు వాంఖడేలో అరుదైన సిరీస్ విజయంపై కన్నేసింది!. విరాట్ కోహ్లి రాకతో రెండో టెస్టులో టీమ్ ఇండియా అలవోక విజయం ఆశిస్తోంది. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-ముంబయి
పేస్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించగా.. స్పిన్ పిచ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు టీమ్ ఇండియా సిద్ధమైనట్టే కనిపించింది. కానీ కాన్పూర్‌లో న్యూజిలాండ్ అమోఘమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టుకు విజయాన్ని నిరాకరించింది. కాన్పూర్ టెస్టు డ్రా ఉత్సాహంలో ఉన్న న్యూజిలాండ్ నేడు వాంఖడేలో ఏకంగా విజయంపై కన్నేసింది. భారత గడ్డపై అరుదైన టెస్టు సిరీస్ విజయం సాధించాలని తపన పడుతోంది. అందుకు చిరుజల్లులు, మేఘావృతమైన వాతావరణం సైతం తోడ్పాటుగా ఉంటుందని విలియమ్సన్ సేన భావన. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పునరాగమనంతో టీమ్ ఇండియా వాంఖడేలో దూకుడుగా ఆడనుంది. పరిస్థితులను సంబంధం లేకుండా వాంఖడేలో సిరీస్ విజయం దక్కించుకునేందుకు కోహ్లి, ద్రవిడ్ ద్వయం వ్యూహ రచన చేస్తోంది. నేటి నుంచి భారత్, కివీస్ రెండో టెస్టు ఆరంభం.
రహానె నిలిచేనా? : కాన్పూర్ టెస్టు భారత కెప్టెన్ అజింక్య రహానె వాంఖడే టెస్టు తుది జట్టులో చోటు గల్లంతు చేసుకునే ప్రమాదంలో పడ్డాడు. కోహ్లి గైర్హాజరీలో శ్రేయస్ అయ్యర్ స్ఫూర్తిదాయక శతకం, అర్థ శతకంతో రాణించాడు. అయ్యర్, విరాట్ ఇద్దరూ తుది జట్టులో ఉండనుండటంతో టాప్, మిడిల్ ఆర్డర్లో ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి. పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న అజింక్య రహానెను బెంచ్‌కు పరిమితం చేసే ఆలోచన ఎక్కువగా ఉంది. మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారాలలో ఒకరిపై వేటు వేసినా ఆశ్చర్యం లేదు. కాన్పూర్‌లో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా ఆకట్టుకున్న తెలుగు తేజం కెఎస్ భరత్ వాంఖడేలో అరంగేట్రం ఆశిస్తున్నాడు. వృద్దిమాన్ సాహా ఫిట్నెస్తో ఇబ్బంది పడటంతో అతడికి విశ్రాంతినిచ్చి.. భరత్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను తప్పించే వీలుంది. జోరుమీదున్న హైదరాబాదీ సీమర్ మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అశ్విన్, జడేజా, అక్షర్ స్పిన్ త్రయం వాంఖడేలోనూ కొనసాగనుంది. రెండేండ్లుగా అంతర్జాతీయ శతకానికి దూరమైన విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌పై శతక నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తున్నాడు.
ముగ్గురు పేసర్లతో..! : స్పిన్ రాజ్యమేలే కాన్పూర్ వికెట్‌పై న్యూజిలాండ్ పేస్‌తో భారత్‌ను దెబ్బకొట్టింది. వర్షం ప్రభావిత ముంబయిలో సీమర్లకు పిచ్ మరింత అనుకూలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కైల్ జెమీసన్, టిమ్ సౌథీలకు తోడు ప్రమాదకర నీల్ వాగర్ వాంఖడేలో పేస్ నిప్పులు చెరగనున్నాడు. అజాజ్ పటేల్ తొలిసారి కుటుంబ సభ్యుల నడుమ టెస్టు ఆడనున్నాడు. పటేల్‌కు తోడుగా రచిన్ రవీంద్ర స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. తొలి టెస్టులో నిరాశపరిచిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్లు ఇక్కడ భారీ స్కోర్లపై కన్నేశారు. టాప్ ఆర్డర్లో విల్ యంగ్, టామ్ లాథమ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ నుంచి జట్టు మేనేజ్మెంట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
న్యూజిలాండ్ : విల్ యంగ్, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్, టిమ్ సౌథీ, నీల్ వాగర్, అజాజ్ పటేల్.
పిచ్ రిపోర్టు
రెండో టెస్టుకు సహజసిద్ధ వాంఖడే పిచ్‌ను సిద్ధం చేశారు. ఎర్ర మట్టితో చేసిన పిచ్‌పై పేసర్లకు మంచి బౌన్స్ లభించనుంది. టెస్టుకు ముందు వర్షం ఉండటంతో పిచ్ తడిగానే ఉండనుంది. ఇది ఆరంభ రోజుల్లో పేసర్లకు అనుకూలం. చివరి రెండు రోజుల్లోనే స్పిన్నర్ల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తేమతో కూడిన పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.
వర్షం ముప్పు
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు వరుణ గండం పొంచి ఉంది. రెండు రోజులుగా ముంబయిలో వర్షాలతో ప్రాక్టీస్ సైతం కష్టమైంది. బాంద్రా కుర్లా ఇండోర్ కాంప్లెక్స్‌లో కోహ్లిసేన సాధన చేయగా.. న్యూజిలాండ్ క్రికెటర్లు హోటల్ గదులకే పరిమితం అయ్యారు. నేడు సైతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఉదయం సెషన్లో వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. టెస్టు మ్యాచ్‌లో మిగతా నాలుగు రోజులకు పెద్దగా వర్ష సూచనలు లేవు.