Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి, పుజారా, అయ్యర్ విఫలం
- అజాజ్ పటేల్ మ్యాజికల్ ప్రదర్శన
- భారత్ తొలి ఇన్నింగ్స్ 221/4
మయాంక్ అగర్వాల్, వృద్దిమాన్ సాహా.. వాంఖడె టెస్టు తుది జట్టులో నిలుస్తారని పెద్దగా అంచనాలు లేవు. పేలవ ఫామ్‌తో మయాంక్, ఫిట్నెస్ సమస్యతో సాహా రెండో టెస్టులో ఆడేది అనుమానమే అనిపించింది. ముంబయి టెస్టులో ఇప్పుడు ఇద్దరే భారత్‌ను ఆదుకున్నారు. మయాంక్ అగర్వాల్ (120 బ్యాటింగ్) బాధ్యతాయుత శతకంతో చెలరేగగా, వృద్దిమాన్ సాహా (25 బ్యాటింగ్) స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు. అజాజ్ పటేల్ (4/73) మాయకు పుజారా (0), కోహ్లి (0) వైఫల్యంతో 80/3తో కష్టాల్లో కూరుకున్న భారత్‌ను అగర్వాల్, సాహా నిలబెట్టారు. తొలి రోజు ఆటలో 221/4తో భారత్ మెరుగైన స్థితిలో కొనసాగుతోంది.
నవతెలంగాణ-ముంబయి
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (120 బ్యాటింగ్, 246 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. గత 14 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఫిఫ్టీ ప్లస్ మార్క్ అందుకోవటంలో విఫలమైన మయాంక్ అగర్వాల్ జట్టు అత్యంత కష్టాల్లో ఉన్న సమయంలో ఆపద్బాందవుడి అవతారం దాల్చాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (44), శ్రేయస్ అయ్యర్ (18)లతో వరుసగా 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. వృద్దిమాన్ సాహా (25 బ్యాటింగ్, 53 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కాన్పూర్ జోరు కొనసాగించాడు. అగర్వాల్, సాహా ఐదో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జోడించారు. భారత్ తొలి రోజును 221/4తో మెరుగ్గా ముగించింది. ముంబయిలో పుట్టి, కివీస్ తరఫున ఆడుతున్న స్పిన్నర్ అజాజ్ పటేల్ (4/73) సొంతగడ్డపై చెలరేగాడు. మాయజాలంతో భారత టాప్ ఆర్డర్‌ను విలవిల్లాడించాడు. అజాజ్ మాయకు విరాట్ కోహ్లి (0), చతేశ్వర్ పుజారా (0) సహా గిల్, అయ్యర్లు వికెట్ సమర్పించుకున్నారు.
అజాజ్ మాయజాలం : భారత్ 111/3
మ్యాచ్‌కు ముందు రోజు వర్షంతో వాంఖడె అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిసింది. తొలుత చిరు జల్లులు, అనంతరం తడి అవుట్ ఫీల్డ్ ఆట ఆరంభాన్ని ఆలస్యం చేశాయి. టాస్ సైతం ఆలస్యంగా వేశారు. ప్రతికూల వాతావరణంలో లంచ్ విరామం ముందుగానే తీసుకున్నారు. టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (44, 71 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (120 నాటౌట్) తొలి వికెట్‌కు అదిరే ఆరంభం అందించారు. పేసర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన అగర్వాల్ స్పిన్నర్ల రాకతో కుదురుకున్నాడు. యువ బ్యాటర్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లో ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. గిల్, మయాంక్ జోరుతో డ్రింక్స్ విరామానికి భారత్ 71/0తో పటిష్టంగా నిలిచింది.
విరామం అనంతరం న్యూజిలాండ్ పట్టు సాధించింది. గిల్‌ను ఊరించి క్రీజు వదిలేలా చేసిన అజాజ్.. వికెట్ కీపర్ బ్లండెల్ వైఫల్యంతో స్టంపౌట్ మిస్సయ్యాడు. ఆ తర్వాతి బంతికే గిల్ అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో స్లిప్స్‌లో రాస్ టేలర్‌కు దొరికిపోయాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో అజాజ్ పటేల్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. పుజారాపై ఎల్బీడబ్ల్యూ రివ్యూకి వెళ్లి నిరాశపడిన పటేల్.. ఆ తర్వాతి బంతికే పుజారాను క్లీన్ బౌల్డ్ చేశాడు. పునరాగమనంలో కెప్టెన్ విరాట్ కోహ్లి (0) సున్నా పరుగులకే వికెట్ కోల్పోయాడు. పటేల్‌ను ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో రెండు ఓవర్ల వ్యవధిలో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 80/0తో ఉన్న భారత్ అజాజ్ మ్యాజిక్కు 80/3కి పడిపోయింది. తొలి టెస్టు హీరో శ్రేయస్ అయ్యర్ తోడుగా మయాంక్ అగర్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించాడు. సెషన్‌ను భారత్ 111/3తో ముగించింది.
మయాంక్ జోరు : భారత్ 221/4
మయాంక్ అగర్వాల్ (120 బ్యాటింగ్) దూకుడు తొలి రోజు భారత్‌ను నిలబెట్టింది. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 119 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన అగర్వాల్.. ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా కనిపించాడు. అయ్యర్‌తో కలిసి నాల్గో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా భారత్ తిరిగి గాడిలో పడింది. సంయమనంతో ఆడిన అయ్యర్‌ను సైతం అజాజ్ పటేల్ ట్రాప్ చేశాడు. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా (25 బ్యాటింగ్)తో జత కలిసిన మయాంక్ జోరు కొనసాగించాడు. తొలి 17 బంతుల్లో ఒక్క పరుగు చేయని సాహా.. ఆ తర్వాత ఎదురుదాడి చేశాడు.
మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అగర్వాల్ కెరీర్ నాల్గో టెస్టు శతకం నమోదు చేశాడు. బంతి బౌండరీకి చేరకముందే మయాంక్ అగర్వాల్ శతక గర్జన చేశాడు. సాహా తోడుగా చివరి సెషన్లో అజేయంగా 61 పరుగులు జోడించిన అగర్వాల్ భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. జయంత్ యాదవ్, అశ్విన్, అక్షర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత్ 350 పరుగుల స్కోరుపై కన్నేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ మినహా ఎవరూ ప్రభావం చూపలేదు. సౌథీ, పటేల్ సృష్టించిన ఒత్తిడిని మిగతా బౌలర్లు కొనసాగించటంలో తేలిపోయారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ 120, శుభ్‌మన్ గిల్ (బి) పటేల్ 44, చతేశ్వర్ పుజారా (బి) పటేల్ 0, విరాట్ కోహ్లి (ఎల్బీ) పటేల్ 0, శ్రేయస్ అయ్యర్ (సి) బ్లండెల్ (బి) పటేల్ 18, వృద్దిమాన్ సాహా బ్యాటింగ్ 25, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం :(70 ఓవర్లలో 4 వికెట్లకు) 221.
వికెట్ల పతనం : 1-80, 2-80, 3-80, 4-160.
బౌలింగ్ : టిమ్ సౌథీ 15-3-29-0, కైల్ జెమీసన్ 9-2-30-0, అజాజ్ పటేల్ 29-10-73-4, రచిన్ రవీంద్ర 4-0-20-0, డార్లీ మిచెల్ 5-3-9-0.
నలుగురు కెప్టెన్లు!
భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కెప్టెన్సీలో రికార్డు కొట్టింది!. రెండు టెస్టుల సిరీస్‌లో నలుగురు కెప్టెన్లను చూసింది. తొలి టెస్టులో రహానె, విలియమ్సన్ సారథ్యం వహించగా.. రెండో టెస్టుకు కోహ్లి, లాథమ్ కెప్టెన్సీ తీసుకున్నారు. రహానె, జడేజా, ఇషాంత్‌లు ఫిట్నెస్ సమస్యతో దూరమవగా.. విలియమ్సన్ సైతం గాయంతో వాంఖడె టెస్టులో ఆడలేదు.
అవుటా?నాటౌటా?
విరాట్ కోహ్లి ఎల్లీడబ్ల్యూ నిర్ణయంపై రచ్చ మొదలైంది. అజాజ్ పటేల్ వేసిన బంతి తొలుత విరాట్ బ్యాట్‌కు తగులుతూ అదే సమయంలో ప్యాడ్‌కు తగిలింది. ఇది రిప్లేలో స్పష్టంగా కనిపించినా, స్పష్టమైన ఆధారం లేదని టీవీ అంపైర్ వీరెందర్ శర్మ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. టీవీ అంపైర్ కనీసం బాల్ ట్రాకింగ్ కూడా చూడకపోవటం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.