Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ న్యూజిలాండర్ అజాజ్ పటేల్ (10/119) చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. ముంబయిలో జన్మించిన అజాజ్ పటేల్.. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్నాడు. కెరీర్లో తొలిసారి పుట్టిన నగరంలో టెస్టు ఆడుతున్న అజాజ్ పటేల్ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు కూల్చిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు నాలుగు వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్.. రెండో రోజు చివరి ఆరు వికెట్లను సైతం ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ క్యాచ్‌ను రచిన్ రవీంద్ర అందుకోవటంలో అజాజ్ పటేల్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 47.5 ఓవర్లలో 119 పరుగులు ఇచ్చిన పటేల్ 10 వికెట్లు నేలకూల్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టులో (1956) ఇంగ్లాండ్ పేసర్ జిమ్ లేకర్ 10/53తో తొలిసారి ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో వికెట్ల క్లీన్‌స్వీప్ చేశాడు. ఆ తర్వాత భారత జంబో స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. 1999 పాకిస్థాన్ టెస్టులో 10/74తో పదికి పది వికెట్లు ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు. తాజాగా కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ భారత్‌పై వాంఖడె టెస్టులో 10/119తో వికెట్ల క్లీన్‌స్వీప్‌తో కదం తొక్కాడు.
వాంఖడె టెస్టులో ఓటమి కోరల్లో నిలిచిన న్యూజిలాండ్‌కు ఊరటనిచ్చే అంశం అజాజ్ పటేల్ పది వికెట్ల ప్రదర్శనే. అజాజ్ పటేల్ పది వికెట్ల ప్రదర్శనకు భారత డ్రెస్సింగ్‌రూమ్ నుంచి సైతం ప్రశంసలు లభించాయి. భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు అజాజ్ పటేల్‌ను అభినందించారు. అజాజ్ పటేల్‌ను పది వికెట్ల క్లబ్‌లోకి ఆహ్వానిస్తూ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు. ఓ ఎండ్‌లో అజాజ్ పటేల్ బ్యాటర్లను గొప్పగా నియంత్రించినా.. మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఇతర బౌలర్లు సైతం అజాజ్ పటేల్ సృష్టించిన ఒత్తిడిని కొనసాగిస్తే వాంఖడెలో న్యూజిలాండ్ పరిస్థితి భిన్నంగా ఉండేది!.