Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాంఖడెలో భారత్ గెలుపు లాంఛనం
- తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 ఆలౌట్
- భారత్ రెండో ఇన్నింగ్స్ 69/0, ప్రస్తుత ఆధిక్యం 332
వాంఖడె టెస్టుపై టీమ్ ఇండియా పట్టు సాధించింది. అజాజ్ పటేల్ (10/119) చారిత్రక పది వికెట్ల ప్రదర్శనతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు పరిమితమైనా.. పేసర్ మహ్మద్ సిరాజ్ (3/19), స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/8) విజృంభణతో న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకున్న కోహ్లిసేన.. రెండో ఇన్నింగ్స్‌లో 69/0తో పటిష్టి స్థితిలో కొనసాగుతోంది. టెస్టులో మరో మూడు రోజుల ఆట ఉన్న నేపథ్యంలో నేడో, రేపో టీమ్ ఇండియా ఘన విజయానికి రంగం సిద్ధం చేసుకుంది!.
నవతెలంగాణ-ముంబయి
వాంఖడె టెస్టులో టీమ్ ఇండియా గెలుపు లాంఛనం చేసుకుంది. అశ్విన్ (4/8), మహ్మద్ సిరాజ్ (3/19) విజృంభించటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలోనే టాప్ ఆర్డర్లో మూడు ప్రధాన వికెట్లను నేలకూల్చగా.. అశ్విన్ ఎనిమిది ఓవర్లలోనే ఏకంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ (2/14), జయంత్ యాదవ్ (1/13) సైతం రాణించటంతో న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో 62 పరుగులకు కుప్పకూలింది. భారత్ 263 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కైవసం చేసుకుంది. అజాజ్ పటేల్ (10/119) చారిత్రక పది వికెట్ల ప్రదర్శనతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు పరిమితమైంది. మయాంక్ అగర్వాల్ (150, 311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు అక్షర్ పటేల్ (52, 128 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో రాణించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 69/0తో కొనసాగుతోంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్, 75 బంతుల్లో 6 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ 332 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది. నేడు ఉదయం సెషన్లోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి.. న్యూజిలాండ్‌ను ఛేదనకు పిలిచే అవకాశం ఉంది.
మయాంక్ మెరు పులు : ఓవర్‌నైట్ స్కోరుకు భారత్ మరో 104 పరుగులు జోడించింది. శతక హీరో మయాంక్ అగర్వాల్ (150) రెండో రోజు సైతం చెలరేగాడు. 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 150 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ వృద్దిమాన్ సాహా (27) ఓవర్‌నైట్ స్కోరుకే వికెట్ కోల్పోగా.. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (52) అర్థ సెంచరీతో చెలరేగాడు. మయాంక్ నిష్క్రమించినా ఓ ఎండ్‌లో అక్షర్ పటేల్ జోరందుకున్నాడు. జయంత్ యాదవ్ (12) తోడుగా భారత్ స్కోరును ముందుకు నడిపించాడు. అశ్విన్ (0), సిరాజ్ (4) స్వల్ప స్కోర్లకే వికెట్ కోల్పోయారు. 109.5 ఓవర్లలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్‌లో సైతం మయాంక్ అగర్వాల్ (38 నాటౌట్) స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగుతోంది. చివరి సెషన్లో 21 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు మయాంక్, చతేశ్వర్ పుజారా (29 నాటౌట్) అదిరే ఆరంభం అందించారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానంలో పుజారా ఓపెనర్‌గా వచ్చాడు. మూడు ఫోర్లు, ఓ మెరుపు సిక్సర్‌తో దూకుడుగా ఆడిన పుజారా అజేయంగా 29 పరుగులు చేశాడు. మయాంక్ ఆరు ఫోర్లతో అలరించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 69/0తో పటిష్టమైన స్థితిలో కొనసాగుతోంది.
కివీస్ విలవిల : సిరాజ్, అశ్విన్ విజృంభణ
అజాజ్ పటేల్ చారిత్రక పది వికెట్ల ప్రదర్శన ఆనందంతో న్యూజిలాండ్ శిబిరంలో ఎంతోసేపు నిలువలేదు. రెండో సెషన్లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్ పట్టిన న్యూజిలాండ్ పట్టుమని 30 ఓవర్లు కూడా ఆడలేదు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త బంతితో కివీస్‌ను వణికించగా, ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ అశ్విన్ బ్యాటర్లను మాయలో పడేశాడు. కండ్లుచెదిరే స్పెల్‌తో విజృంభించిన మహ్మద్ సిరాజ్ (3/19)తో న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. యంగ్ (4), లాథమ్ (10), టేలర్ (1)లను సిరాజ్ అద్భుత బంతులతో అవుట్ చేశాడు. సిరాజ్ దెబ్బకు 5.1 ఓవర్లలో న్యూజిలాండ్ 17/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మిగతా పని పూర్తి చేశాడు. రెండు వైపులా స్పిన్ దాడి కొనసాగించిన కెప్టెన్ కోహ్లి.. కివీస్‌కు ఊపిరీ తీసుకునే సమ యమూ ఇవ్వలేదు. నికోల్స్ (7), బ్లండెల్ (8), సౌథీ (0), సోమర్‌విలె (0)లను అవుట్ సాగనంపాడు. డార్లీ మిచెల్ (8), కైల్ జెమీసన్ (17)లను అక్షర్ పటేల్ పడగొట్టగా.. కాన్పూర్ టెస్టు హీరో రచిన్ రవీంద్ర (4)ను మరో స్పిన్నర్ జయంత్ యాదవ్ వెనక్కి పంపించాడు. పేస్, స్పిన్‌తో సమిష్టిగా విజృంభించిన భారత్ 28.1 ఓవర్లలోనూ న్యూజిలాండ్‌ను కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 62 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా 263 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సొంతం చేసుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : మయాంక్ (సి) బ్లండెల్ (బి) అజాజ్ 150, గిల్ (సి) టేలర్ (బి) అజాజ్ 44, పుజారా (బి) అజాజ్ 0, కోహ్లి (ఎల్బీ) అజాజ్ 0, అయ్యర్ (సి) బ్లండెల్ (బి) అజాజ్ 18, సాహా (ఎల్బీ) అజాజ్ 27, అశ్విన్ (బి) అజాజ్ 0, అక్షర్ (ఎల్బీ) అజాజ్ 52, జయంత్ (సి) రచిన్ (బి) అజాజ్ 12, ఉమేశ్ నాటౌట్ 0, సిరాజ్ (సి) రచిన్ (బి) అజాజ్ 4, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం :(109.5 ఓవర్లలో ఆలౌట్) 325.
వికెట్ల పతనం : 1-80, 2-80, 3-80, 4-160, 5-224, 6-224, 7-291, 8-316, 9-321, 10-325.
బౌలింగ్ : సౌథీ 22-6-43-0, జెమీసన్ 12-3-36-0, అజాజ్ 47.5-12-119-10, సోమర్‌విలె 19-0-80-0, రచిన్ 4-0-20-0, మిచెల్ 5-3-9-0.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : లాథమ్ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 10, యంగ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 4, మిచెల్ (ఎల్బీ) అక్షర్ 8, టేలర్ (బి) సిరాజ్ 1, నికోల్స్ (బి) అశ్విన్ 7, బ్లండెల్ (సి) పుజారా (బి) అశ్విన్ 8, రచిన్ (సి) కోహ్లి (బి) జయంత్ 4, జెమీసన్ (సి) అయ్యర్ (బి) అక్షర్ 17, సౌథీ (సి) సూర్య (బి) అశ్విన్ 0, సోమర్‌విలె (సి) సిరాజ్ (బి) అశ్విన్ 0, అజాజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం :(28.1 ఓవర్లలో ఆలౌట్) 62.
వికెట్ల పతనం : 1-10, 2-15, 3-17, 4-27, 5-31, 6-38, 7-53, 8-53, 9-62, 10-62.
బౌలింగ్ : ఉమేశ్ 5-2-7-0, సిరాజ్ 4-0-19-3, అక్షర్ 9.1-3-14-2, అశ్విన్ 8-2-8-4, జయంత్ 2-0-13-1.
భారత్ రెండో ఇన్నింగ్స్ : మయాంక్ బ్యాటింగ్ 38, పుజారా బ్యాటింగ్ 29, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం :(21 ఓవర్లలో) 69. బౌలింగ్ : సౌథీ 3-0-14-0, అజాజ్ 9-1-35-0, జెమీసన్ 4-2-5-0, సోమర్‌విలె 2-0-9-0, రచిన్ 1-0-4-0.