Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో సియోంగ్ చేతిలో ఓటమి
- బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్
బాలి (ఇండోనేషియా) : వరుస పరాజయాలు చవిచూసినా, పేలవ ఫామ్‌లో కొనసాగుతున్నా.. మెగా ఈవెంట్లలో మెగా ప్రదర్శన చేయటంలో పి.వి సింధుకు మరొకరు సాటి లేరు. వరుసగా నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్లో కంగుతిన్న సింధు ప్రతిష్టాత్మక బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ కొడుతుందనే అంచనాలను తెలుగు తేజం అందుకోలేదు. సెమీఫైనల్లో అగ్ర షట్లర్ అకానె యమగూచిపై విజయంతో టైటిల్ ఆశలను మరింత రేకెత్తించిన వరల్డ్ నం.7 సింధు ఫైనల్లో వరుస గేముల్లో నిరాశపరిచింది. 39 నిమిషాల మహిళల సింగిల్స్ ఫైనల్లో దక్షిణ కొరియా కొత్త కెరటం సియోంగ్ అన్ 21-16, 21-12తో అలవోక విజయం నమోదు చేసింది. ప్రపంచ టూర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. ఫైనల్లో సింధు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌లో 0-4తో వెనుకంజ వేసిన సింధు విరామ సమయానికి 4-11తో భారీ ఆధిక్యం కోల్పోయింది. ద్వితీయార్థంలో 16-8, 20-12తో సియోంగ్ దూసుకుపోయింది. రెండో గేమ్ ఆరంభంలో సింధు, సియోంగ్ హోరాహోరీగా పోటీపడ్డారు. ప్రతి పాయింట్ కోసం ఉత్కంఠ నెలకొంది. 2-2, 4-4, 5-5, 6-6తో సమవుజ్జీలుగా సాగారు. ఈ సమయంలో వరుసగా నాలుగు పాయింట్లు కొల్లగొట్టిన సియోంగ్ 10-6తో సింధును వెనక్కి నెట్టింది. 8-11తో విరామ సమయానికి ఆధిక్యాన్ని కాస్త తగ్గించినా.. ఆ తర్వాత సియోంగ్ జోరుకు సింధు అడ్డుకట్ట వేయటంలో తేలిపోయింది. 15-9, 20-10తో సియోంగ్ చెలరేగింది. వరుస గేముల్లోనే వరల్డ్ చాంపియన్‌ను ఓడించి ప్రపంచ టూర్ ఫైనల్స్ విజేతగా అవతరించింది.