Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ లక్ష్యం 540, ప్రస్తుతం 140/5
- రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు
- భారత్ రెండో ఇన్నింగ్స్ 276/7 డిక్లేర్డ్
వాంఖడెలో టీమ్ ఇండియా గెలుపు లాంఛనం చేసుకుంది. మూడో రోజే గెలుపొంది సిరీస్ సొంతం చేసుకునే దిశగా సాగినా.. డార్లీ మిచెల్ (60), హెన్రీ నికోల్స్ (36 నాటౌట్) ప్రతిఘటనతో కోహ్లిసేన విజయం నాల్గో రోజుకు వాయిదా పడింది!. మయాంక్ (62), పుజారా (47), గిల్ (47), అక్షర్ (41 నాటౌట్) ధనాధన్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 276/7 వద్ద డిక్లరేషన్ ప్రకటించి, న్యూజిలాండ్‌కు రికార్డు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 140/5తో ఎదురీదుతున్న కివీస్ నేడు ఉదయం సెషన్లోనే అశ్విన్ అండ్ కో మాయకు పడిపోవటం ఖాయమే!.
నవతెలంగాణ-ముంబయి
వాంఖడెలో మాయజాలం కొనసాగుతోంది. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించగా.. మూడో రోజు ఆటలోనూ స్పిన్నర్లదే ఆధిపత్యం. భారత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్నర్లు అజాజ్ పటేల్ (4/106), రచిన్ రవీంద్ర (3/56) రాణించగా.. ఛేదనలో న్యూజిలాండ్ భరతం భారత స్పిన్నర్లు పడుతున్నారు. ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/27), అక్షర్ పటేల్ (1/42) మ్యాజిక్కు న్యూజిలాండ్ అప్పుడే సగం వికెట్లు కోల్పోయింది. 540 పరుగుల భారీ ఛేదనలో న్యూజిలాండ్ 140/5తో ఓటమి కోరల్లో కూరుకుంది. డార్లీ మిచెల్ (60, 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. హెన్రీ నికోల్స్ (36 నాటౌట్, 86 బంతుల్లో 7 ఫోర్లు), రచిన్ రవీంద్ర (2 నాటౌట్, 23 బంతుల్లో) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 276/7 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల భారీ ఆధిక్యంతో కలిపి న్యూజిలాండ్‌కు 540 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మయాంక్ అగర్వాల్ (62, 108 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో ఫామ్ కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్ (47, 75 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), చతేశ్వర్ పుజారా (47, 97 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (41 నాటౌట్, 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. వాంఖడె టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. న్యూజిలాండ్ విజయానికి మరో 400 పరుగులు అవసరం కాగా.. భారత్ సిరీస్ విజయానికి మరో ఐదు వికెట్ల దూరంలో నిలిచింది.
ధనాధన్ దంచుడు : ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ వేగంగా పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (62) దూకుడుగా ఆడాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో చతేశ్వర్ పుజారా (47) సైతం ఎదురుదాడి చేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో పుజారా కదం తొక్కాడు. తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించిన మయాంక్, పుజారాలు స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయారు. అజాజ్ పటేల్‌కు మయాంక్, రచిన్‌కు పుజారా వికెట్ ఇచ్చేశారు. గాయంతో రెండో రోజు ఓపెనర్‌గా రాలేని శుభ్‌మన్ గిల్ (47) ధనాధన్ షో చూపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (36, 84 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) తోడుగా మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. గిల్ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ బాదగా.. కోహ్లి ఓ సిక్సర్, ఓ ఫోర్‌తో మెరిశాడు. ఈ ఇద్దరినీ రచిన్ రవీంద్ర సాగనంపగా.. శ్రేయస్ అయ్యర్ (14) అజాజ్ మాయలో పడిపోయాడు. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (41 నాటౌట్) విజృంభించాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 26 బంతుల్లోనే 41 పరుగులు పిండుకున్నాడు. అక్షర్ పటేల్ జోరుతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా భారీ స్కోరు నమోదు చేసింది. వృద్దిమాన్ సాహా (13), జయంత్ (6) పరిస్థితికి తగ్గట్టు ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చిన అజాజ్ పటేల్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రచిన్ రవీంద్ర మూడు వికెట్లతో మెరిశాడు. 70 ఓవర్లలో 276/7 వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. న్యూజిలాండ్‌కు 540 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
అశ్విన్ మ్యాజిక్ షో : రికార్డు లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ చుక్కలు చూపించాడు. ప్రమాదకరంగా కనిపించిన అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు కివీస్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. ఓపెనర్లు టామ్ లాథమ్ (6), విల్ యంగ్ (20, 41 బంతుల్లో 4 ఫోర్లు) అశ్విన్ వలలో చిక్కుకోగా.. డార్లీ మిచెల్ (60, 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎదురుదాడి చేశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన డార్లీ మిచెల్ వికెట్ల పతనాన్ని నిలువరించాడు. జోరుమీదున్న మిచెల్‌ను అక్షర్ పటేల్ సాగనంపాడు. రాస్ టేలర్ (6) వికెట్‌తో కివీస్‌ను ఓటమి కోరల్లోకి నెట్టాడు అశ్విన్. టామ్ బ్లండెల్ (0)ను సాహా కెఎస్ భరత్, సాహా రనౌట్ చేయటంతో కివీస్ 129/5తో సగం వికెట్లు కోల్పోయింది. హెన్రీ నికోల్స్ (36 నాటౌట్), రచిన్ రవీంద్ర (2 నాటౌట్) మూడో రోజు ఆటలో మరో వికెట్ పడనివ్వలేదు. సుమారు పది ఓవర్ల పాటు ఈ జోడీ క్రీజులో నిలిచి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చుతోంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 325/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 62/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : మయాంక్ (సి) యంగ్ (బి) అజాజ్ 62, పుజారా (సి) టేలర్ (బి) అజాజ్ 47, గిల్ (సి) లాథమ్ (బి) రచిన్ 47, కోహ్లి (బి) రచిన్ 36, అయ్యర్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) అజాజ్ 14, సాహా (సి) జెమీసన్ (బి) రచిన్ 13, అక్షర్ నాటౌట్ 41, జయంత్ (సి,బి) అజాజ్ 6, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (70 ఓవర్లలో 7 వికెట్లకు) 276 డిక్లేర్డ్.
వికెట్ల పతనం :1-107, 2-115, 3-197, 4-211, 5-217, 6-238, 7-276.
బౌలింగ్ : సౌథీ 13-1-31-0, అజాజ్ 26-3-106-4, జెమీసన్ 8-4-15-0, సోమర్‌విలె 10-0-59-0, రచిన్ 13-2-56-3.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : లాథమ్ (ఎల్బీ) అశ్విన్ 6, యంగ్ (సి) సూర్య (బి) అశ్విన్ 20, మిచెల్ (సి) జయంత్ (బి) అక్షర్ 60, టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6, నికోల్స్ నాటౌట్ 36, బ్లండెల్ రనౌట్ 0, రచిన్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(45 ఓవర్లలో 5 వికెట్లకు) 140.
వికెట్ల పతనం :1-13, 2-45, 3-55, 4-128, 5-129.
బౌలింగ్ : సిరాజ్ 5-2-13-0, అశ్విన్ 17-7-27-3, అక్షర్ 10-2-42-1, జయంత్ 8-2-30-0, ఉమేశ్ 5-1-19-0.