Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 నిమిషాల్లోనే ముగిసిన లాంఛనం
- వాంఖడె టెస్టులో భారత్ భారీ విజయం
- అశ్విన్, జయంత్ నాలుగేసి వికెట్లు
- 1-0తో టెస్టు సిరీస్ కోహ్లిసేన వశం
వరల్డ్ నం.1, ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌ను వరల్డ్ నం.2, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రన్నరప్ టీమ్ ఇండియా చిత్తు చేసింది. కాన్పూర్‌లో విజయం వాకిట నిలిచినా.. చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు ఆతిథ్య జట్టును డ్రాతో సరిపెట్టుకునేలా చేశాయి. వాంఖడెలో కివీస్ మతిపోయేలా మాయ చేసిన భారత స్పిన్నర్లు రెండో టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కట్టబెట్టారు. అశ్విన్ (4/34), జయంత్ (4/49) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో 540 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకు కుప్పకూలింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-కాన్పూర్
టెస్టు సిరీస్ టీమ్ ఇండియా వశం. వాంఖడెలో న్యూజిలాండ్‌ను అన్ని విభాగాల్లోనూ చిత్తు చేసిన టీమ్ ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. 540 పరుగుల రికార్డు ఛేదనలో న్యూజిలాండ్ ముందే చేతులెత్తేసింది. రవిచంద్రన్ అశ్విన్ (4/34), జయంత్ యాదవ్ (4/49) వికెట్ల మాయజాలంతో చెలరేగటంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. డార్లీ మిచెల్ (60, 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (44, 111 బంతుల్లో 8 ఫోర్లు) పోరాటం భారత్ విజయాన్ని ఆలస్యం చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం, రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు అర్థ సెంచరీతో కదం తొక్కిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను సాధించిన టీమ్ ఇండియా.. టెస్టు సిరీస్‌లోనూ కివీలను కొట్టి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్‌గా తొలి టెస్టు విజయం, తొలి టెస్టు సిరీస్ విజయం రుచి చూశాడు.
జయంత్ జోరు : ఓవర్‌నైట్ స్కోరు 140/5తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లను వేగంగా కోల్పోయింది. స్పిన్నర్ జయంత్ యాదవ్ మ్యాజిక్‌తో 45 నిమిషాల్లోనే భారత్ లాంఛనం ముగించింది. రచిన్ రవీంద్ర (18) వరుసగా రెండోసారి అవుట్ చేసిన జయంత్ యాదవ్.. కైల్ జెమీసన్ (0), టిమ్ సౌథీ (0)లను ఒకే ఓవర్లో వెనక్కి పంపించాడు. విలియం సోమర్‌విలె (1) సైతం జయంత్ మాయలో పడిపోయాడు. హెన్రీ నికోల్స్ (44) అశ్విన్ ఓవర్లో క్రీజు వదిలి మళ్లీ వెనక్కి రాలేదు. దీంతో 167 పరుగులకు కివీస్ కథ ముగిసింది. 11.3 ఓవర్లలో ఓవర్‌నైట్ స్కోరు మరో 27 పరుగులు జోడించిన న్యూజిలాండ్ మరో రోజు ఆట మిగిలి ఉండగానే చేతులెత్తేసింది. అశ్విన్, జయంత్ జోరుతో మరో బౌలర్ వైపు చూసే అవసరం కెప్టెన్‌కు ఏర్పడలేదు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 325/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 62/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 276/7 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : టామ్ లాథమ్ (ఎల్బీ) అశ్విన్ 6, విల్ యంగ్ (సి) సూర్య (బి) అశ్విన్ 20, డార్లీ మిచెల్ (సి) జయంత్ (బి) అక్షర్ పటేల్ 60, రాస్ టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6, హెన్రీ నికోల్స్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 44, టామ్ బ్లండెల్ రనౌట్ 0, రచిన్ రవీంద్ర (సి) పుజారా (బి) జయంత్ 18, కైల్ జెమీసన్ (ఎల్బీ) జయంత్ 0, టిమ్ సౌథీ (బి) జయంత్ 0, విలియం సోమర్‌విలె (సి) మయాంక్ (బి) జయంత్ 1, అజాజ్ పటేల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం :(56.3 ఓవర్లలో ఆలౌట్) 167.
వికెట్ల పతనం : 1-13, 2-45, 3-55, 4-128, 5-129, 6-162, 7-165, 8-165, 9-167, 10-167.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 5-2-13-0, అశ్విన్ 22.3-9-34-4, అక్షర్ పటేల్ 10-2-42-1, జయంత్ యాదవ్ 14-4-49-4, ఉమేశ్ యాదవ్ 5-1-19-0.
విజేతలుగా సిరీస్‌ను ముగించటం బాగుంది. కాన్పూ ర్లో విజయానికి చేరువగా వచ్చాం, కానీ చివరి వికెట్ తీయలేకపోయాం. వాంఖడెలో బాగా శ్రమించాల్సి వచ్చింది. ఫలితం ఏకపక్షంగా కనిపించినా.. భారత్ కఠోరంగా కష్టపడింది. కొన్నిసార్లు వెనుకంజలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి, పుంజుకున్న ఘనత జట్టుదే. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో మెరిసిన కుర్రాళ్లకే ఈ గెలుపు ఘనత దక్కుతుంది. అక్షర్ పటేల్ బంతితోనూ రాణించటం సంతోషం. దీంతో జట్టు వనరులు విస్తృతం అవుతాయి. తుది జట్టు ఎంపిక తీపి తలనొప్పి మంచిదే. భవిష్యత్‌లో ఈ తలనొప్పులు ఎక్కువగా ఉండనున్నాయి. ఆటగాళ్లతో ఎంపిక విషయంలో స్పష్టత ఉన్నంతవరకు ఇది పెద్ద సమస్య కాదు'
- రాహుల్ ద్రవిడ్, భారత చీఫ్ కోచ్
వాంఖడె పిచ్‌పై బౌలింగ్ ఆస్వాదించాను. ఇది అద్భుతమైన పిచ్. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏదో ఉంటుంది. అజాజ్ పటేల్ పది వికెట్ల ప్రదర్శన అద్వితీయం. సరైన చోట అజాజ్ బంతులు సంధించాడు. అజాజ్ పటేల్ బౌలింగ్ చూడటాన్ని ఆస్వాదించాను. నాతో మాట్లాడేందుకు హర్యానా నుంచి చెన్నైకి వచ్చిన ఏడాది 2014 నుంచి జయంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అక్షర్‌తో కలిసి పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాను. దక్షిణాఫ్రికా పర్యటనలో నా బాధ్యత నిర్వర్తించి సిరీస్ విజయంతో ముగించాలని భావిస్తున్నాను'
- అశ్విన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్
కెప్టెన్‌గా పునరాగమన మ్యాచ్‌లోనే విజయం గొప్పగా ఉంది. కాన్పూర్‌లోనూ బాగా ఆడాం, వాంఖడెలో ఇంకా మెరుగ్గా ఆడాం. మెరుగు పడాల్సిన అంశాలపై చర్చించుకుని బరిలోకి దిగాం. ఇక్కడ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచటంలో సఫలమయ్యాం. అందరం భారత క్రికెట్‌కు సేవ చేస్తున్నాం. గత మేనేజ్మెంట్ ఆ విషయంలో గొప్పగా పని చేసింది. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ వచ్చారు, ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు లేదు. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లమే సమిష్టి లక్ష్యం. ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తామనే నమ్మకం మాది. దక్షిణాఫ్రికా పర్యటన మాకు మంచి సవాల్. అక్కడ టెస్టు సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్నాం. ఈ కఠిన సవాల్‌కు జట్టులోని అందరం ఆసక్తిగా ఉన్నాం'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
పరుగులు చేయటం బాగుంది. ఈ శతకం నాకు ఎంతో ప్రత్యేకం. నిజాయితీగా చెప్పాలంటే, కాన్పూర్ టెస్టు కంటే భిన్నంగా ఇక్కడ ఏమీ చేయలేదు. మానసిక క్రమశిక్షణతో ఆడటం ఒక్కటే తేడా. సిరీస్ మధ్యలో టెక్నిక్ గురించి ఆలోచన అవసరం లేదని కోచ్ ద్రవిడ్ చెప్పారు. ఈ టెక్నిక్‌తోనే నీవు పరుగులు సాధించావు, బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగు. నీ ప్రణాళికలకు కట్టుబడు.. పరుగులు అవే వస్తాయని అన్నాడు. నా బ్యాట్ కాస్త తక్కు ఎత్తులో ఉంచమని గవాస్కర్ సూచించాడు. తొలుత ఆ పని చేయలేదు. కానీ ఆ సలహా గొప్పగా పనికొచ్చింది. ప్రతి ఇన్నింగ్స్‌లో శతకం కోసం ఆలోచన లేదు. కానీ మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోవాలి. దక్షిణాఫ్రికాలో భిన్నమైన సవాల్ కోసం ఎదురు చూస్తున్నాను'
- మయాంక్ అగర్వాల్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్