Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్రికా టూర్లో అతనికే పగ్గాలు
- 10 వన్డే మ్యాచులకు కెప్టెన్‌గా సక్సెస్
- ఎనిమిదింటిలో విజయం...రెండింటిలో ఓటమి
- రోహిత్ కెప్టెన్సీలో ఆడనున్న కోహ్లీ
ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 తర్వాత వన్డేల కెప్టెన్సీని కూడా రోహిత్ శర్మకు అప్పగించబోతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే పర్యటన కోసం భారత జట్టులో ఎవరెవరు ఉంటారో.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన పది వన్డే మ్యాచుల్లో ఎనిమిదింటిలో విజయం సాధించగా..కేవలం రెండింటిలో మాత్రమే పరాజయం పాలైంది. రోహిత్ వన్డే కెప్టెన్‌గా సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతో..బీసీసీఐ అతని వైపే మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బోర్డు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ నెలలోనే భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉన్నది. ఇక్కడ జట్టు 3 టెస్టులు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నది. అయితే ఆఫ్రికాలో ఒమిక్రాన్ విజృంభించటంతో..ఈ పర్యటన కొనసాగుతుందా..!లేదా..! అనే అనుమానాలు క్రీడాభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
న్యూజిలాండ్‌తో ఆడిన టీ..20కి కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ..20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకున్నది. రాహుల్ ద్రవిడ్‌కు కోచ్‌గా ఇదే తొలి సిరీస్ కావటం విశేషం.
టీ..20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్
ప్రపంచకప్ తర్వాత టీ..20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి వన్డే జట్టు కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకే అప్పగించే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతోంది. టెస్టు జట్టుకు విరాట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా రోహిత్‌ను ప్రశంసించాడు. రోహిత్ టీ20.. వన్డేలకు మంచి కెప్టెన్ అని అంటున్నాడు.
డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు
ఈ పర్యటనలో భాగంగా.. డిసెంబర్ 26 నుంచి భారత్ తొలి టెస్టు ఆడాల్సి ఉన్నది. అదే సమయంలో జనవరి 3 నుంచి జనవరి 7 వరకు రెండో టెస్టు, జనవరి 11 నుంచి జనవరి 15 వరకు మూడో టెస్టు జరగనున్నాయి. కాగా, తొలి వన్డే వచ్చే (2022)జనవరి 19న జరగనున్నది. అదే సమయంలో రెండో వన్డే 21న, మూడో వన్డే జనవరి 23న జరగనున్నది.
2017 తర్వాత తొలిసారి ఇద్దరు కెప్టెన్లు
2017 తర్వాత తొలిసారిగా టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఎంపిక కానున్నారు. ఇంతకు ముందు 2014 నుంచి 2017 వరకు భారత జట్టులో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. 2014లో ధోనీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, విరాట్ కోహ్లీ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మారాడు. అదే సమయంలో వన్డేలు, టీ20ల్లో ధోనీ కెప్టెన్‌గా ఆడుతున్నాడు.ఆ తర్వాత, కోహ్లి 2017 నుంచి మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలిగాక..రోహిత్,కోహ్లి భారత జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లుగా మారనున్నారు.