Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే కెప్టెన్సీ మార్పుపై గంగూలీ
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్, అత్యంత విజయవంతమైన వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు వేయటంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. బీసీసీఐ, గంగూలీ, జై షాలను ట్యాగ్ చేస్తూ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లిపై వేటుతో భారత క్రికెట్‌ను తిరిగి 15 ఏండ్ల క్రితం నాటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్‌గా తప్పించటంపై సీనియర్ సెలక్షన్ కమిటీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో బోర్డు తెలియజేసింది. నాయకత్వ మార్పు అంశంలో గతంలో చేదు అనుభవం చవిచూసిన స్వీయ అనుభవం బోర్డు అధ్యక్షుడు గంగూలీకి ఉంది. దాదా కనుసన్నల్లో విరాట్ కెప్టెన్సీ మార్పును అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా తప్పించడానికి గల కారణాలు, దారితీసిన పరిస్థితులపై గంగూలీ స్పందించాడు.
' కెప్టెన్సీ మార్పు సెలక్షన్ కమిటీ, బోర్డు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం. నిజానికి, టీ20 కెప్టెన్‌గా తప్పుకోవద్దని విరాట్ కోహ్లికి బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కోహ్లి అంగీకరించలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరైనది కాదని సెలక్షన్ కమిటీ ఆలోచన. దీంతో విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. రోహిత్ శర్మకు వైట్‌బాల్ కెప్టెన్సీ అప్పగించారు. బోర్డు అధ్యక్షుడిగా నేను విరాట్ కోహ్లితో మాట్లాడాను. సెలక్షన్ కమిటీ చైర్మన్ సైతం కోహ్లితో మాట్లాడారు. రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. విరాట్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతాడు. విరాట్ నాయకత్వంలోని టెస్టు జట్టుపై బోర్డుకు అపార నమ్మకం ఉంది. వైట్‌బాట్ ఫార్మాట్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సేవలకు బోర్డు కృతజ్ఞతలు తెలుపుతోంది' అని గంగూలీ అన్నాడు.