Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్సీపై రోహిత్ శర్మ మనోగతం
కెప్టెన్సీ మార్పు, జట్టులో లుకలుకలు, డ్రెస్సింగ్‌రూమ్ విభేదాలు భారత క్రికెట్‌కు కొత్త కాదు. ఎం.ఎస్ ధోని నాయకత్వ సమయంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో గుణాత్మక మార్పు కనిపించింది. మహి నాయకత్వ వారసులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తొలగింపు అత్యుత్తమ బ్యాటర్‌కు అవమానమనే మాటలు వినిపిస్తున్నా.. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి భిన్నంగా కనిపించే వీలుంది. కెప్టెన్ కోహ్లికి బ్యాటర్ రోహిత్ శర్మ ఏ విధంగా దన్నుగా నిలిచాడో.. ఇప్పుడు కెప్టెన్ రోహిత్‌కు బ్యాటర్ కోహ్లి అదే తరహాలో మద్దతుగా నిలుస్తాడనే అంచనాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. భారత వన్డే కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ నాయకత్వంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నవతెలంగాణ-ముంబయి
జట్టుకు విరాట్ అవసరం :
విరాట్ కోహ్లి వంటి నాణ్యమైన బ్యాటర్ జట్టుకు ఎప్పుడూ అవసరం. టీ20 ఫార్మాట్లో కోహ్లి సగటు 50కి పైగా ఉంది, అది నమ్మశక్యం కాని గణాంకాలు. ఆ అనుభవంతోనే విరాట్ కోహ్లి భారత్‌కు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందించాడు.
అదే నాయకుడి బాధ్యత :
కెప్టెన్ బాధ్యతలు తెలుసుకోవటం ప్రపంచానికి అవసరం. సరైన ఆటగాళ్లు, సరైన కాంబినేషన్‌ను బరిలోకి దింపుతున్నామా?లేదా? అనేది చూసుకోవటంతో పాటు కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేయటమే నాయకుడి బాధ్యత. రాణిస్తున్నప్పుడు జట్టును ముందుండి నడిపించటం, మిగతా సమయాల్లో వెన్నంటి నిలిచేవాడే కెప్టెన్. ఆటగాడి భుజం తట్టి, మద్దతుగా నిలువటం ఎంతో ముఖ్యం. జట్టులో అత్యంత అప్రధాన ఆటగాడిగానే కెప్టెన్ ఉండాలి.
మైదానంలో 20 శాతమే! :
కెప్టెన్‌గా నా పాత్ర మైదానం వెలుపలే ఎక్కువ. బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు వారి బాధ్యతలను అప్పగించటం, రాణించేలా అండగా నిలవడటం. ఒక్కసారి మైదానంలోకి అడుగుపెడితే మనకు ఉన్నది మూడు గంటల సమయమే. ఆ సమయంలో పెద్దగా చేయగలిగేది ఏం ఉండదు. 11 మంది ఆటగాళ్లను వినియోగంచుకోవటమే మైదానంలో చేసే పని. మైదానంలో పెద్దగా మార్పులు చేయలేం. కెప్టెన్‌గా 80 శాతం పని పూర్తిగా మైదానం వెలుపలే ఉంటుంది, మైదానంలో కెప్టెన్ పని కేవలం 20 శాతమే. ముంబయి ఇండియన్స్ తరఫున ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందుకున్నాను. కానీ ముంబయి ఇండియన్స్ విజయంలో నా పాత్ర పరిమితమే. జట్టు మేనేజ్మెంట్ బలమైన జట్టును తయారు చేయటంతోనే అది సాధ్యపడింది.
ఆ పరిస్థితుల్లో ప్రణాళిక ఏంటీ? :
గత మూడు ఐసీసీ ఈవెంట్లలో (2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్) ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పలేం. కానీ మ్యాచ్ ఆరంభ దశల్లోనే భారత్ వెనుకంజ వేసిందని నా భావన. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యంత దారుణ పరిస్థితులను అంచనా వేసుకుని అందుకు సిద్ధంగా ఉండటమే నా ప్రణాళిక. తొలి ఐదు ఓవర్లలోనే 10/3తో జట్టు కష్టాల్లో కూరుకున్నప్పుడు బ్యాటింగ్ లైనప్‌లో నం.3, నం.4, నం.5, నం.6 బ్యాటర్లు చేయాల్సిన పనిపై ముందుగానే సిద్ధంగా ఉండాలి. 10/3తో దారుణ స్థితిలో ఉన్నప్పుడు 190 పరుగులు చేయలేం. రెండు ఓవర్లలోనే 10/2తో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటీ? అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ప్రపంచకప్‌కు ముందు అటువంటి పరిస్థితుల కోసం కొన్ని మ్యాచులు ఆడాం. భారత్ ఓడిన మ్యాచుల్లో ప్రత్యర్థి జట్ల బౌలింగ్ విభాగం అసమానం. ఇలా భారత్‌కు మూడుసార్లు జరిగింది (రెండుసార్లు పాక్‌పై, ఓసారి న్యూజిలాండ్‌పై). నాల్గోసారి అటువంటి సందర్భం పునరావృతం కాదనే ఆశిస్తున్నానని రోహిత్ శర్మ అన్నాడు.