Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ స్పోర్ట్స్ డెస్క్
టీమిండియాకు కోచ్ రవిశాస్త్రి భారత్ తరఫున 80టెస్టులు, 150 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అతడు భారత క్రికెట్‌జట్టులో సభ్యునిగా ఉన్న కాలంలో టీమిండియా ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్ టైటిల్, 1985లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అలాగే క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్ కూడా రవిశాస్త్రినే. 1985 రంజీట్రోఫీలో తిలక్‌రాజ్ వేసిన బౌలింగ్‌లో రవిశాస్త్రి ఏకంగా ఆరు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అలాగే 1987-88లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై మద్రాస్ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ టెస్ట్‌లో టీమిండియా 255 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆ టెస్ట్‌లోనే అరంగేట్రం చేసిన నరేంద్ర హిర్వాణీ(8/75) అద్భుత బౌలింగ్‌తో విండీస్‌ను చిత్తుచేశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొంతకాలం తర్వాత రవిశ్రాస్త్రి 2017లో భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సిఏసి) ఎంపిక చేసింది. ఆ కమిటీలో అప్పట్లో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న కాలంలోనే భారతజట్టు టెస్టుల్లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో భాగంగా భారతజట్టు టెస్ట సిరీస్‌లను గెలిచి చరిత్ర సృష్టించింది. ఇంతటి అద్భుత విజయాలను టీమిండియాకు అందించిన రవిశాస్త్రికి ఈ కాలంలోనే మరో మూడు ప్రధాన ఐసిసి టోర్నీల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ-2017(ఫైనల్): 2017 వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా.. భారత్ 30.4 ఓవర్లలో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. లండన్ వేదికగా జరిగిన టోర్నీలో భారత్ తొలిసారి ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది.
వన్డే ప్రపంచకప్-2019(సెమీఫైనల్): 2019 ఐసిసి వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. లీగ్ దశలో భారత్ 7 గెలిచి ఒక మ్యాచ్‌లో ఓటమితో అగ్రస్థానంలో ఉన్నా.. సెమీస్‌లో నాల్గో స్థానంలో ఉన్న కివీస్ చేతిలో 17పరుగుల తేడాతో ఓడింది. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేస్తే.. ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది.
2021 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్: రెండేండ్ల తర్వాత భారతజట్టు అద్భుత విజయాలను నమోదు చేస్తూ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ గదను న్యూజిలాండ్ గెలుచుకోగా.. భారత్ రన్నరప్‌గా నిలిచింది.
టి20 ప్రపంచకప్-2021(లీగ్ దశ): ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-2లో భారత్ 3 విజయాలలు, 2 పరాజయాలతో 3వ స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది.
(ఇవన్నీ రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న కాలంలో భారత్ టైటిల్ చేజిక్కించుకోవడానికి ముందు ఓడిన సందర్భాలు..)