Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్‌పై తెలుగు తేజం గురి
- నేటి నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్స్
వెల్వా (స్పెయిన్)
బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో రెండో రజత పతకం, ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్లలో వరుసగా సెమీఫైనల్స్ ప్రదర్శన. గత రెండు నెలలుగా ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు ఫామ్. అంచనాలు, ఫామ్‌లతో సంబంధం లేకుండా మెగా టోర్నీల్లో మెగా ప్రదర్శన చేయటంలో సింధు ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ సింధు అదే పునరావృతం చేసేందుకు చూస్తోంది. నిరుడు ప్రపంచ చాంపియన్‌గా అద్వితీయ విజయంతో అదరగొట్టిన సింధు.. ఈ ఏడాది టైటిల్ నిలుపుకునేందుకు బరిలోకి దిగుతోంది. ఈ ఏడాదిని అత్యుత్తమంగా ముగించటంపై దృష్టి నిలిపిన సింధు ప్రపంచ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరేట్‌గా వేట మొదలుపెట్టనుంది. నేటి నుంచి 2021 బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ పోటీలు ఆరంభం.
మంచి అవకాశం! : 26 ఏండ్ల పి.వి సింధుకు టైటిల్ నిలుపుకునేందుకు మంచి అవకాశం ఉంది. గత టోర్నీల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన సింధు మెగా ఈవెంట్లో దుమ్మురేపాలని చూస్తోంది. డిఫెండింగ్ చాంపియన్, ఆరో సీడ్ సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో సింధుకు స్లోవేకియా షట్లర్ మార్టినా రెపిస్కా ఎదురు కానుంది. అగ్ర షట్లర్ సింధును ఢకొీట్టే సత్తా స్లోవేకియా షట్లర్‌కు లేదు. ప్రీ క్వార్టర్స్‌లోనే సింధుకు సిసలైన సవాల్ ఎదురు కానుంది. థారులాండ్ చిన్నది, తొమ్మిదో సీడ్ పొర్నపవీ చొచువాంగ్ ఇక్కడ సింధుకు గట్టి సవాల్ విసరనుంది. క్వార్టర్ఫైనల్లోనే సింధు మెగా సవాల్ అధిగమించాల్సి ఉంటుంది. టాప్ సీడ్, వరల్డ్ నం.1 తైజుయింగ్‌తో సింధు క్వార్టర్స్‌లో తలపడే అవకాశం ఉంది. సెమీఫైనల్లో చైనా స్టార్ హీ బింగ్జియావ్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అగ్ర షట్లర్లతో ఆడినప్పుడు మరింత రెచ్చిపోయే సింధు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మెరుపు ప్రదర్శనకు రంగం సిద్ధం చేసుకుంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో స్పెయిన్ ఆటగాడు పాబ్లో అబియన్‌తో తలపడనున్నాడు. టోక్యో ఒలింపియన్ బి. సాయిప్రణీత్ తొలి రౌండ్లో డచ్ ఆటగాడు మార్క్‌తో పోటీపడనున్నాడు. హెచ్.ఎస్ ప్రణరు తొలి మ్యాచ్‌లో కఠిన ప్రత్యర్థిని ఎదుర్కొనుండగా.. యువ షట్లర్ లక్ష్యసేన్ ప్రత్యర్థి వైదొలగటంతో నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి తొలి రౌండ్లో బై లభించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట తొలి రౌండ్లో 14వ సీడ్ జోడీతో తలపడనుంది.
స్టార్స్ దూరం : బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కళ తప్పింది!. ఏడాది చివరి టోర్నీలో అగ్ర షట్లర్లు అందరూ టైటిల్ కోసం పోరాడటం చూశాం. స్పెయిన్‌లో జరుగుతున్న టోర్నీలో లోకల్ స్టార్, రియో ఒలింపిక్ విజేత కరొలినా మారిన్ సైతం ఆడటం లేదు. ఫిట్నెస్ కారణాలతో మారిన్ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైంది. ఇండోనేషియా బ్యాడ్మింటన్ బృందం పూర్తిగా టోర్నీకి హాజరు కావటం లేదు. మెన్స్ సింగిల్స్ రెండుసార్లు విజేత కెంటో మోమోట (జపాన్), మహిళల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్ సైతం టోర్నీ నుంచి తప్పుకున్నారు.