Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైట్‌బాల్ కెప్టెన్సీపై విరుద్ధ ప్రమాణాలు
- మహిళల, పురుషుల క్రికెట్లో భిన్న వైఖరి
- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వింత వ్యాఖ్యలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వంద్వ నీతి పాటిస్తోంది. వైట్‌బాల్ ఫార్మాట్లో వన్డే, టీ20 ఫార్మాట్లకు భిన్న సారథులు అవసరం లేదని విరాట్ కోహ్లిపై వేటు వేస్తూనే.. మరోవైపు మహిళల క్రికెట్లో వైట్‌బాల్ ఫార్మాట్లకు ఇద్దరు సారథుల ఫార్ములాను కొనసాగిస్తోంది. దాదా ద్వంద్వ నీతిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
'వైట్‌బాల్ ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లను కలిగి ఉండటం సరైనది కాదు. సీనియర్ సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ఈ అంశంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి' విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్‌గా తొలగించటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఇవి. గతంలో ఐదు రోజుల ఆట, 50 ఓవర్ల ఫార్మాట్లు మాత్రమే ఉండేవి. కొత్తగా టీ20 ఫార్మాట్ దూసుకొచ్చింది. జాతీయ జట్లకు ఫార్మాట్‌కో నాయకుడు సారథ్యం వహించటం చూశాం. రెండు ఫార్మాట్ల స్థానంలో మూడు ఫార్మాట్లు రావటంతో మున్ముందు ఇద్దరు కెప్టెన్ల స్థానంలో ముగ్గురు కెప్టెన్లు వచ్చే అవకాశం లేకపోలేదు. ఆధునిక క్రికెట్లో చోటుచేసుకున్న మార్పులు జాతీయ జట్టు నాయకత్వంపైనా ప్రభావం చూపించాయి. అధిక శాతం జాతీయ జట్లకు వైట్‌బాల్, రెడ్‌బాల్ ఫార్మాట్లకు భిన్న సారథులను కలిగి ఉన్నాయి. కుంబ్లే-ధోని, ధోని-కోహ్లి అనంతరం భారత్‌లో ఇద్దరు కెప్టెన్ల విధానం మరోసారి తెరపైకి వచ్చింది. సమవుజ్జీలు, భారత క్రికెట్ సూపర్‌స్టార్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రెడ్‌బాల్, వైట్‌బాల్ ఫార్మాట్ కెప్టెన్లు వ్యవహరించనున్నారు. ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్సీ రికార్డున్న రోహిత్ శర్మను వన్డే, టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేయటం సరైన నిర్ణయమే. కానీ విరాట్ కోహ్లిపై వేటుకు బోర్డు, సెలక్షన్ కమిటీ సహేతుక కారణాలతో రాలేదు. అత్యుత్తమ వన్డే కెప్టెన్‌ను తప్పించే సమయంలో పాటించాల్సిన కనీస విలువలను సైతం బోర్డు విస్మరించింది. విరాట్ కోహ్లి వన్డే కెప్టెన్సీపై వేటు వివాదానికి బీసీసీఐ బాస్ గంగూలీ వివరణ మరింత ఆజ్యం పోసింది. దాదా వ్యాఖ్యలు బీసీసీఐ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయి.
మహిళల క్రికెట్లో అలా, పురుషుల క్రికెట్లో ఇలా..! : వైట్‌బాల్ ఫార్మాట్ (వన్డే, టీ20)లో ఇద్దరు కెప్టెన్ల విధానం సరైనది కాదనే అంశంలో సీనియర్ సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. వైట్‌బాల్ ఫార్మాట్‌కు ఒకే నాయకుడిని కలిగి ఉండటం మంచిదే. ఆ విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయానికి తావు లేదు. అయితే, ఇదే ఫార్ములా మహిళల క్రికెట్‌కు వర్తించదా? అనేది తెరపైకి వస్తుంది. మహిళల క్రికెట్లో వైట్‌బాల్ ఫార్మాట్లో భారత్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. టీ20 ఫార్మాట్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా.. వన్డే ఫార్మాట్లో మిథాలీరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. 2018 టీ20 వరల్డ్‌కప్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోనే మిథాలీరాజ్ ఆడింది. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నా.. వన్డే, టెస్టుల్లో కొనసాగుతోంది. వైట్‌బాల్ ఫార్మాట్లో ఇద్దరు సారథులు వద్దు అనే ఫార్ములాకు బీసీసీఐ కట్టుబడితే, మహిళల క్రికెట్లోనూ ఒకే సారథిని ఎంపిక చేయాలి.
వన్డే కెప్టెన్సీ వదులుకునేందుకు విరాట్ కోహ్లికి బోర్డు రెండు రోజులు గడువు ఇచ్చింది. విరాట్ కోహ్లి రాజీనామాకు ససేమిరా అనటంతో బీసీసీఐ అధికార కొరఢా ఝులిపించింది. కనీస వివరణ లేకుండా విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. అభిమానుల ఆగ్రహంతో మరుసటి రోజు బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సేవలను గుర్తు చేసుకుంది.
మహిళల క్రికెట్‌పై చిన్నచూపా?: వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండకూడదనే సూత్రాన్ని బీసీసీఐ విశ్వసిస్తోంది. మెన్స్ క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలకు ఇచ్చిన విలువ, బీసీసీఐ మహిళల క్రికెట్లో ఐసీసీ టైటిళ్లకు ఇవ్వటం లేదా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ విషయంలో బోర్డు వివరణ ఇచ్చుకోవాలి. ఇప్పటికే మహిళల క్రికెట్ షెడ్యూల్‌ను పక్కనపెడుతున్న బీసీసీఐ.. కీలక నాయకత్వ విషయంలోనూ పెద్దగా శ్రద్ధ వహించటం లేదు. బోర్డు పగ్గాలు మాజీ కెప్టెన్‌కు దక్కిన అనంతరం జాతీయ జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌లో నాయకత్వం విషయంలో మరోసారి విభేదాలకు మార్గం ఏర్పడటం గర్హనీయం.