Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఓఏ అధ్యక్ష బరిలో రాజ్‌నాథ్ తనయుడు
- ఇప్పటికే బీసీసీఐలో తిష్ట వేసిన అమిత్ షా కుమారుడు
నవతెలంగాణ క్రీడావిభాగం
విద్వేష మార్గంలో, విధ్వంస పాలనతో అన్ని వర్గాలను కష్టాల్లోకి నెడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తాజాగా క్రీడా రంగంపై కన్నేసినట్టు కనిపిస్తోంది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్‌ను నడిపించే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు తిష్ట వేయగా..తాజాగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అడుగులు పడుతున్నాయి. అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐని నడిపిస్తున్న తీరు, ప్రధాన ఆటగాళ్లతో వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ రానున్న ఎన్నికల్లో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
ముందస్తు ప్రణాళిక : రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఈ ఏడాది ఆగస్టులో భారత ఫెన్సింగ్ సంఘం (ఐఎఫ్ఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్‌నాథ్ సింగ్ సహా ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశమైన అనంతరమే పంకజ్ సింగ్ ఫెన్సింగ్ సంఘం బాస్‌గా లాంఛనంగా ఎన్నికయ్యాడు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పంకజ్ సింగ్ అధ్యక్ష ఎన్నికకు మార్గం సుగమం చేసేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పలుకుబడిని వాడుకునేందుకు సిద్ధమైంది. అధికార బీజేపీ అండదండలతోనే పంకజ్ సింగ్ అధ్యక్ష రేసులో నిలుస్తున్నట్టు తెలుస్తోంది. ఐఓఏ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రాజీవ్ మెహతా మరోసారి ఆ పదవికి పోటీ చేసే అవకాశం లేదు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ నిబంధనలు అందుకు అంగీకరించవు. అధ్యక్ష పదవిపై ఆశ ఉన్నప్పటికీ నరెందర్ బత్రాను ఢకొీట్టే సత్తా లేదు. నరెందర్ బత్రాకు చెక్ పెట్టేందుకు మెహతా చూస్తుండగా.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారంపై బీజేపీ కన్నేసింది. దీంతో పంకజ్ సింగ్ రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగనున్నాడు.
ఎన్నిక వాయిదా : భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా మరో దఫా ఎన్నికయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న నరెందర్ బత్రాకు చివరి నిమిషంలో షాక్ తగిలింది. డిసెంబర్ 19న ఐఎఏకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకోసం నరెందర్ బత్రా అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. ఎన్నికల్లో అధ్యక్ష పదవి పదిలం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలపై న్యాయస్థానంలో కేసు వేయటంతో బత్రా స్పీడ్‌కు బ్రేక్ పడింది. నేషనల్ స్పోర్ట్స్ కోడ్‌కు విరుద్ధంగా భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయనే పిటిషనును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. కోర్టు కేసు నేపథ్యంలో డిసెంబర్ 19న ఐఓఏ జనరల్ బాడీ సమావేశం మాత్రమే నిర్వహించనున్నారు. ఎన్నికలకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) వచ్చే ఏడాది జనవరి వరకు గడువు ఇచ్చింది.
బత్రా లాబీయింగ్ : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నా నరెందర్ బత్రా పట్టు వీడటం లేదు. గత వారం ఆసియా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడితో సమావేశమైన బత్రా.. తనకు అనుకూలమైన లేఖను తెచ్చుకున్నాడు. ప్రభుత్వ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఆసియా ఒలింపిక్ కమిటీలు ఐఓఏకు లేఖ రాశాయి. రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే ఐఓసీ అనుమతితోనే జరగాలని లేఖలో స్పష్టం చేసేలా బత్రా విజయవంతమయ్యాడు.
నిబంధనల మార్పు! : పంకంజ్ సింగ్‌ను ఐఓఏ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టేందుకు త్వరలోనే భారత ఒలింపిక్ సంఘం నిబంధనల్లో మార్పు చేయనున్నారు. ఐఓసీ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం అధ్యక్ష, కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు గతంలో ఆ పదవుల్లో కొనసాగి ఉండాలి. లేదా ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (చివరి 5) సభ్యుడిగానైనా ఉండాలి. పంకజ్ సింగ్ ఈ నిబంధన ప్రకారం అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు అనర్హుడు. జనరల్ బాడీ సభ్యులు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండాలని జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా కోరుతున్నారు. ఈ నిబంధనలో మార్పులు చేసిన అనంతరం వచ్చే ఏడాది రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆ లోపు నరెందర్ బత్రాను సైతం పక్కకు తప్పించి పంకజ్ సింగ్ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా కేంద్ర బీజేపీ పెద్దలు ప్రయత్నం చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది.