Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో సఫారీతో టెస్టు సిరీస్‌కు దూరం
- దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రియాంక్ పంచల్ ఎంపిక
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించాలనే ఉత్సాహంతో ఉన్న టీమ్ ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ. వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సఫారీతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయానికి గురైన రోహిత్ శర్మ మూడు టెస్టుల సిరీస్‌లో ఆడటం లేదు. గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పంచల్‌ను రోహిత్ శర్మ స్థానంలో టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు.
నవతెలంగాణ-ముంబయి
భారత్ సవాల్‌గా భావిస్తున్న దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్, ప్రధాన బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. రోహిత్ శర్మ తొడ కండరం గాయానికి గురయ్యాడు. దీంతో భారత్, దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ ఓపెనర్, భారత-ఏ కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ సారథ్యంలోని బీసీసీఐ ఆల్ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుతో ఆరంభం కానుంది. సఫారీ పర్యటనకు ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు జొహనెస్బర్గ్కు బయల్దేరాల్సి ఉంది.
నెట్స్‌లోనే గాయం : దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే రోహిత్ శర్మ గాయం బారిన పడినట్టు తెలుస్తోంది. జొహనెస్బర్గ్కు బయల్దేరడానికి ముందు భారత జట్టు మూడు రోజుల క్వారంటైన్లో గడపనుంది. క్వారంటైన్‌కు ముందు రోహిత్ శర్మ నెట్ సెషన్లో చెమటోడ్చాడు. దక్షిణాఫ్రికా పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌లో మార్పులు చేసుకుని సాధన చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తొడ కండరం గాయానికి గురయ్యాడు. క్వారంటైన్లోకి అడుగుపెట్టకముందే రోహిత్ శర్మ గాయం బయటపడింది. దీంతో రోహిత్ శర్మను టెస్టు సిరీస్ జట్టు నుంచి తప్పించారు. టెస్టు జట్టులో లేకపోయినా.. వన్డే సిరీస్ కోసం రోహిత్ జట్టుతో పాటు ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లి స్థానంలో వన్డే కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాలో మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్ వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో జరుగనుంది. దీంతో రోహిత్ శర్మ ఈ వారంలో జట్టుతో పాటే పయనం కానున్నాడు. వన్డే సిరీస్‌కు జట్టును ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది!.
గత 12 నెలల సమయంలో రోహిత్ శర్మ గాయం కారణంగా రెండోసారి కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఐపీఎల్ అనంతరం విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ మూడు, నాల్గో టెస్టుల్లోనే ఆడాడు. రోహిత్ శర్మ లేకపోవటం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఐదు రోజుల ఆటలోనూ అత్యంత కీలక ఆటగాడు. 10కి పైగా ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్లలో రిషబ్ పంత్‌కు మాత్రమే 40కి పైగా సగటు ఉంది. 2019లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన నాటి నుంచి 16 టెస్టుల్లో 58.48 సగటుతో 1462 పరుగులు పిండుకున్నాడు. రోహిత్ శర్మ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మకు గాయంతో టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అజింక్య రహానెకు అప్పగిస్తారా? లేదా మరో ఆటగాడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనింగ్ సమస్య? : రోహిత్ శర్మకు గాయంతో టెస్టు జట్టులో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు మిగిలారు. అన్క్యాప్డ్ ప్రియాంక్ పంచల్ మూడో ఓపెనర్‌గా వ్యవహరించనున్నాడు. విదేశీ గడ్డపై ఓపెనర్‌గా రాణించిన శుభ్‌మన్ గిల్ ఇప్పటికే గాయంతో సఫారీ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. మరో యువ ఓపెనర్ పృథ్వీ షా అందుబాటులో ఉన్నప్పటికీ.. సెలక్టర్లు ప్రియాంక్ పంచల్‌కు ఓటేశారు. ప్రియాంక్ పంచల్ అంతర్జాతీయ సర్క్యూట్లో పరిచయం కాలేదు కానీ, గత కొన్నేండ్లుగా భారత్-ఏ తరఫున అతడు రెగ్యులర్ ఆటగాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో భారత్-ఏ జట్టుకు పంచల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అక్కడ పంచల్ 96 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 2016-17 రంజీ సీజన్ నుంచి ప్రియాంక్ పంచల్ జోరు మొదలైంది. 1310 పరుగులతో ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 87.33 సగటుతో 17 ఇన్నింగ్స్‌లోనే చితకబాదాడు. ఆ సీజన్లో పంజాబ్‌పై అజేయంగా 314 పరుగుల ట్రిపుల్ సెంచరీ సాధించాడు. పంచల్ మెరుపులతో ఆ సీజన్లో గుజరాత్ రంజీ విజేతగా నిలిచింది. పార్థీవ్ పటేల్ అనంతరం గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలు పంచల్ అందుకున్నాడు. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు తోడుగా ప్రియాంక్ పంచల్ ఓపెనింగ్ సమస్యను అధిగమించేలా చేస్తాడేమో చూడాలి.