Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టులకు రోహిత్, వన్డేలకు కోహ్లి దూరం!
- టెస్ట్ ఓపెనర్‌గా ప్రియాంక్‌కు అవకాశం
ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆదివారం ప్రాక్టీస్ సెషన్లో తొడ కండరాలగాయంతో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడని బిసిసిఐఐ ప్రకటించింది. ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ గాయపడ్డాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతడి స్థానంలో ప్రియాంక్ పాంచాల్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం పక్కనపెడితే, ఇప్పుడు విరాట్ కోహ్లీ జట్టుకు కొత్త ట్విస్ట్ ఇచ్చినట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. మంగళవారం ఈ మేరకు ఓ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్ సమయానికి రోహిత్ కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ అప్పటికీ రోహిత్ కోలుకోకపోతే ఏం చేయాలని విషయం ఇప్పుడు సెలెక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి రోహిత్ ఫిట్నెస్ నిరూపించుకుంటే వన్డే సిరీస్‌కు బయల్దేరాల్సి ఉంటుంది. అంతకుముందు దక్షిణాఫ్రికాలో రోహిత్ క్వారంటైన్, బయో బబుల్ ప్రోటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. సఫారీ పర్యటనకు వెళ్లే భారతజట్టు సభ్యులంతా కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం ముంబయిలోని హోటల్స్‌లో ఉన్నారు.
ప్రియాంక్ పంచల్‌కు జాక్‌పాట్
రోహిత్ శర్మ గాయపడడంతో టీమిండియా ఓపెనర్‌గా గుజరాత్‌కు చెందిన ప్రియాంక్ పంచల్ ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న ప్రియాంక్ ఇండియా-ఏ తరఫున 40.0 యావరేజ్‌తో 120 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా-ఏపై ప్రియాంక్ అత్యధిక స్కోర్ 96 పరుగులు. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 45.52 యావరేజ్‌తో 7,011 పరుగులు చేశాడు. అందులో 24 సెంచరీలు కూడా ఉన్నాయి.
పెద్ద ఎదురుదెబ్బ: గంభీర్
టెస్టు సిరీస్‌లో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై పెద్ద లోటేనని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్‌లో ఉన్న రోహిత్ టెస్టు సిరీస్‌లో లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించాడు. గాయంతో రోహిత్ దూరం కావడంతో అతడి స్థానంలో ప్రియాంక్ పాంచాల్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావడంపై గంభీర్.. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశం గర్వపడేలా ఆడాలని సూచించాడు. కాగా, రోహిత్ ఇటీవలే టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.