Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బిసిసిఐ తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బిసిసిఐ అధికారులు తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని పేర్కొన్న విషయమై క్లారిటీ ఇచ్చింది. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలను బిసిసిఐ కొట్టి పారేసింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పునకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని వెల్లడించింది. 'విరాట్ కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే అతడితో చర్చలు జరిపాం. మా ఆలోచనతో ఏకీభవించని కోహ్లీ.. టీ20 పగ్గాలను వదులుకునేందుకే సిద్ధపడ్డాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. జట్టులో సమన్వయం లోపిస్తుందని బిసిసిఐ భావించింది. దీంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని నిర్ణయించింది. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ కోహ్లీతో ముందుగానే చర్చించాడు' అని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గతంలో బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ కూడా టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండు రోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు.