Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి వ్యాఖ్యలపై గంగూలీ స్పందన
కోల్‌కత: వైట్‌బాల్ ఫార్మాట్లో నాయకత్వ మార్పు భారత క్రికెట్లో అలజడి సృష్టిస్తోంది. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని బీసీసీఐ నాతో చెప్పలేదని, గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు సమాచారం ఇచ్చారని విరాట్ కోహ్లి మీడియా సమావేశంలో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా కోహ్లి మాట్లాడటంతో దుమారం రేగింది. విరాట్ కోహ్లి వ్యాఖ్యలపై గంగూలీ స్పందనకు నిరాకరించాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ మీడియా సమావేశంలో కోహ్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తాడనే వార్తలొచ్చాయి. కానీ బీసీసీఐ ఆ దిశగా అడుగు వేసేందుకు విముఖంగా కనిపించింది. ' ప్రకటన లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. మేము చూసుకుంటాం. ఈ విషయాన్ని బోర్డుకు వదిలేయండి' అని గంగూలీ అన్నాడు. విరాట్ కోహ్లి, గంగూలీ విరుద్ధ వ్యాఖ్యల వ్యవహారంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ స్పందించారు. 'నిజానికి కోహ్లి బోర్డుకు ఇందులోకి లాగలేదు. కోహ్లికి ఈ సమాచారం తెలియజేసిన వ్యక్తి విషయంలోనే ఈ రగడ. దీనిపై గంగూలీ మాత్రమే స్పష్టత ఇవ్వగలడు. నిజానికి ఇందులో వివాదం ఎక్కడుంది?. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు సెలక్షన్ కమిటీ సమాచారం ఇచ్చింది. సెలక్షన్ కమిటీ సమావేశంలో సెలక్టర్లదే తుది నిర్ణయం. కెప్టెన్ కో ఆప్టెడ్ సభ్యుడు, ఓటు హక్కు ఉండదు. ఓ ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశాం, ఓ ఆటగాడిని ఎందుకు ఎంపిక చేయలేదనే అంశంలో సెలక్షన్ కమిటీ మీడియా ముందుకొచ్చి వివరణ ఇస్తే ఊహాగానాలకు తావుండదు. కనీసం పత్రికా ప్రకటనలోనైనా వివరణ ఇస్తే బాగుంటుంది' అని గవాస్కర్ అన్నాడు. బహిరంగ వ్యాఖ్యలు క్రికెట్‌కు మేలు చేయవని కపిల్ దేవ్ హితవు పలికాడు. ' ఒకరికొకరు వేలెత్తి చూపించటం మంచిది కాదు. సఫారీ పర్యటన ముందుంది. ఆటపై దృష్టి నిలపటం ముఖ్యం. బోర్డు ప్రెసిడెంట్ అంటే బోర్డు ప్రెసిడెంటే. కెప్టెన్ సైతం ముఖ్యమైన వ్యక్తే. బహిరంగంగా ఇలా విరుద్ధ వ్యాఖ్యలు మంచిది కాదు. అది గంగూలీ, కోహ్లిలలో ఎవరైనా కావచ్చు' అని కపిల్ అన్నాడు.