Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తైజుయింగ్‌తో తాడోపేడో
- శ్రీకాంత్ సైతం క్వార్టర్స్‌లో అడుగు
* బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
వెల్వా (స్పెయిన్)
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు రాణిస్తున్నారు. మహిళల సింగిల్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ సత్తా చాటుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో దూసుకుపోతుంది. ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసిన తెలుగు తేజం మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. థారులాండ్ షట్లర్ పొర్నపవీ చొచువాంగ్‌పై 21-14, 21-18తో వరుస గేముల్లో గెలుపొందిన సింధు మెగా టోర్నీల్లో మెరుపు ఫామ్ కొనసాగిస్తోంది. 48 నిమిషాల ప్రీ క్వార్టర్స్ సమరంలో వరల్డ్ నం.10 పొర్నపవీపై వరల్డ్ నం.7 సింధు పైచేయి సాధించింది. ఈ ఏడాది పొర్నపవీ, సింధు రెండు సార్లు తలపడగా.. ఆ రెండింటా థారులాండ్ చిన్నది పైచేయి సాధించింది. ప్రపంచ టూర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లలో సింధుపై పొర్నపవీ విజయం సాధించగా.. ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికగా సింధు ప్రతీకారం తీర్చుకుంది. వరుస గేముల్లోనే పొర్నపవీని చిత్తు చేసి లెక్క సరి చేసింది. తొలి గేమ్‌లో సింధు 5-1తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. పొర్నపవీ పుంజుకుని 4-5, 9-10తో ఆధిక్యాన్ని కుదించింది. 15-10తో సింధు ముందంజ వేసింది. 19-11తో ఎటువంటి ప్రతిఘటనకు తావులేకుండా తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. సింధు 3-0తో ముందంజ వేసింది. విరామ సమయానికి 11-6తో ఆధిక్యం నిలుపుకుంది. ద్వితీయార్థంలో పొర్నపవీ గట్టిగా ప్రతిఘటించింది. సుదీర్ఘ ర్యాలీలు సాగిన గేమ్‌లో థారులాండ్ షట్లర్లు విలువైన పాయింట్లు సాధించింది. 16-10తో ఆధిక్యంలో ఉన్న సింధును 15-18, 18-19తో వెంబడించింది. ఆఖర్లో లాంగ్ ర్యాలీ పాయింట్ సాధించిన సింధు 20-18తో ముందంజ వేసింది. రెండో గేమ్‌ను, క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. తొలి రౌండ్లో సింధుకు బై లభించగా, రెండో రౌండ్లో స్లోవేకియా షట్లర్‌పై 21-7, 21-9తో ఏకపక్ష విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తైజుయింగ్‌తో తాడోపేడో: మరో ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ షట్లర్, వరల్డ్ నం.1 తైజుయింగ్ 21-10, 19-21, 21-11తో విజయం సాధించింది. నేడు కీలక క్వార్టర్ఫైనల్లో తైజుయింగ్‌తో సింధు తలపడనుంది. తైజుయింగ్‌తో సింధు ముఖాముఖి రికార్డు చెప్పుకోదగినట్టుగా లేదు. 14-5తో చైనీస్‌తైపీ షట్లర్ ఎదురులేని స్థితిలో కొనసాగుతోంది. గత నాలుగు మ్యాచుల్లోనూ సింధుపై తైజుయింగ్ విజయాలు నమోదు చేసింది. టోక్యో ఒలింపిక్స్, వరల్డ్ టూర్ ఫైనల్స్, మలేషియా మాస్టర్స్, ఫ్రెంచ్ ఓపెన్‌లో తైజుయింగ్ చేతిలో సింధు పరాజయాలు చవిచూసింది. మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తున్న సింధు నేడు తైజుయింగ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తైజుయింగ్ కోసం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సింధు నేడు క్వార్టర్ఫైనల్లో పైచేయి సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది.
క్వార్టర్స్‌లో శ్రీకాంత్: పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ సైతం క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 40 నిమిషాల మ్యాచ్‌లో చైనా షట్లర్ జులుపై శ్రీకాంత్ ఘన విజయం సాధించాడు. 21-10, 21-15తో వరుస గేముల్లోనే చైనా షట్లర్‌ను చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో 11-4తో దూసుకెళ్లిన శ్రీకాంత్ ఏకపక్ష విజయం సాధించాడు. రెండో గేమ్‌లో జులు పాయింట్లు సాధించినా శ్రీకాంత్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేదు. 8-8తో స్కోరు సమమైనా.. విరామ సమయానికి 11-8తో శ్రీకాంత్ ఆధిక్యంలో నిలిచాడు. 15-8, 19-13తో ముందంజ వేసి రెండో గేమ్‌తో పాటు క్వార్టర్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. కీలక క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ షట్లర్ మార్క్ కాలోవ్తో శ్రీకాంత్ తలపడనున్నాడు. వరల్డ్ నం.14 శ్రీకాంత్‌తో మార్క్ తలపడటం ఇదే తొలిసారి కానుంది. డబుల్స్ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 13-21, 15-21తో వరుస గేముల్లో ఓటమి పాలైంది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 20-22, 21-18, 15-21తో మలేషియా జోడీతో పోరాడి ఓడింది.