Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్‌పై 3-1తో ఘన విజయం
- ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ
ఢాకా (బంగ్లాదేశ్): వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్‌తో పొరుగు దేశం పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అదిరే విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండుసార్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచటంతో హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ దాదాపుగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఐదు జట్లు పోటీపడుతున్న టోర్నీలో భారత్ రెండు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌పై 9-0తో గెలుపొందిన భారత్.. కొరియాతో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది.
చాంపియన్లు పోటీపడిన మ్యాచ్‌లో భారత్ ఆద్యంతం ఆధిపత్యం చూపించింది. తొలి రెండు క్వార్టర్లలో భారత్ దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలోనే హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా కొట్టాడు. రెండో క్వార్టర్లోనూ భారత్ దూకుడు తగ్గలేదు. పాకిస్థాన్ గోల్‌కీపర్, డిఫెన్స్ ఆకట్టుకుంది. భారత్ గట్టి ప్రయత్నాలు చేసినా, సమర్థవంతంగా నిలువరించింది. ప్రథమార్థం ఆట ముగిసేసరికి భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మూడో క్వార్టర్లో భారత్ మరో గోల్ సాధించింది. అక్షదీప్ సింగ్ 42వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో మెరిశాడు. 2-0 ఆధిక్యంతో చివరి క్వార్టర్‌కు వచ్చిన భారత్‌ను పాక్ దీటుగా ఎదుర్కొంది. చివరి పది నిమిషాల్లో పాక్ ధనాధన్ ఆటతో దూసుకొచ్చింది. ఉత్కంఠగా సాగిన పోరులో పాక్ 45వ నిమిషంలో జునైద్ మంజూర్తో గోల్ కొట్టింది. 53వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-1కు తీసుకెళ్లాడు. చివర్లో పాక్ రెండు పెనాల్టీ కార్నర్లు పొందినా.. భారత రక్షణశ్రేణి నిలువరించింది. 57వ నిమిషంలో భారత్ పెనాల్టీ కార్నర్ సాధించినా వరుణ్ కుమార్ ప్రయత్నాన్ని పాక్ అడ్డుకుంది. 3-1తో గెలుపొందిన భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది.