Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగు
- యువ లక్ష్యసేన్‌పై సాధికారిక విజయం
తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారత పురుష షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ రికార్డు నెలకొల్పాడు. సహచర యువ షట్లర్ లక్ష్యసేన్‌తో ఉత్కంఠభరిత సెమీఫైనల్లో సాధికారిక విజయం నమోదు చేసిన మాజీ వరల్డ్ నం.1 శ్రీకాంత్ టైటిల్ పోరులో అడుగుపెట్టాడు. సెమీస్‌లో పోరాడి ఓడిన లక్ష్యసేన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. నేడు పసిడి కోసం శ్రీకాంత్ పోటీపడనున్నాడు.
వెల్వా (స్పెయిన్)
అడుగు పడింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ పసిడి కోసం తొలి సారి భారత్ పోటీలో నిలిచింది. ఆల్ ఇండియన్ సెమీఫైనల్లో విజయం సాధించిన కిదాంబి శ్రీకాంత్ ఈ ఘనత దక్కించుకున్నాడు. ప్రకాశ్ పదుకొణె, బి. సాయిప్రణీత్‌లు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించగా.. ఇప్పుడు ఆ జాబితాలో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ చేరిపోయారు. 70 నిమిషాల హోరాహోరీ సెమీఫైనల్లో 12వ సీడ్ కిదాంబి శ్రీకాంత్ పైచేయి సాధించాడు. 17-21, 21-14, 21-17తో యువ లక్ష్యసేన్‌పై విజయం నమోదు చేశాడు. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించి దిగ్గజాల సరసన నిలిచిన శ్రీకాంత్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్ పతకం ఖాయం చేసుకున్నాడు. ఫైనల్లో అడుగుపెట్టి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నాడు.
ఆద్యంతం ఉత్కంఠభరితం! : ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ నిలకడగా పతకాలు సాధిస్తున్నా.. అది మహిళల విభాగానికే పరిమితం. మెన్స్ సింగిల్స్ విభాగంలో ఇప్పటివరకు రెండు పతకాలే వచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు భారత షట్లర్లు సెమీఫైనల్‌కు చేరటంతో రెండు పతకాలు లాంఛనం అయ్యాయి. అటు కిదాంబి శ్రీకాంత్, ఇటు లక్ష్యసేన్ సెమీస్‌కు చేరుకున్నా.. ఫైనల్లో బెర్త్ కోసం ముఖాముఖి తలపడాల్సి రావటంతో మరింత ఆసక్తి రేపింది. లక్ష్యసేన్ భీకర ఫామ్‌లో ఉండగా.. కిదాంబి శ్రీకాంత్ వైఫల్యాల బాట వీడి ఆత్మవిశ్వాసంతో రాణిస్తున్నాడు. సెమీఫైనల్లో అంచనాలకు తగినట్టే కిదాంబి శ్రీకాంత్ దూకుడుగా ఆడాడు. తొలి గేమ్‌లో ఆరంభం నుంచీ ముందంజ వేశాడు. 2-0, 4-2, 6-4తో ఆధిక్యం నిలుపుకుంటూ ముందుకు సాగాడు. నెమ్మదిగా పుంజుకున్న లక్ష్యసేన్ 6-6తో స్కోరు సమం చేశాడు. విరామ సమయానికి 11-8తో ఆధిక్యం సాధించాడు. ద్వితీయార్థంలోనూ 15-12తో ముందంజ వేశాడు. లక్ష్యసేన్‌పై ఒత్తిడి పెంచిన శ్రీకాంత్ వరుస పాయింట్లతో 16-16తో సమవుజ్జీగా నిలిచాడు. 17-16తో ముందంజ వేసి విజయం దిశగా సాగాడు. ఈ సమయంలో లక్ష్యసేన్ మ్యాజిక్ చూపించాడు. వరుసగా ఐదు పాయింట్లు సాధించి 21-17తో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌ను శ్రీకాంత్ నెమ్మదిగా మొదలెట్టాడు. 2-4, 4-5తో వెనుకంజలో నిలిచినా విరామ సమయానికి 11-9తో ఆధిక్యం సాధించాడు. కోర్టు మార్పుతో శ్రీకాంత్ జోరు మరింత పెరిగింది. 13-10, 16-12, 17-14, 19-14తో దూసుకెళ్లాడు. 21-14తో రెండో గేమ్‌ను సులువుగా సొంతం చేసుకున్నాడు.
శ్రీకాంత్, లక్ష్యసేన్ చెరో గేమ్ నెగ్గటం మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు దారితీసింది. ఇక్కడా శ్రీకాంత్ ఆరంభంలో తడబాటుకు లోనయ్యాడు. 3-1తో ముందంజ వేసినా విరామ సమయానికి 9-11తో ఆధిక్యం కోల్పోయాడు. ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకున్న కిదాంబి వరుస పాయింట్లు సాధించాడు. లక్ష్యసేన్‌తో సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించిన శ్రీకాంత్ క్రాస్ కోర్టు స్మాష్‌లు, నెట్ డ్రాప్స్, డిసెప్సివ్ షాట్లతో రాణించాడు. 16-16తో లక్ష్యసేన్ స్కోరు సమం చేసి ఒత్తిడి పెంచినా.. ఉత్కంఠ మ్యాచ్‌లో శ్రీకాంత్‌దే పైచేయిగా నిలిచింది. 18-16, 19-16, 20-17తో శ్రీకాంత్ మూడో గేమ్‌ను ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడిన కిదాంబి శ్రీకాంత్ ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో లయ అందుకున్నాడు. అద్వితీయ ఆటతీరుతో ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్లోకి చేరుకున్న తొలి భారత పురుష షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. సెమీఫైనల్లో సీనియర్ షట్లర్ శ్రీకాంత్‌కు గట్టి పోటీనిచ్చిన లక్ష్యసేన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతకంతో అసమాన పోరాటాన్ని ముగించాడు.