Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు సిరీస్ విజయంపై పుజారా
- గాంధీ-మండేలా ఫ్రీడం సిరీస్
సెంచూరియన్ (దక్షిణాఫ్రికా) : విదేశీ గడ్డపై టెస్టు మ్యాచులు కాదు టెస్టు సిరీస్ విజయాలు అలవాటుగా మార్చుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో విదేశీ పర్యటనల్లో అద్వితీయ ప్రదర్శనలు కనబరిచిన భారత జట్టు తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. టెస్టు క్రికెట్ చరిత్రలో సఫారీ గడ్డపై టీమ్ ఇండియా సంప్రదాయ ఫార్మాట్లో సిరీస్ విజయం సాధించలేదు. గత పర్యటనలో ఆతిథ్య సఫారీ జట్టుకు గట్టి పోటీనిచ్చినా సిరీస్ విజయం మాత్రం దక్కలేదు. ఈ సారి ఎలాగైనా దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ సాధించాలనే తపనతో కనిపిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డిసెంబర్ 26న బాక్సింగ్ డే రోజున ఆరంభం కానుంది. సెంచూరియన్‌లో టీమ్ ఇండియా రెండు రోజులుగా కఠోర సాధన చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్ అనంతరం టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా మీడియాతో మాట్లాడాడు. సఫారీ గడ్డపై సిరీస్ విజయం సాధించేందుకు ఇదే సరైన సమయమని పుజారా పేర్కొన్నాడు.
'విదేశాల్లో ఆడిన ప్రతిసారీ ఇరు జట్లకు భారత పేస్ బౌలర్లే వ్యత్యాసం ఆస్ట్రేలియాతో సిరీస్‌లో చూసినా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో చూసినా..పేసర్లు గొప్ప ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనలోనే అదే ప్రదర్శన పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాం. పేస్ బౌలర్ల భారత జట్టు బలం. ఈ పరిస్థితుల్లో భారత పేస్ బౌలింగ్ విభాగం ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ 20 వికెట్లు కూల్చుతారనే నమ్మకం ఉంది. స్వదేశంలో విలువైన టెస్టు క్రికెట్ ఆడటం మేలు చేసేదే. జట్టులోని అందరూ టచ్‌లో ఉన్నారు. సహాయక సిబ్బంది అమోఘంగా సహకరిస్తున్నారు. సఫారీ సిరీస్‌కు మెరుగ్గా సన్నద్ధతమవు తున్నాం. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం సాధించేందుకు ఇదే మాకు మంచి అవకాశం. అందుకోసం జట్టులోని అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని చతేశ్వర్ పుజారా అన్నాడు.
తొలి టెస్టు కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో క్రికెటర్లు సాధన చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లకు తోడు ప్రత్యేకంగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ సైతం చేశారు. ఫిట్నెస్ కోసం రాహుల్ ద్రవిడ్ సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్లతో సమయం గడుపుతున్న రాహుల్ ద్రవిడ్ దగ్గరుండి నెట్ సెషన్‌ను మదింపు చేస్తున్నాడు!.