Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత బ్యాడ్మింటన్‌లో నవ చరిత్ర
- ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం సొంతం
- పసిడి పోరులో పోరాడి ఓడిన తెలుగు తేజం
- బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ 2021
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నవ చరిత్ర. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక పసిడి పోరులో చివరి వరకు పోరాడిన తెలుగు తేజం సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. మూడేండ్లుగా టైటిల్ లేకుండా పేలవ ఫామ్‌లో కొనసాగుతున్న కిదాంబి శ్రీకాంత్ ఎట్టకేలకు మెడల్ పోడియంపై మెరిశాడు. చారిత్రక ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతకంతో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం లిఖించాడు. యువ షట్లర్ లక్ష్యసేన్ కాంస్య పతకం సాధించాడు.
వెల్వా (స్పెయిన్)
కిదాంబి శ్రీకాంత్ ఖతర్నాక్ ఘనత సాధించాడు. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత పురుష క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ వరుస గేముల్లో అనూహ్య ఓటమి చెందాడు. 15-21, 20-22తో సింగపూర్ సంచలనం కీన్ యేవ్కు పసిడి పతకం కోల్పోయాడు. 43 నిమిషాల ఉత్కంఠ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లేలా కనిపించినా.. అనూహ్యంగా వరుస గేముల్లో ఓటమితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ చేతిలో ఓడిన భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత పురుష షట్లర్లు రెండు పతకాలే సాధించారు. ప్రకాశ్ పదుకొణె, బి. సాయిప్రణీత్ మాత్రమే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కాంస్య పతకాలు గెల్చుకున్నారు. తాజాగా కిదాంబి శ్రీకాంత్ రజత పతకంతో చరిత్ర సృష్టించగా.. బరిలో నిలిచిన తొలి ఏడాదే కాంస్య పతకం సాధించిన లక్ష్యసేన్ గురువు ప్రకాశ్ పదుకొణెకు తగ్గ శిష్యుడిగా నిలిచాడు. ఇదిలా ఉండగా మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నం.1 తైజుయింగ్ (చైనీస్ తైపీ)పై 21-14, 21-11తో వరుస గేముల్లో విజయం సాధించిన అకానె యమగూచి (జపాన్) పసిడి పతకం కైవసం చేసుకుంది.
పోరాడినా..! : పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ పసిడి పోరులో ఫేవరేట్‌గా బరిలో నిలిచినా నిరాశ తప్పలేదు. సింగపూర్ ఆటగాడు కీన్‌తో శ్రీకాంత్ గతంలో ఓసారి తలపడ్డాడు. కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ జట్టు విభాగం తరఫున కిదాంబి శ్రీకాంత్ అతడిపై అలవోక విజయం సాధించాడు. వరల్డ్ నం.22, అన్‌సీడెడ్ కీన్ యేవ్పై పెద్దగా అంచనాలు లేవు. కానీ సెమీఫైనల్లో టైటిల్ ఫేవరేట్ డెన్మార్క్ షట్లర్ అంటోన్సెన్‌పై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖాముఖి రికార్డులో పైచేయితో కిదాంబి శ్రీకాంత్ ఫైనల్లో సులువునేగా పసిడి పట్టేస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఫైనల్ ఆరంభం నుంచే సింగపూర్ ఆటగాడు మంచి ప్రదర్శన చేశాడు. తొలి గేమ్‌లో 3-3 నుంచి 9-3కి దూసుకెళ్లిన శ్రీకాంత్ ఆ తర్వాత జోరు కొనసాగించలేదు. 11-7తో విరామ సమయానికి ఆధిక్యం నిలుపుకున్నప్పటికీ ద్వితీయార్థంలో లయ కోల్పోయాడు. వరుస పాయింట్లతో 11-11తో స్కోరు సమం చేసిన సింగపూర్ షట్లర్ 17-13తో శ్రీకాంత్‌ను వెనక్కి నెట్టాడు. అదే ఊపులో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. తాడోపేడో తేల్చుకోవాల్సిన రెండో గేమ్‌లో కిదాంబి శ్రీకాంత్ రెచ్చిపోయాడు. 6-4, 9-6, 11-9తో ప్రథమార్థంలో ఆధిక్యం నిలుపుకున్నాడు. విరామ సమయం అనంతరం సైతం శ్రీకాంత్ ముందంజలో కొనసాగాడు. 14-14 తర్వాత 16-14, 18-16తో దూసుకెళ్లాడు. ఈ సమయంలో కీన్ 20-18తో శ్రీకాంత్‌ను వెనక్కి నెట్టాడు. రెండు సార్లు మ్యాచ్ పాయింట్‌ను అధిగమించిన శ్రీకాంత్ 20-20తో స్కోరు సమం చేశాడు. గేమ్‌ను సూపర్టైబ్రేకర్కు తీసుకెళ్లాడు. టైబ్రేకర్‌లో సింగపూర్ షట్లర్ పైచేయి సాధించాడు. శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లతో పాటు చారిత్రక పసిడి పతకాన్ని సైతం జారవిడుచుకున్నాడు.