Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విహారి, అయ్యర్ చోటుపై ఆసక్తి
- భారత్, దక్షిణాఫ్రికా ఫ్రీడం సిరీస్
దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక తొలి టెస్టు సిరీస్ విజయానికి అవసరమైన ఆయుధ సంపత్తి భారత్ వద్ద ఉండవచ్చు. కానీ ఏ సమయంలో ఏ ఆయుధం వాడాలనే విషయంలో వ్యూహ చతురతే ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు దోహదం చేస్తుంది. ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. తుది జట్టు కూర్పులో పొరపాట్లకు గతంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గాంధీ-మండేలా ఫ్రీడం సిరీస్‌లో ద్రవిడ్-కోహ్లి ద్వయం కూర్పు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుందా?! ఆసక్తికరం.
తుది జట్టు కూర్పు. జట్టును విజయ పథంలో నడిపించటంలో అత్యంత కీలక పాత్ర దీనిదే. పరిస్థితులు, ప్రత్యర్థి బలాలు, బలహీనతలు అంచనా వేసి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలి. తుది జట్టు కూర్పుతోనే కెప్టెన్ 75 శాతం పని పూర్తి చేస్తాడు. తుది జట్టు కూర్పు అంశంలో విరాట్ కోహ్లి భిన్నమైన పంథా అవలంభించాడు. కొన్ని సాహోసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని నిరుత్సాహకర నిర్ణయాలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో టెస్టు సిరీస్ విజయాలు సాధించిన విరాట్ కోహ్లి తాజాగా దక్షిణాఫ్రికా గడ్డపైనా ఆ ఘనత దక్కించుకోవాలనే తపనలో ఉన్నాడు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రాకతో సఫారీ గడ్డపై టీమ్ ఇండియా చారిత్రక సిరీస్ విజయంపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. తుది జట్టు కూర్పులో పలు సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. బాక్సింగ్ డే టెస్టుకు టీమ్ ఇండియా సరైన కూర్పుతో రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు తేజం హనుమ విహారికి తుది జట్టులో చోటుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
జట్టు ఆటగాడు 'హనుమ' : తెలుగు క్రికెటర్ హనుమ విహారి పరిపూర్ణ జట్టు ఆటగాడు. జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకైనా వెనుకాడడు. ఈ విషయంలో స్వల్ప కెరీర్లోనే విహారి నిరూపించుకున్నాడు. హనుమ విహారి ఆడిన 12 టెస్టుల్లో ఏకంగా 11 మ్యాచులు విదేశీ గడ్డపై ఆడాడు. అతి తక్కువ మ్యాచుల్లోనే అత్యంత ప్రభావశీల ప్రదర్శనలు కనబరిచాడు. అరంగేట్రంలో నాణ్యమైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఓవల్‌లో అర్థ సెంచరీ, డ్యూక్ బాల్స్‌పై కరీబియన్ బౌలింగ్ దళంపై 93, 111 ఇన్నింగ్స్‌లు, క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌పై ఎదురుదాడితో కూడిన 55లకు తోడు చారిత్రక సిడ్నీ టెస్టులో అశ్విన్ తోడుగా 237 నిమిషాల సహనశీల ఇన్నింగ్స్ హనుమ విహారి సొంతం. 32.84 బ్యాటింగ్ సగటుతో హనుమ విహారి ఆకట్టుకున్నాడు. గణాంకాల పరంగా చూసినప్పుడు విహారి ప్రదర్శనపై భిన్న అభిప్రాయం రావచ్చు. కానీ విహారి ఆడిన ప్రతి టెస్టులోనూ సవాళ్లలతో కూడిన పరిస్థితుల్లో, ప్రపంచ శ్రేణి పేస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. హనుమ విహారి ఆడిన ఆ 11 విదేశీ టెస్టుల్లో టీమ్ ఇండియా ప్రధాన బ్యాటర్ల సగటు చూస్తే తెలుగు తేజం తెగువ తెలుస్తుంది. పుజారా (34.00), విరాట్ కోహ్లి (32.11) సగటు కలిగి ఉండగా అజింక్య రహానె (38.94) ముందంజలో ఉన్నాడు. పరుగుల వరద పారించే జీవం లేని ఉపఖండ పిచ్‌లపై విహారికి అవకాశం రాలేదు.
అయ్యర్ పోటీ! : స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ రాణించటంతో సెంచూరియన్ టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూర్పుపై ఆసక్తి నెలకొంది. అరంగేట్రంలో అయ్యర్ 105, 65 పరుగుల ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. భారత పిచ్‌లపై పేసర్ల ప్రభావం లేకపోయినా బ్యాటర్ల దృష్టి స్పిన్‌పైనే ఉంటుంది. పేసర్లను కాచుకుని స్పిన్నర్లపై దాడి చేసి పరుగులు సాధిస్తారు. అయ్యర్ సైతం ఇదే చేశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అందుకు భిన్నం. సింహభాగం పరుగులు పేసర్ల బౌలింగ్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడే శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్‌లపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సఫారీ పిచ్‌లపై ఈ ఇద్దరు భిన్నమైన దృక్పథంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. మయాంక్ అగర్వాల్‌కు తుది జట్టులో చోటు ఖామం. కానీ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్థానం కోసం హనుమ విహారితో పోటీపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకునే విహారిని భారత్-ఏ తరఫున సఫారీ టూర్‌కు పంపించారు. 25, 54, 72, 13 పరుగుల ఇన్నింగ్స్‌తో అసలు సవాల్‌కు విహారి తనను తాను సన్నద్ధం చేసుకున్నాడు.
బాక్సింగ్ డే టెస్టుకు టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ సందిగ్థత కొనసాగుతోంది. అజింక్య రహానెకు తుది జట్టులో చోటు ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో అయ్యర్, విహారి ఇద్దరూ తుది జట్టులో నిలుస్తారా? లేదంటే ఇద్దరిలో ఒకరికే చోటు దక్కుతుందా? క్లిష్టమైన ప్రశ్నగా మిగిలింది. జట్టు మేనేజ్మెంట్ తుది జట్టు కూర్పు సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి.