Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నా
- మీడియా సమావేశంలో కిదాంబి శ్రీకాంత్
హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి హైదరాబాద్ చేరుకున్న కిదాంబి శ్రీకాంత్‌కు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రజత పతకం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఈ విజయాన్ని ఆస్వాదించడానికి కూడా సమయం లేదన్నాడు. జనవరి 10నుంచి ఇండియా ఓపెన్, మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ఉన్నాయని, ఆ తర్వాత కామన్వెల్త్, ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీ, ఆసియా క్రీడలు ఇలా బిజీ షెడ్యూల్ ఉందని చెప్పుకొచ్చాడు. తాను సరైన సమయంలోనే ఫామ్‌లోకి వచ్చాననీ, గత సెప్టెంబర్ నుంచి ఫామ్‌ను అందిపుచ్చుకొని, ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సంపాదించడం ఆనందంగా ఉందన్నాడు. ఇకపై తన ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాననీ, అయితే.. తన ఆటను సరిదిద్దుకొని లోపాలను ఇంకా సరిదిద్దుకోవాల్సి ఉందన్నాడు. ఆ లోపాలను కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి వాటిపై దష్టిసారిస్తానన్నాడు. రాబోయే 10 నెలలు తనకు కీలకమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను ఎలాంటి గాయాలతో ఇబ్బంది పడటం లేదని, ఇదివరకు ఆ సమస్య ఉండేదనీ, ఇప్పుడు దాన్ని అధిగమించి పూర్తి ఫిట్నెస్తో ఉన్నానన్నాడు. ఇక ఫైనల్స్‌లో ఆడేటప్పుడు ఒత్తిడి గురించి స్పందిస్తూ.. అలాంటి మేజర్ టోర్నీల్లో ఆడేటప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుందన్నాడు. అయినా, తాను మొదటి గేమ్‌లో బాగా ఆడినట్టు శ్రీకాంత్ గుర్తుచేసుకున్నాడు. అందులో గెలిచే అవకాశం ఉన్నా తన తప్పిదాలతోనే ఓటమిపాలయ్యానని చెప్పాడు. వాటిని అదుపు చేసుకోలేకపోయానని తెలిపాడు. మొత్తంగా తన ప్రదర్శనపై సంతప్తిగా ఉన్నానన్నాడు. సెమీస్‌లో లక్ష్యసేన్‌పై గెలుపుపై స్పందిస్తూ.. ఇటీవలికాలంలో అతడితో ముఖాముఖి పోటీపడలేదని, అయితే, లక్ష్యసేన్ ఆటతీరును గమనిస్తూ వచ్చానన్నాడు. ఆ మ్యాచ్‌లో తామిద్దరం హోరాహోరీగా తలపడ్డామన్నాడు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్స్ చేరిన శ్రీకాంత్.. ఫైనల్లో సింగపూర్‌కు చెందిన కీన్‌యూ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఫైనల్లో శ్రీకాంత్ ఓడినా.. భారత్ తరఫున ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే సెమీస్‌లో ఓడి కాంస్య పతకం గెలిచిన లక్ష్యసేన్ కూడా ప్రకాశ్ పదుకొనే, బి సాయి ప్రణీత్‌ల సరసన చేరిన విషయం తెలిసిందే.