Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహానే, శ్రేయస్ జట్టులో ఉండాలి
- టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆశాభావం
సెంచూరియన్: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారంనుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ బరిలోకి ఐదుగురు బౌలర్లతోపాటు అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్‌లకు తుదిజట్టులో చోటు కల్పిస్తే మంచిదన్నాడు. తొలి టెస్ట్‌లో గెలిస్తే సిరీస్‌పై పట్టు సాధించగలమని, ఆ ఫలితం టెస్ట్ సిరీస్‌పై ప్రభావం చూపుతుందన్నాడు. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే మాత్రం అదనపు బ్యాటర్ అవసరమని, దీంతో బౌలర్లపై అదనపు భారం పడుతుందని తెలిపాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లు పేసర్లకు స్వర్గధామం అని, ఈ క్రమంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం ఉత్తమమని పేర్కొన్నాడు. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని, సీనియర్ పేసర్ ఇషాంత్‌కు సఫారీ పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవముందన్నాడు. తనతోపాటు శ్రేయస్ అయ్యర్, రహానే, హనుమ విహారితోపాటు మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లి, పంత్ బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరమున్నదనీ, వీరిపైనే బ్యాటింగ్ భారమంతా ఆధారపడి ఉందన్నాడు. శ్రేయస్, హనుమ విహారిలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రేయస్ సెంచరీ, అర్ధసెంచరీతో కదం తొక్కాడని, హనుమ విహారికి దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఇటీవలే ఆడి రాణించిన విషయాన్ని ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ గుర్తుచేశాడు.
సీమర్లకు స్వర్గధామం సెంచూరియన్..
సెంచూరియన్ పిచ్ సీమర్లకు స్వర్గధామమని, తొలిరోజునుంచే పేసర్లు పుంజుకోవడం ఖాయమని తెలిపాడు. దీంతో సఫారీ జట్టు సన్నే ఓలీవర్ను జట్టులోకి తీసుకున్నదనీ, మ్యాచ్ జరిగే కొలది బ్యాటర్స్ బంతిపై ఆధిపత్యం చెలాయిస్తారన్నాడు. ఐదురోజులు ఆట కొనసాగే అవకాశం లేదని, మూడు నుంచి నాలుగురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముందన్నాడు. దక్షిణాఫ్రికా పేసర్లు బౌన్సర్లు వేసి భారత బ్యాటర్స్‌ను ఇబ్బందులకు గురిచేసే అవకాశమున్నదనీ, ఆస్ట్రేలియా పిచ్‌ల మాదిరిగానే ఇక్కడి పిచ్‌లు బ్యాటర్స్‌కు ఇబ్బందులకు గురిచేస్తాయన్నాడు. దీంతో బ్యాటర్ క్రీజ్‌లో నిలదొక్కుకోవాలంటే ముందు ఫుట్‌వర్క్‌పై దృష్టి సారించాల్సి ఉందన్నాడు. 1992-2018వరకు భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి 20 టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం 3 టెస్టుల్లో గెలిస్తే.. మరో 10 టెస్టుల్లో పరాజయాన్ని చవిచూసింది. మరో 7టెస్టులు డ్రా అయ్యాయి.