Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ రాహుల్ అజేయ సెంచరీ
- మయాంక్ అగర్వాల్ అర్థ శతకం
- భారత్ తొలి ఇన్నింగ్స్ 272/3
- దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి రోజు
సఫారీ పర్యటనను టీమ్ ఇండియా ఉత్సాహంగా మొదలుపెట్టింది. ఫ్రీడం సిరీస్ తొలి టెస్టు తొలి రోజు ఆతిథ్య జట్టుపై భారత్ పైచేయి సాధించింది. కెఎల్ రాహుల్ (122 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగటంతో సెంచూరియన్‌లో కోహ్లిసేన ముందంజలో కొనసాగుతోంది. మయాంక్ అగర్వాల్ (60) అర్థ సెంచరీతో రాణించాడు. రాహుల్, మయాంక్ మెరుపు ప్రదర్శనలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.
నవతెలంగాణ-సెంచూరియన్
కెఎల్ రాహుల్ (122 నాటౌట్, 248 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదం తొక్కాడు. మయాంక్ అగర్వాల్ (60, 123 బంతుల్లో 9 ఫోర్లు) ఫామ్‌ను కొనసాగించగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత ఓపెనర్లు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు రాణించటంతో 2010 తర్వాత తొలిసారి సఫారీ గడ్డపై భారత్ తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి (3/45) మినహా మరో బౌలర్ వికెట్ పడగొట్టడంలో సఫలం కాలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 272/3తో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. కెఎల్ రాహుల్‌కు తోడు అజింక్య రహానె (40 నాటౌట్, 81 బంతుల్లో 8 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నాడు. నేడు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సైతం మెరిస్తే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు లాంఛనం చేసుకోనుంది.
అదరగొట్టారు : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి రోజు ఆటలో ఆధిపత్యం చూపించింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారించిన మయాంక్ అగర్వాల్ సఫారీ గడ్డపైనా అదే జోరు చూపించాడు. సెంచూరియన్ పిచ్‌పై సఫారీ పేసర్లను ఓపెనర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. కగిసో రబాడ ఇబ్బంది పెడతాడనే అంచనాలున్నా... రాహుల్, మయాంక్ సాధికారిక ప్రదర్శన చేశారు. కుదురుకునేందుకు రాహుల్ సమయం తీసుకోవటంతో ఆరంభంలో అగర్వాల్ దూకుడుగా ఆడాడు. ఎనిమిది ఫోర్లతో 89 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ జోరుతో 34.2 ఓవర్లలోనే భారత్ వంద పరుగుల మైలురాయి అందుకుంది. 2010 తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికాలో భారత్ తొలి వికెట్‌కు వందకు పైగా పరుగులు చేసింది. 117 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి లుంగి ఎంగిడి ముగింపు పలికాడు. వరుస బంతుల్లో మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ ఫుజారా (0)లను అవుట్ చేసిన లుంగి ఎంగిడి ఆతిథ్య జట్టుకు బ్రేక్ అందించాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పుజారా వికెట్ కోల్పోయాడు. దీంతో 117/0తో ఉన్న భారత్.. 117/2తో ఒత్తిడిలో పడింది.
కెప్టెన్ విరాట్ కోహ్లి (35, 94 బంతుల్లో 4 ఫోర్లు) జతగా కెఎల్ రాహుల్ రెండో సెషన్లో దూకుడు పెంచాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించింది. విరాట్ కోహ్లి క్రీజులో సౌకర్యవంతంగా కనిపించాడు. భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్న విరాట్‌ను వైడ్ డెలివరితో లుంగి ఎంగిడి వెనక్కి పంపించాడు. దీంతో 199 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ తొమ్మిది ఫోర్ల సాయంతో 127 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అజింక్య రహానెతో కలిసి రాహుల్ మరో కీలక భాగస్వామ్మం నిర్మించాడు. నాల్గో వికెట్‌కు అజేయంగా 73 పరుగులు జోడించాడు. టీ విరామం అనంతరం బౌలర్లపై మరింత పట్టు సాధించిన రాహుల్ 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ సాధించాడు. కొత్త బంతితో సఫారీ బౌలర్లు వికెట్ ఆశించినా రాహుల్, రహానె జోడీ జోరుతో నిరాశ తప్పలేదు. ఎనిమిది ఫోర్లతో 40 పరుగులు చేసిన రహానె నేడు భారీ స్కోరుపై కన్నేసి క్రీజులోకి రానున్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ బ్యాటింగ్ 122, మయాంక్ అగర్వాల్ (ఎల్బీ) లుంగి ఎంగిడి 60, చతేశ్వర్ పుజారా (సి) పీటర్సన్ (బి) లుంగి ఎంగిడి 0, విరాట్ కోహ్లి (సి) ముల్డర్ (బి) లుంగి ఎంగిడి 35, అజింక్య రహానె బ్యాటింగ్ 40, ఎక్స్‌ట్రాలు :15, మొత్తం :(90 ఓవర్లలో 3 వికెట్లకు) 272.
వికెట్ల పతనం : 1-117, 2-117, 3-199.
బౌలింగ్ : కగిసో రబాడ 20-5-51-0, లుంగి ఎంగిడి 17-4-45-3, మార్కో జాన్సెన్ 17-4-61-0, వియాన్ ముల్డర్ 18-3-49-0, కేశవ్ మహరాజ్ 18-2-58-0.