Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విదేశీ గడ్డపై ఇటీవల టీమ్ ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో టెస్టు సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. కానీ దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ ఇండియాకు టెస్టు సిరీస్ విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. సఫారీ టెస్టు జట్టు తరం మార్పిడిలో ఉన్న తరుణంలో కోహ్లిసేన విజయానికి మార్గం మరింత సులభమైందని అనిపించింది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు మెరుపు ప్రదర్శన చేయటం అరుదు. ఇది సెంచూరియన్ టెస్టు తొలి రోజు భారత్ సాధ్యం చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ధనాధన్ ప్రదర్శనలు చేశారు. రాహుల్ అజేయ శతకంతో జోరు మీదుండగా.. మయాంక్ అగర్వాల్ సాధికారిక అర్థ సెంచరీ నమోదు చేశాడు. రాహుల్‌కు తోడు విరాట్ కోహ్లి, అజింక్య రహానెలు సైతం సఫారీ పేసర్లపై ఆధిపత్యం చెలాయించారు. బౌలర్లపై అజింక్య రహానె ఏకంగా 95 శాతం నియంత్రణ చూపించాడు. కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడిలు క్రమశిక్షణతో బంతులేసినా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. తొలి రోజే 3కు పైగా రన్‌రేట్‌తో పరుగుల వరద పారించిన రెండో రోజు మరింత దూకుడుగా ఆడుతుందని అనుకున్నారు. రిషబ్ పంత్, అశ్విన్, శార్దుల్ ఠాకూర్లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత్ 400 పైచిలుకు స్కోరుపై కన్నేసింది. రెండో రోజు వర్షం కారణంగా రద్దు కావటంతో టీమ్ ఇండియా వ్యూహం తక్షణమే మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట రద్దు కావటంతో ఇంకా మూడు రోజుల ఆటే మిగిలి ఉంది. టెస్టులో ఒక్క ఇన్నింగ్స్ సైతం ముగియలేదు. భారత్ మూడో రోజు వీలైనంత వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాలి. అప్పుడే సెంచూరియన్‌లో ఫలితం రాబట్టేందుకు వీలుంటుంది. దీనికి తోడు టెస్టు మ్యాచ్ చివరి రోజు సైతం వర్షం సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాట్‌తో, బంతితో టీమ్ ఇండియా అనుసరించే వ్యూహమే సెంచూరియన్‌లో ఫలితం తేలే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.