Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో టెస్టులో కంగారూల ఘన విజయం
మెల్బోర్న్ : యాషెస్ సిరీస్ ఆసీస్ వశమైంది. ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన ఆస్ట్రేలియా 3-0తో యాషెస్ సిరీస్‌ను చేజిక్కించుకుంది. పేసర్ స్కాట్ బొలాండ్ (6/7) అసమాన బౌలింగ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. నాలుగు ఓవర్లో ఏడు పరుగులకు ఏకంగా ఆరు వికెట్లు కూలగొట్టిన బొలాండ్.. ఇంగ్లాండ్‌ను కకావికలం చేశాడు. బొలాండ్ దెబ్బకు బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఉదయం సెషన్లోనే ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. కెప్టెన్ జో రూట్ (28), బెన్ స్టోక్స్ (11) మాత్రమే రెండెంకల స్కోరు సాధించారు. హమీద్ (7), క్రావ్లీ (5), మలాన్ (0), లీచ్ (0), బెయిర్‌స్టో (5), మార్క్‌వుడ్ (0), రాబిన్సన్ (0), అండర్సన్ (2) టపటపా వికెట్లు కోల్పోయారు. గబ్బా టెస్టులో అసమాన ప్రదర్శన చేసిన జోశ్ బట్లర్ (5 నాటౌట్) అజేయంగా నిలిచాడు. 27.4 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ వరుసగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా ముందు దాసోహం అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 185 పరుగులకే కుప్పకూలగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ భరతం పట్టిన స్కాట్ బొలాండ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. సిరీస్‌లో నాల్గో టెస్టు జనవరి 5 నుంచి సిడ్నీలో జరుగనుంది. చివరి టెస్టుకు హౌబర్ట్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. సిరీస్‌లో మరో రెండు టెస్టులు ఉండగానే విజయం సాధించిన ఆస్ట్రేలియా.. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలో తొలి క్లీన్‌స్వీప్ సిరీస్ విజయం దిశగా దూసుకుపోనుంది.
రూట్ కెప్టెన్సీ వదులుకో! : యాషెస్ సిరీస్‌ను 0-3తో కోల్పోవటంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మరో రెండు టెస్టులు ఉండగానే ఇంగ్లాండ్ చతికిల పడింది. కంగారూలకు కనీస పోటీ సైతం ఇంగ్లాండ్ ఇవ్వలేదు. రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బారుకాట్ అన్నాడు. 'ఆస్ట్రేలియా 3-0 ముందంజలో ఉంది. ఇంగ్లాండ్ కంటే ఆసీస్ మెరుగైన జట్టు అని చెప్పటం రూట్ మానుకోవాలి. అతడు చెప్పినదాన్నే రూట్ విశ్వసిస్తే అప్పుడు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీ వదులుకోవటం మేలు. యాషెస్ ఓటమిలో కెప్టెన్‌గా రూట్ నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపాయి' అని బారుకాట్ అన్నాడు.