Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌కు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 197/10
- భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మూడో రోజు
సెంచూరియన్‌లో పేసర్లు విజృంభించారు. సఫారీ తరఫున లుంగిసాని ఎంగిడి (6/71) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 327 పరుగులకే పరిమితం అయ్యింది. టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమి (5/44) ఐదు వికెట్ల విజృంభణతో దక్షిణాఫ్రికా విలవిల్లాడింది. షమికి బుమ్రా, ఠాకూర్ సైతం తోడవటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల భారీ ఆధిక్యం కోహ్లిసేన సొంతమైంది.
నవతెలంగాణ-సెంచూరియన్
పేసర్ మహ్మద్ షమి (5/44) విజృంభణతో బాక్సింగ్ డే టెస్టుపై భారత్ పట్టు సాధించింది. ఆతిథ్య జట్టును 197 పరుగులకే కుప్పకూల్చిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 130 పరుగుల ఆధిక్యం సొంతం చేసుకుంది. 32/4తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను తెంబ బవుమా (52, 103 బంతుల్లో 10 ఫోర్లు), క్వింటన్ డికాక్ (34, 63 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. లోయర్ ఆర్డర్ భారత పేస్ దాడికి నిలబడలేక విలవిల్లాడింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులే చేసింది. కెఎల్ రాహుల్ (123, 260 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), అజింక్య రహానె (48, 102 బంతుల్లో 9 ఫోర్లు) తొలి రోజు ఫామ్ కొనసాగించలేదు. పంత్ (8), అశ్విన్ (4), ఠాకూర్ (4) నిరాశపరిచారు. మూడో రోజు ఆట చివర్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 16/1తో కొనసాగుతోంది. మయాంక్ అగర్వాల్ (4) వికెట్ కోల్పోయాడు. కెఎల్ రాహుల్ (5 నాటౌట్), శార్దుల్ ఠాకూర్ (4 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 146 పరుగుల ముందంజలో కొనసాగుతోంది.
పంజా విసిరిన షమి : రెండో ఇన్నింగ్స్ వికెట్ల వేటగాడు మహ్మద్ షమి (5/44) సెంచూరియన్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే దుమ్మురేపాడు. షమి ఐదు వికెట్ల ప్రదర్శనతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులైనా చేయలేదు. సఫారీ కెప్టెన్ ఎల్గార్ (1)ను బుమ్రా వెనక్కి పంపగా.. మార్కరం (13), పీటర్సన్ (15), డుసెన్ (3) కథ షమి ముగించాడు. 32 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన సఫారీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో బవుమా (52), డికాక్ (34) ఐదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దుల్ ఠాకూర్ విడదీయటంతో లోయర్ ఆర్డర్ పతనం వేగంగా సాగింది. డికాక్‌ను ఠాకూర్ క్లీన్‌బౌల్డ్ చేయగా.. అర్థ సెంచరీ హీరో బవుమాను షమి సాగనంపాడు. కగిసో రబాడ (25) వికెట్‌తో 200వ టెస్టు వికెట్ సాధించిన షమి.. సెంచూరియన్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనను సైతం పూర్తి చేసుకున్నాడు. ముల్డర్ (12), జెన్సన్ (19), కేశవ్ మహరాజ్ (12) విలువైన పరుగులతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేయగల్గింది.
వికెట్లు టపటపా : భారత్ తొలి ఇన్నింగ్స్ ఓవర్‌నైట్ స్కోరు 272/3. శతక హీరో కెఎల్ రాహుల్, అజింక్య రహానె క్రీజులో ఉన్నారు. పంత్, అశ్విన్, ఠాకూర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. కానీ భారత్ చివరి ఏడు వికెట్లను దారుణంగా కోల్పోయింది. 69 బంతులకే చివరి ఏడు వికెట్లను సమర్పించుకుంది. కెఎల్ రాహుల్ (123) ఓవర్‌నైట్ స్కోరు ఒక్క పరుగు మాత్రమే జత చేశాడు. అజింక్య రహానె మరో ఎనిమిది పరుగులు జోడించి అర్థ సెంచరీకి రెండు పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. ధనాధన్‌తో మెరుస్తారని ఆశించిన రిషబ్ పంత్ (8), అశ్విన్ (4), శార్దుల్ ఠాకూర్ (4)లు విఫలమయ్యారు. జశ్‌ప్రీత్ బుమ్రా (14, 17 బంతుల్లో 2 ఫోర్లు) మెరుపులతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు చేరుకుంది. మహ్మద్ సిరాజ్ (4 నాటౌట్, 12 బంతుల్లో ఓ ఫోర్) అజేయంగా నిలిచాడు. సఫారీ పేసర్లలో లుంగిసాని ఎంగిడి (6/71) ఆరు వికెట్ల ప్రదర్శనతో విరుచుకుపడ్డాడు. ఎంగిడికి కగిసో రబాడ (3/72) సైతం తోడవటంతో భారత్ పతనం వేగవంతమైంది. భారీ స్కోరు దిశగా దూసుకెళ్లిన భారత్‌ను ఎంగిడి, రబాడలు ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేయటంలో విజయవంతమయ్యారు.
బుమ్రాకు గాయం : టీమ్ ఇండియా పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా గాయం బారిన పడ్డాడు. లోయర్ ఆర్డర్లో విలువైన 14 పరుగుల ఇన్నింగ్స్ నమోదు చేసిన బుమ్రా.. బంతితోనూ తొలి ఓవర్లోనే భారత్‌కు బ్రేక్ అందించాడు. బౌలింగ్ చేస్తుండగా బుమ్రా చీలమండ నొప్పితో బాధపడటంతో మైదానం వీడాల్సి వచ్చింది. జట్టు ఫిజియో నితిన్ పటేల్ బుమ్రాకు చికిత్స అందిస్తున్నాడు. బుమ్రా స్థానంలో శ్రేయస్ అయ్యర్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. మూడో రోజు చివర్లో మైదానంలోకి వచ్చిన బుమ్రా మళ్లీ బౌలింగ్ చేయటంతో భారత్ ఊపిరీ పీల్చుకుంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : రాహుల్ (సి) డికాక్ (బి) రబాడ 123, మయాంక్ (ఎల్బీ) ఎంగిడి 60, పుజారా (సి) పీటర్సన్ (బి) ఎంగిడి 0, కోహ్లి (సి) ముల్డర్ (బి) ఎంగిడి 35, రహానె (సి) డికాక్ (బి) ఎంగిడి 48, పంత్ (సి) డుసెన్ (బి) ఎంగిడి 8, అశ్విన్ (సి) కేశవ్ (బి) రబాడ 4, షమి (సి) డికాక్ (బి) ఎంగిడి 8, బుమ్రా (సి) ముల్డర్ (బి) జాన్సెన్ 14, సిరాజ్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం :(105.3 ఓవర్లలో ఆలౌట్) 327.
వికెట్ల పతనం : 1-117, 2-117, 3-199, 4-278, 5-291, 6-296, 7-296, 8-304, 9-308, 10-327.
బౌలింగ్ : కగిసో రబాడ 26-5-72-3, లుంగి ఎంగిడి 24-5-71-6, జాన్సెన్ 18.3-4-69-1, విహాన్ ముల్డర్ 19-4-49-0, కేశవ్ మహరాజ్ 18-2-58-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : ఎల్గార్ (సి) పంత్ (బి) బుమ్రా 1, మార్కరం (బి) షమి 13, పీటర్సన్ (బి) షమి 15, డుసెన్ (సి) రహానె (బి) సిరాజ్ 3, బవుమా (సి) పంత్ (బి) షమి 52, డికాక్ (సి) ఠాకూర్ 34, ముల్డర్ (సి) పంత్ (బి) షమి 12, జాన్సెన్ (ఎల్బీ) ఠాకూర్ 19, రబాడ (సి) పంత్ (బి) షమి 25, కేశవ్ (సి) రహానె (బి) బుమ్రా 12, ఎంగిడి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం :(62.3 ఓవర్లలో ఆలౌట్) 197.
వికెట్ల పతనం : 1-2, 2-25, 3-30, 4-32, 5-104, 6-133, 7-144, 8-181, 9-193, 10-197.
బౌలింగ్ : బుమ్రా 7.2-2-16-2, సిరాజ్ 15.1-3-45-1, షమి 16-5-44-5, ఠాకూర్ 11-1-51-2, అశ్విన్ 13-2-37-0.