Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసపట్టులో భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు
- చివరి రోజు ఆటకు వర్షం ముప్పు
- దక్షిణాఫ్రికా లక్ష్యం 305, ప్రస్తుతం 94/4
నవతెలంగాణ-సెంచూరియన్
రసవత్తరంగా సాగుతున్న సెంచూరియన్ టెస్టులో వరుణుడు ఫలితాన్ని శాసించేందుకు సిద్ధమవుతున్నాడు!. దక్షిణాఫ్రికాకు భారత్ 305 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో సఫారీలు పోరాట పటిమ చూపిస్తున్నారు. చివరి రోజు ఆటలో భారత్ విజయంపై కన్నేసి బరిలోకి దిగుతుండగా రోజంతా వర్ష సూచనలతో చివరి రోజు ఆట సాధ్యపడటంపై అనుమానాలు నెలకొన్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. పదునైన భారత పేస్ దళాన్ని ఎదుర్కొని నాల్గో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా పోరాట స్ఫూర్తి కనబరుస్తోంది!. 305 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా క్రమశిక్షణతో బ్యాటింగ్ చేస్తోంది. కెప్టెన్ డీన్ ఎల్గార్ (52 నాటౌట్, 122 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో సఫారీ వేటను ముందుండి నడిపిస్తున్నాడు. భారత పేసర్లు షమి, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టగా.. బుమ్రా రెండు వికెట్లతో మెరిశాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 90/3తో కొనసాగుతోంది. చివరి రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు మరో 211 పరుగులు అవసరం కాగా.. విజయానికి టీమ్ ఇండియా 6 వికెట్ల దూరంలో నిలిచింది. నేడు కనీసం రెండు సెషన్ల పాటు వరుణుడు ఆటకు అవకాశం ఇస్తే సెంచూరియన్‌లో ఫలితం తేలేందుకు అవకాశం ఉంది.
ఎల్గార్ పోరాటం : 305 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ (00) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న సఫారీ బ్యాటర్లు క్రీజులో సహనంతో కనిపించారు. ఓపెనర్ మార్కరం (1), కీగన్ పీటర్సన్ (17) త్వరగా నిష్క్రమించినా.. డుసెన్ (11, 65 బంతుల్లో 1 ఫోర్) తోడుగా ఎల్గార్ కీలక భాగస్వామ్యం నిర్మించాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 40 పరుగులు జోడించింది. ఎల్గార్, డుసెన్ జోడీ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. భారత పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేసినా ఎల్గార్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నాల్గో రోజు ఆటలో చివరి ఓవర్లో నైట్‌వాచ్‌మన్ కేశవ్ మహరాజ్ (8)ను బుమ్రా అవుట్ చేసి సఫారీలను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. 40.5 ఓవర్లలో 94 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది.
తడబడిన బ్యాటర్లు! : రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు తడబాటుకు లోనయ్యారు. నాల్గో రోజు సఫారీ బౌలర్లపై విరుచుకు పడతారనుకున్న బ్యాటర్లు ఆతిథ్య జట్టు పేస్ పంచ్‌కు తలొగ్గారు. తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయినా మెరుగ్గానే కనిపించిన భారత్ లంచ్ విరామం అనంతరం పేకమేడలా కుప్పకూలింది. నైట్‌వాచ్‌మన్ శార్దుల్ ఠాకూర్ (4) ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్ శతక హీరో కెఎల్ రాహుల్ (23, 74 బంతుల్లో 4 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (16, 64 బంతుల్లో 3 ఫోర్లు) తొలి సెషన్లో వికెట్లు కోల్పోయారు. ఈ ఇద్దరి నిష్క్రమణతో భారత ఇన్నింగ్స్ ఓ అడుగు వెనకేసింది. విరాట్ కోహ్లి (18, 32 బంతుల్లో 4 ఫోర్లు) లంచ్ విరామానానికి అజేయంగా నిలిచినా.. రెండో సెషన్ ఆరంభంలోనే వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత మరో 20 ఓవర్ల లోపే భారత రెండో ఇన్నింగ్స్ కథ ముగిసింది. అజింక్య రహానె (20, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (34, 34 బంతుల్లో 6 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (14, 17 బంతుల్లో 2 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. ఐదో రోజు వాతావరణ పరిస్థితులను గమనంలో ఉంచుకున్న కోహ్లిసేన రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఆటపై దృష్టి సారించటం సఫారీ పేసర్లకు కలిసొచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ (4/42) రెచ్చిపోగా.. మార్కో జెన్సన్ (4/55) సైతం వికెట్ల వేటలో దూసుకెళ్లాడు. లుంగిసాని ఎంగిడి (2/31) రెండు కీలక వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 50.3 ఓవర్లలో 174 పరుగులకు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల విలువైన ఆధిక్యం సాధించిన టీమ్ ఇండియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 305 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించింది.
వరుణుడు ఆడనిచ్చేనా?! : సెంచూరియన్ బాక్సింగ్ డే టెస్టులో వర్షంతో ఇప్పటికే రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగు రోజుల ఆటలో ఫలితం కోసం భారత్ విశ్వ ప్రయత్నాలు చేసింది. దక్షిణాఫ్రికాకు సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్‌కు చివరి రోజు వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. సెంచూరియన్‌లో నేడు ఉదయం నుంచి వర్ష సూచనలు ఉన్నాయి. ఓ మోస్తరు వర్ష సూచనలు రోజంతా ఉండటంతో ఐదో రోజు ఆట సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం అంతరాయం కలిగిస్తే సెంచూరియన్ టెస్టు ఫలితం తేలకుండా డ్రాగా ముగిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 327/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 197/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : రాహుల్ (సి) ఎల్గార్ (బి) ఎంగిడి 23, మయాంక్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 4, ఠాకూర్ (సి) ముల్డర్ (బి) రబాడ 10, పుజారా (సి) డికాక్ (బి) ఎంగిడి 16, కోహ్లి (సి) డికాక్ (బి) జాన్సెన్ 18, రహానె (సి) డుసెన్ (బి) జాన్సెన్ 20, పంత్ (సి) ఎంగిడి (బి) రబాడ 34, అశ్విన్ (సి) పీటర్సన్ (బి) రబాడ 14, షమి (సి) ముల్డర్ (బి) రబాడ 1, బుమ్రా నాటౌట్ 7, సిరాజ్ (సి) జాన్సెన్ 0, ఎక్స్‌ట్రాలు : 27, మొత్తం :(50.3 ఓవర్లలో ఆలౌట్) 174.
వికెట్ల పతనం : 1-12, 2-34, 3-54, 4-79, 5-109, 6-111, 7-146, 8-166, 9-169, 10-174.
బౌలింగ్ : కగిసో రబాడ 17-4-42-4, లుంగి ఎంగిడి 10-2-31-2, జాన్సెన్ 13.3-4-55-4, ముల్డర్ 10-4-25-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : మార్కరం (బి) షమి 1, ఎల్గార్ 52 నాటౌట్, పీటర్సన్ (సి) పంత్ (బి) సిరాజ్ 17, డుసెన్ /బి) బుమ్రా 11, కేశవ్ (బి) బుమ్రా 8, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం :(40.5 ఓవర్లలో 4 వికెట్లకు) 94.
వికెట్ల పతనం : 1-1, 2-34, 3-74, 4-94.
బౌలింగ్ : బుమ్రా 11.5-2-22-2, షమి 9-2-29-1, సిరాజ్ 11-4-25-1, ఠాకూర్ 5-0-11-0, అశ్విన్ 4-1-6-0.