Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 113 పరుగుల తేడాతో తొలి టెస్టులో భారత్ గెలుపు
- దక్షిణాఫ్రికా పర్యటనలో శుభారంభం
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సఫారీలను 113 పరుగుల తేడాతో ఓడించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 94/4తో ఉన్న ప్రొటీస్ జట్టు మరో 97 పరుగులు జోడించిమిగతా ఆరువికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, మహ మ్మద్షమి తలో మూడు... మహమ్మద్ సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. సెంచూరియన్ మైదానంలో టీమ్ఇండియా తొలి విజయం ఇదే కావడం విశేషం.
కాసేపు అడ్డుకున్న ఎల్గర్, బవుమా
ఐదో రోజు తొలి సెషన్లో కెప్టెన్ డీన్ ఎల్గర్ (77: 156 బంతుల్లో 12ఫోర్లు), తెంబా బవుమా (35 నాటౌట్: 80 బంతుల్లో నాలుగు ఫోర్లు) కాసేపు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడారు. మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్త న్నారనుకుంటున్న తరుణంలో.. భారత్‌కు బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్లో ఎల్గర్‌ని బుమ్రా ఔట్ చేశాడు. దీంతో భారత్‌కి ఉపశమనం లభించింది. ఆ తర్వాత వెనువెంటనే క్వింటన్ డి కాక్ (21), వియాన్ ముల్డర్ (1) పెవిలియన్ చేరారు. లంచ్ తర్వాత వచ్చినవాళ్లు వచ్చినట్టు వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా పోరు ముగిసింది.
తొలి నుంచీ భారత్‌దే ఆధిక్యత
మ్యాచ్ ఆరంభం నుంచీ టీమ్ఇండియానే ఆధిక్యం ప్రదర్శించింది. కేఎల్ రాహుల్ (123), మయాంక్ అగర్వాల్ (60) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి ఆరు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమి ఐదు, శార్దూల్ ఠాకూర్, బుమ్రా తలో రెండు, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి ముందు 305 పరుగుల లక్ష్యం ఉంచగలిగింది.
జట్ల స్కోర్లు :
తొలి ఇన్నింగ్స్: భారత్ 327/10.. దక్షిణాఫ్రికా 197/10
రెండో ఇన్నింగ్స్ : టీమ్ఇండియా 174/10.. ప్రొటీస్ జట్టు 191/10