Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు సిరీస్ విజయంపై భారత్ తహతహ
- కంచుకోట వాండరర్స్‌పై కోహ్లిసేన కన్ను
- భారత్, దక్షిణాఫ్రికా ఫ్రీడం సిరీస్
ఉపఖండ పులి, కాగితంపై బలమైన జట్టు. టీమ్ ఇండియా ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా తరచుగా వినిపించే విమర్శలు ఇవి. గత కొంతకాలంగా టీమ్ ఇండియా విదేశీ గడ్డపై మోగిస్తున్న విజయ ఢంకాతో సరికొత్త ప్రభంజనం సృష్టించబడుతోంది. వరుసగా ఆస్ట్రేలియాలో రెండు టెస్టు సిరీస్‌లు సాధించిన భారత్.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను లాంఛనం చేసుకుంది. విదేశాల్లో అద్వితీయ విజయాలు సాధిస్తున్నా.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం లేని లోటు వెలితిగా మిగిలింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విజయానికి 2021లో బలమైన పునాది వేసుకున్న కోహ్లిసేన.. 2022లో చారిత్రక సఫారీ టెస్టు సిరీస్ విజయం దిశగా దూసుకెళ్తోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
గబ్బా ఆస్ట్రేలియాకు జట్టుకు కంచుకోట. అక్కడ గత 30 ఏండ్లలో భారత్ మినహా మరో జట్టు కంగారూలను ఓడించలేదు. భారత్‌కు సైతం స్వదేశంలో ఇలా పలు కంచుకోట వేదికలు ఉన్నాయి. ఇతర జట్లకు సైతం సొంతగడ్డపై అపజయమెరుగని కంచుకోటలు ఉండటం చూస్తున్నాం. కానీ ప్రత్యర్థి జట్టు ఇలాకాలో ఎదురులేని కంచుకోటను కలిగి ఉన్న ఏకైక జట్టు బహుశా భారత్ మాత్రమే కావచ్చు!. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ విజయానికి నోచుకోని టీమ్ ఇండియా అక్కడ ప్రధాన వేదిక జొహనెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో తిరుగులేని రికార్డులు కలిగి ఉంది. గత 30 ఏండ్లుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోన్న టీమ్ ఇండియా అక్కడ వాండరర్స్ స్టేడియంలో మాత్రం నమ్మశక్యం కాని రికార్డు నమోదు చేసింది. జొహనెస్‌బర్గ్‌లోని టీమ్ ఇండియా ఓ టెస్టు మ్యాచ్ ఓడినట్టు చరిత్ర లేదు. దక్షిణాఫ్రికా కంచుకోట సెంచూరియన్‌లో సఫారీలను చావుదెబ్బ కొట్టిన భారత జట్టు.. తాజాగా ప్రత్యర్థి గడ్డపై తమ కంచుకోటలో ఖతర్నాక్ విజయం కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. సెంచూరియన్‌లో అద్వితీయ విజయంతో ఫ్రీడం టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ సోమవారం నుంచి (జనవరి 3) ఆరంభం కానుంది. వాండరర్స్ టెస్టు సైతం నెగ్గితే ఎన్నాండ్లుగానో ఊరిస్తోన్న సఫారీ టెస్టు సిరీస్ విజయం భారత్ సొంతం కానుంది. మూడో టెస్టు వేదిక కేప్‌టౌన్‌కు బయల్దేరడానికి ముందే టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలనే తపన టీమ్ ఇండియాలో కనిపిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు నమోదు చేసిన విరాట్ కోహ్లి తాజాగా దక్షిణాఫ్రికాలోనూ అదే తరహా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.
వాండరర్స్‌లో ఉమేశ్ ఆయుధం! :
సెంచూరియన్ కోటను బద్దలుకొట్టిన టీమ్ ఇండియా ఇప్పుడు తన చూపును వాండరర్స్‌పై మళ్లించింది. సోమవారం నుంచి వాండరర్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. జొహనెస్‌బర్గ్ వాండరర్స్ భారత్‌కు విదేశాల్లో కంచుకోట. 30 ఏండ్ల దక్షిణాఫ్రికా పర్యటన చరిత్రలో భారత్ ఎన్నడూ వాండరర్స్‌లో ఓ టెస్టు మ్యాచ్‌లో ఓటమి చెందలేదు. భారత జట్టుకు ఇక్కడ ఎన్నో చిరస్మరణీయ మైలురాళ్లు ఉన్నాయి.టీమ్ ఇండియా చీఫ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తొలి టెస్టు శతకం (1997) ఇక్కడే నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలో భారత్ తొలి టెస్టు విజయం సాధించింది ఇక్కడే (2006). స్వింగ్, సీమ్‌కు అధికంగా అనుకూలత లభించే ఈ స్టేడియంలో భారత్ ఎప్పుడూ ఫేవరేటే. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కలల యాత్ర సైతం ఇక్కడే మొదలైంది. 2018లో వాండరర్స్ టెస్టు విజయంతోనే విరాట్ కోహ్లి విదేశీ గడ్డపై జైత్రయాత్ర మొదలెట్టాడు.
'న్యూలాండ్స్, సెంచూరియన్ మైదానాలు షార్ట్ లెంగ్త్‌లతో దక్షిణాఫ్రికా పేసర్లకు ఉపకరిస్తాయి. జొహనెస్‌బర్గ్ స్టేడియం ఫుల్ లెంగ్త్‌కు పెట్టింది పేరు. అందుకే భారత జట్టుకు వాండరర్స్‌లో తిరుగులేని రికార్డు. పిచ్‌పై బాగా పచ్చిక ఉంది. బహుశా మ్యాచ్‌కు ముందు పచ్చికను తొలగించవచ్చు. ఎంత తగ్గించినా.. పిచ్‌పై చెప్పుకోదగిన స్థాయిలో పచ్చిక ఉంటుంది. వాండరర్స్ పిచ్‌కు ఉమేశ్ యాదవ్ సరిగ్గా సరిపోతాడు. ఉమేశ్ యాదవ్ రాబట్టే పేస్, సంధించే లెంగ్త్‌లు ఇక్కడ అతడిని ప్రమాదకర పేసర్‌గా నిలబెడతాయి. జొహనెస్‌బర్గ్‌లో ఉమేశ్ యాదవ్ ఆడకపోతే అది ఆశ్చర్యమే అవుతుంది' అని జొహనెస్‌బర్గ్ మెన్స్, ఉమెన్స్ జట్ల హై పర్ఫార్మెన్స్ మేనేజర్ ప్రసన్న అభిప్రాయపడ్డాడు. సెంచూరియన్‌లో శార్దుల్ ఠాకూర్ పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో నిలిచాడు. వాండరర్స్ పిచ్ అనుకూలతల దృష్ట్యా ఫుల్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు ఉమేశ్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం మెండుగానే కనిపిస్తోంది. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లకు ఉమేశ్ యాదవ్ తోడైతే సఫారీ బ్యాటర్లకు చుక్కలే!. జట్టులో ఓ ఆల్‌రౌండర్ ఉండాలనే ఆలోచనకు విరాట్ కోహ్లి మొగ్గుచూపుతున్నాడు. కానీ రెండో టెస్టు సోమవారం నుంచే ఆరంభం కానుంది. పేసర్ల పని భారం సైతం దృష్టిలో ఉంచుకుని ఉమేశ్ యాదవ్‌ను తుది జట్టులోని ఎంచుకునే అవకాశం లేకపోలేదు.
విహారికి అవకాశం ఉందా?! :
జొహనెస్‌బర్గ్ పిచ్ సంప్రదాయంగా స్పిన్నర్లకు సహకరించిన దాఖలాలు లేవు. ఇక్కడ కచ్చితంగా స్పిన్నర్లకు సరైన పాత్ర ఉంటుందనే భరోసా సైతం ఉండదు. తుది జట్టు కూర్పులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకాడని విరాట్ కోహ్లి వాండరర్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టి అతడి స్థానంలో తెలుగు తేజం హనుమ విహారికి అవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. పేసర్లు అందరూ ఫిట్‌గా ఉన్నారని భావిస్తే విరాట్ కోహ్లి ఈ ప్రయోగానికి వెనుకాడడు. సెంచూరియన్ టెస్టు విజయానికి అవసరమైన చివరి రెండు వికెట్లు అశ్విన్ అందించాడు. కానీ వాండరర్స్‌లో స్పిన్నర్ ప్రధాన బాధ్యత ఓవర్‌రేట్‌ను మేనేజ్ చేయటమే. 8-10 ఓవర్ల స్పెల్ వేయగల హనుమ విహారి సైతం ఆ పని చేయగలడు. హనుమ విహారి తుది జట్టులో నిలిస్తే భారత్ ధైర్యంగా నలుగురు సీమర్లతో బరిలోకి దిగవచ్చు. ఆల్‌రౌండర్ రూపంలో శార్దుల్ ఠాకూర్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడదు. హనుమ విహారి రూపంలో ఏడో స్థానం వరకు స్పెషలిస్ట్ బ్యాటర్ సేవలు అందుబాటులో ఉంటాయి. 2021లో అత్యధిక టెస్టు వికెట్లు కూల్చిన బౌలర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్రపంచ శ్రేణి స్పిన్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించటం తేలికైన పని కాదు. కానీ విరాట్ కోహ్లి విప్లవాత్మక నిర్ణయాలకు పెట్టింది పేరు.
సఫారీకి సైతం ఓ సవాల్ :
జొహనెస్‌బర్గ్‌లో టీమ్ ఇండియాను గట్టి పోటీ ఇచ్చే సవాల్‌కు ముందే ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో సవాల్‌ను ఎదుర్కొవాల్సిన గత్యంతరం ఏర్పడింది. కుటుంబంతో ఎక్కువ గడిపేందుకు టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వీడ్కోలు తీసుకున్నాడు. గత గురువారమే క్వింటన్ డికాక్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో ఫ్రీడం టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచులకు డికాక్ అందుబాటులో ఉండటం లేదు. పితృత్వ సెలవు కోరిన డికాక్ ఎలాగైనా చివరి రెండు టెస్టులకు దూరంగా ఉండేవాడే. డికాక్ దూరం కావటంతో బ్యాటింగ్ విభాగంలో, వికెట్ల వెనకాల ఆ జట్టుకు ఓ అనుభవజ్ఞుడైన ఆటగాడి సేవలు కరువయ్యాయి. రియాన్ రికెల్టన్ను అరంగ్రేట అవకాశం కల్పిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్లో వాండరర్స్‌లో రికెల్టన్ రెండు శతకాలు బాదాడు. దీంతో రెండు టెస్టుల అనుభవం కలిగిన కైల్ వెర్నిన్నెను పక్కనపెట్టి రికెల్టన్కే జొహనెస్‌బర్గ్ టెస్టులో అవకాశం లభించే ఇవ్వనున్నారని చెప్పవచ్చు!.