Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాండరర్స్‌లో ఫేవరేట్‌గా టీమ్ ఇండియా
- లెక్క సరిచేయాలనే తపనలో దక్షిణాఫ్రికా
- నేటి నుంచి ఫ్రీడం సిరీస్ రెండో టెస్టు
2021 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యర్థి కంచుకోటలను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న టీమ్ ఇండియా.. 2022ను విదేశీ గడ్డపై అరుదైన తన కంచుకోటలో పాగా వేయాలని చూస్తోంది. జొహనెస్బర్గ వాండరర్స్ స్టేడియంలో ఒక్క టెస్టు మ్యాచ్‌లోని ఓడని భారత జట్టు నేడు రెండో టెస్టులో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సెంచూరియన్‌లో చతికల పడిన సఫారీలు వాండరర్స్‌లో బలంగా పుంజుకునేందుకు ఎదురుచూస్తున్నారు. భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు సమరం నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-జొహనెస్‌బర్గ్
రెండు విజయాలు, మూడు డ్రాలు. గత 30 ఏండ్లలో జొహనెస్‌బర్గ్‌లో టీమ్ ఇండియా టెస్టు రికార్డు ఇది. డ్రాగా ముగిసిన 1997 టెస్టు చివరి రోజు వరుణుడి అంతరాయం లేకుంటే భారత్ ఇక్కడ మరో విజయం ఖాతాలో వేసుకునేదే. విదేశాల్లో టీమ్ ఇండియా ఓ వేదికపై తిరుగులేని రికార్డు కలిగి ఉండటం అరుదు!. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు ఎన్నడూ టెస్టు సిరీస్ ఫేవరేట్‌గా బరిలోకి దిగలేదు. తొలిసారి టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంతో సిరీస్‌పై కన్నేసి జొహనెస్‌బర్గ్‌లో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికాతో పోల్చితే అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోన్న కోహ్లిసేన రెండో టెస్టులో విజయంతోనే ఫ్రీడం సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తపన పడుతోంది. సెంచూరియన్‌లో చేతులెత్తేసినా వాండరర్స్‌లో సత్తా చాటేందుకు సఫారీలు సైతం కసిగా రానున్నారు. సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్, సిరీస్ సమం చేసేందుకు దక్షిణాఫ్రికాలు సర్వ శక్తులూ ఒడ్డనున్న జొహనెస్‌బర్గ్ టెస్టు సమరం ఆసక్తి రెట్టింపు చేస్తోంది. భారత్ ఖాతాలో చారిత్రక విజయం చేరుతుందా? సఫారీలు సొంతగడ్డపై రికార్డును కాపాడుకుంటారా?! ఆసక్తికరం.
ఆ ఇద్దరిపైనే ఫోకస్! : సెంచూరియన్‌లో టీమ్ ఇండియా ఎదురులేని విజయం సాధించినా.. డ్రెస్సింగ్‌రూమ్‌లో సంతృప్తి కనిపించలేదు!. టెస్టు ఫార్మాట్ నిపుణులు, బ్యాటింగ్ లైనప్‌లో కీలక బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు నిలకడగా విఫలమవుతున్నారు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రహానె 48 పరుగులు చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి శతక లేమి ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ రాణించటం తొలి టెస్టులో భారత్‌కు కలిసొచ్చింది. జొహనెస్‌బర్గ్‌లో రహానె, పుజారా, విరాట్లు కదం తొక్కాలని భారత్ ఆశిస్తోంది.
బౌలింగ్ విభాగంలో భారత్ పటిష్టంగా ఉంది. బుమ్రా, షమి, సిరాజ్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ అంచనాలను అందుకోలేదు. కానీ అతడి అవసరం లేకుండానే మిగతా ముగ్గురు పేసర్లు పని పూర్తి చేశారు. వాండరర్స్ పిచ్ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. ఈ విషయంలో జట్టు మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ కొనసాగనున్నాడు. తెలుగు తేజం హనుమ విహారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. మరోసారి నిరాశ తప్పేలా లేదు.
సఫారీలు మరింత బలంగా! : తొలి టెస్టులో ఇరు జట్ల మధ్య వ్యత్యాసం అధికంగా కనిపించింది. జొహనెస్‌బర్గ్‌లో ఆ పరిస్థితిలో మార్పు కనిపించనుంది. తొలి రోజు తొలి సెషన్లో సఫారీ పేసర్లు పేలవంగా బంతులేశారు. రెండో సెషన్ నుంచి పేసర్లు లయ అందుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు క్రికెట్ ఆడటం అందుకు ఓ కారణం. గాయంతో తొలి టెస్టుకు దూరమైన పేసర్ ఒలీవర్ నేడు బరిలో నిలువనున్నాడు. వాండరర్స్‌లో ఒలీవర్ది ఎదురులేని రికార్డు. 11.25 సగటుతో 24 వికెట్లు తీసుకున్నాడు. ఒలీవర్ రాకతో లుంగిసాని ఎంగిడి, కగిసో రబాడలకు మరింత బలం చేకూరనుంది. ముగ్గురు నాణ్యమైన పేసర్లు బంతి అందుకుంటే బ్యాటర్లపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ప్రభావం చూపించటం లేదు. అయినా, ఈ టెస్టులోనూ అతడు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ డీన్ ఎల్గార్ సెంచూరియన్‌లో సఫారీ ప్రతిఘటనకు నాయకత్వం వహించాడు. జొహనెస్‌బర్గ్‌లో సఫారీ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడేందుకు సిద్ధమవుతున్నారు. మార్కరం, పీటర్సన్, బవుమా నుంచి జట్టు మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. చారిత్రక సిరీస్ ఓటమి తప్పించేందుకు సఫారీలు వాండరర్స్‌లో అన్ని ప్రయత్నాలు చేసేందుకు చేయనున్నారు.
పిచ్, వాతావరణం : వాండరర్స్ పిచ్‌పై ఎప్పుడూ పేస్, బౌన్స్ అంచనా వేయవచ్చు. బ్యాటర్లకు ఇక్కడ నేరుగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కొవటంలో సవాల్ ఎదురు కానుంది. పచ్చికతో కూడిన వాండరర్స్ పిచ్‌పై ఫుల్ లెంగ్త్‌తో బంతులేస్తే వికెట్ల వేటలో ఉపయోగకరం. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు. సెంచూరియన్ టెస్టులో వర్షం కారణంగా ఓ రోజు ఆట తుడిచిపెట్టుకోగా.. జొహనెస్‌బర్గ్‌లో మరింత వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్ జరుగనున్న ఐదు రోజుల్లో ఏకంగా నాలుగు రోజులకు వర్షం సూచనలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్/ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా : డీన్ ఎల్గార్ (కెప్టెన్), ఎడెన్ మార్కరం, కీగన్ పీటర్సన్, రస్సీ వాన్‌డర్ డసెన్, తెంబ బవుమా, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, ఒలీవర్, లుంగి ఎంగిడి.