Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత క్రికెట్ సూపర్‌స్టార్, కొన్నేండ్ల పాటు టీమ్ ఇండియాలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన విరాట్ కోహ్లి మనస్థాపానికి గురయ్యాడు!. భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టుకు విరాట్ కోహ్లి అనూహ్యంగా దూరమయ్యాడు. వెన్ను కండరాల నొప్పి కారణంగానే విరాట్ కోహ్లి వాండరర్స్ టెస్టుకు దూరమైనట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ కోహ్లి గురించి తెలిసిన ఎవరైనా ఆ కారణాన్ని విశ్వసించటం కష్టం. విరాట్ కోహ్లి స్థానంలో కెఎల్ రాహుల్ జొహనెస్‌బర్గ్ టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
విరాట్ కోహ్లి కెరీర్ వందో టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్‌లో ఆడాల్సి ఉంది. మైలురాయి మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి మీడియా ముందుకొస్తాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరడానికి ముందు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లి.. అందుకు కౌంటర్ సైతం ఎదుర్కొంటున్నాడు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కౌంటర్ ఇచ్చేందుకు నిరాకరించినా.. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ మౌనం వహించలేదు. చేతన్ శర్మ వ్యాఖ్యలతో విరాట్ కోహ్లి కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నాడు. మైదానం వెలుపలి విషయాలతో మనస్థాపానికి గురైన విరాట్ కోహ్లి వాండరర్స్ టెస్టుకు దూరమైనట్టు చెప్పవచ్చు. విరాట్ కోహ్లికి వెన్నునొప్పి చరిత్ర ఉంది. భారత జట్టు మాజీ ఫిజియో, ట్రైనర్ శంకర్ బసు వెయిట్‌లిఫ్టింగ్ కసరత్తులతో ఆ సమస్యను ఉపశమనం తీసుకొచ్చాడు. ఎన్నోసార్లు గాయం నొప్పి వేధించినా విరాట్ కోహ్లి మైదానంలో దూసుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీ టెస్టుల్లో ఆడేందుకు, విజయాలు సాధించేందుకు విరాట్ కోహ్లి అత్యంత ఆసక్తి కనబరుస్తాడు. ఈ విషయాన్ని ఎవరూ విభేదించలేరు. దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించే అవకాశం ముంగిట విరాట్ కోహ్లి గాయం పేరిట బెంచ్‌పై కూర్చోవటం కచ్చితంగా అనుమానాలకు తావిస్తోంది. వ్యక్తిగతంగా బ్యాటింగ్ ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లి.. భారత జట్టులో అత్యంత కీలక ఆటగాడి గౌరవం సైతం కోల్పోతున్నాడు. కెరీర్ వందో టెస్టు బెంగళూర్‌లో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్న విరాట్ కోహ్లి ఇక ఫిబ్రవరి నెలాఖరులోనే మీడియా ముందుకు రానున్నాడు!. ఆ లోగా బీసీసీఐ ఈ వివాదాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తుందని ఆశిద్దాం.