Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్
- ఆదుకున్న కెఎల్ రాహుల్, అశ్విన్
- పుజారా, రహానె, పంత్ విఫలం
- దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 35/1
- భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
విదేశాల్లో భారత్‌కు పెట్టని కోట జొహనెస్‌బర్గ్ వాండరర్స్. సెంచూరియన్ విజయంతో టీమ్ ఇండియా ఇక్కడ హాట్ ఫేవరేట్‌గా బరిలో నిలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు సఫారీ పేసర్లు గట్టి పంచ్ ఇచ్చారు. తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46) అపద్భాందవ ఇన్నింగ్స్‌లు నమోదు చేసినా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 35/1తో ఆడుతోంది. వాండరర్స్ టెస్టు తొలి రోజు ఆతిథ్య దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది.
నవతెలంగాణ-జొహనెస్‌బర్గ్
కెప్టెన్ కెఎల్ రాహుల్ (50, 133 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. సహచర బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ కెఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్, లోయర్ ఆర్డర్లో రవిచంద్రన్ అశ్విన్ (46, 50 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రద స్కోరు సాధించింది. సఫారీ పేసర్లు మార్కో జాన్సెన్ (4/31), ఒలీవర్ (3/64), కగిసో రబాడ (3/64) నిప్పులు చెరగటంతో 63.1 ఓవర్లలో భారత్ 202 పరుగులకే కుప్పకూలింది. చతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానె (0), రిషబ్ పంత్ (17), శార్దుల్ ఠాకూర్ (0) విఫలమయ్యారు. తెలుగు తేజం హనుమ విహారి (20, 53 బంతుల్లో 3 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో చివరి సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 35/1తో కొనసాగుతోంది. కెప్టెన్ డీన్ ఎల్గార్ (11 నాటౌట్, 57 బంతుల్లో 1 ఫోర్), కీగన్ పీటర్సన్ (14 నాటౌట్, 39 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. మహ్మద్ షమి (1/15) ఓ వికెట్‌తో రాణించాడు.
కుప్పకూలిన మిడిల్ : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సెంచూరియన్‌లో శతక భాగస్వామ్యం అందించిన ఓపెనింగ్ జోడీ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వాండరర్స్లోనూ ఆరంభంలో ఆకట్టుకున్నారు. తొలి వికెట్‌కు విలువైన 36 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడాడు. ఐదు ఫోర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ నిలదొక్కుకున్నాడు. మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేసిన మార్కో జాన్సెన్ దక్షిణాఫ్రికాకు తొలి బ్రేక్ అందించాడు. మయాంక్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (3) దారుణంగా విఫలమయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న పుజారా 3 పరుగులే చేశాడు. తొలి టెస్టుకు దూరమైన ఒలీవర్ వాండరర్స్‌లో భారత్‌కు ఒకే ఓవర్లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో పుజారా, రహానె వికెట్లు కూల్చి భారత్‌ను ఒత్తిడిలో పడేశాడు. ఒలీవర్ బంతిని డిఫెండ్ చేయబోని పుజారా, రహానె ఇద్దరూ అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో క్యాచౌట్‌గా నిష్క్రమించారు. ఇద్దరు స్పెషలిస్ట్ టెస్టు బ్యాటర్లు వరుస బంతులకు అవుట్ కావటంతో భారత్ 49/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లలో భారత్ 53/3తో నిలిచింది.
రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ : రోహిత్‌కు గాయంతో వన్డే జట్టు పగ్గాలు అందుకోనున్న కెఎల్ రాహుల్.. విరాట్ కోహ్లికి గాయంతో అనూహ్యంగా టెస్టు జట్టుకు సైతం నాయకత్వం వహించే చాన్స్ కొట్టేశాడు. దక్షిణాఫ్రికా పేసర్లు అద్భుతంగా రాణించిన వాండరర్స్ పిచ్‌పై కెఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 128 బంతుల్లో 9 ఫోర్లు బాదిన కెఎల్ రాహుల్ రెండో సెషన్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హనుమ విహారి (20, 53 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా కీలక భాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సఫారీ బౌలర్లపై ఎదురుదాడి చేసిన హనుమ విహారి మంచి స్కోరు సాధించేలా కనిపించినా వాన్‌డర్ డుసెన్ మెరుపు క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు. రిషబ్ పంత్ (17, 43 బంతుల్లో 1 ఫోర్) కలిసి సైతం రాహుల్ మరో భాగస్వామ్యం నిర్మించాడు. అర్థ సెంచరీ అనంతరం వికెట్ కోల్పోయిన రాహుల్ నిరాశగా వెనుదిరిగాడు.
ఆదుకున్న అశ్విన్ : 116/5తో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడిన భారత్‌ను లోయర్ ఆర్డర్ ఆదుకుంది. ధనాధన్ బ్యాటర్ రిషబ్ పంత్ నిష్క్రమణతో భారత్ కథ ముగిసినట్టే అనిపించింది. కానీ రవిచంద్రన్ అశ్విన్ (46, 50 బంతుల్లో 6 ఫోర్లు) బ్యాటింగ్ స్కిల్స్ బయటపెట్టాడు. అర్థ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోయిన అశ్విన్ అప్పటికే భారత్‌కు విలువైన ఇన్నింగ్స్ అందించాడు. జశ్‌ప్రీత్ బుమ్రా (14 నాటౌట్) రబాడ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో భారత్ స్కోరు 200 పరుగులు దాటించాడు. శార్దుల్ ఠాకూర్ (0), మహ్మద్ సిరాజ్ (1) ఆకట్టుకోలేదు!. దక్షిణాఫ్రికా పేసర్లలో మార్కో జాన్సెన్ (4/31) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాండరర్స్‌లో ఎదురులేని రికార్డు కలిగిన ఒలీవర్స్, కగిసో రబాడలు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. సఫారీ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేయడానికి తోడు భారత బ్యాటర్ల చెత్త షాట్లు దక్షిణాఫ్రికాకు కలిసొచ్చాయి. 63.1 ఓవర్లలోనే భారత్ 202 పరుగులకు కుప్పకూలింది.
చెలరేగిన షమి : మహ్మద్ షమి (1/15) ఫామ్ కొనసాగించాడు. దక్షిణాఫ్రికా తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఎడెన్ మార్కరం (7)ను అద్భుత బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కీగన్ పీటర్సన్ (14 నాటౌట్) అవుటయ్యే అవకాశాన్ని వికెట్ కీపర్ పంత్ జారవిడిచాడు. తొలి స్లిప్స్‌లో పుజారా అందుకోవాల్సిన క్యాచ్‌ను పంత్ అందుకోబోగా అది నేలపాలైంది. కెప్టెన్ డీన్ ఎల్గార్ (11 నాటౌట్) తోడుగా పీటర్సన్ అజేయంగా కొనసాగుతున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) రబాడ (బి) జాన్సెన్ 50, మయాంక్ అగర్వాల్ (సి) వెరెన్నె (బి) జాన్సెన్ 26, చతేశ్వర్ పుజారా (సి) బవుమా (బి) ఒలీవర్ 3, అజింక్య రహానె (సి) పీటర్సన్ (బి) ఒలీవర్ 0, హనుమ విహారి (సి) డసెన్ (బి) రబాడ 20, రిషబ్ పంత్ (సి) వెరెన్నె (బి) జాన్సెన్ 17, రవిచంద్రన్ అశ్విన్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 46, శార్దుల్ ఠాకూర్ (సి) పీటర్సన్ (బి) ఒలీవర్ 0, మహ్మద్ షమి (సి,బి) రబాడ 9, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 14, మహ్మద్ సిరాజ్ (సి) వెరెన్నె (బి) రబాడ 1, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం :(63.1 ఓవర్లలో ఆలౌట్) 202.
వికెట్ల పతనం : 1-36, 2-49, 3-49, 4-91, 5-116, 6-156, 7-157, 8-185, 9-187, 10-202.
బౌలింగ్ : కగిసో రబాడ 17.1-2-64-3, ఒలీవర్ 17-1-64-3, లుంగిసాని ఎంగిడి 11-4-26-0, మార్కో జాన్సెన్ 17-5-31-4, కేశవ్ మహరాజ్ 1-0-6-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : డీన్ ఎల్గార్ 11 నాటౌట్, ఎడెన్ మార్కరం (ఎల్బీ) షమి 7, పీటర్సన్ 14 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం :(18 ఓవర్లలో ఓ వికెట్‌కు) 35.
వికెట్ల పతనం : 1-14.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 8-3-14-0, మహ్మద్ షమి 6-2-15-1, మహ్మద్ సిరాజ్ 3.5-2-4-0, శార్దుల్ ఠాకూర్ 0.1-0-0-0.