Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశలు రేపిన పుజారా, రహానె జోడీ
- భారత్ రెండో ఇన్నింగ్స్ 85/2
- 7/61తో నిప్పులు చెరిగిన ఠాకూర్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 229/10
వాండరర్స్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. పేసర్లు చెలరేగుతున్న పిచ్‌పై ఇప్పుడు బాధ్యత బ్యాటర్లపైనే ఉంది. శార్దుల్ ఠాకూర్ (7/61) నిప్పులు చెరిగే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు కుప్పకూలింది. 27 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్ సఫారీ సొంతమైంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. చారిత్రక సిరీస్ విజయానికి అవసరమైన పరుగులు జోడించాల్సిన బాధ్యత భారత బ్యాటర్లపై నెలకొంది. పుజారా, రహానె జోడీ దూకుడుతో భారత శిబిరంలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.
పేసర్ శార్దుల్ ఠాకూర్ (7/61) నిప్పులు చెరిగాడు. కంచుకోట వాండరర్స్‌లో అదిరే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్ల ప్రదర్శనతో దక్షిణాఫ్రికా వెన్ను విరిచాడు. ఠాకూర్‌కు తోడు షమి (2/52) సైతం మెరవటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు కుప్పకూలింది. కీగన్ పీటర్సన్ (62, 118 బంతుల్లో 9 ఫోర్లు), తెంబ బవుమా (51, 60 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించగా.. కైల్ వెరెన్నె (21), మార్కో జాన్సెన్ (21), కేశవ్ మహరాజ్ (21) విలువైన పరుగులు జోడించారు. చతేశ్వర్ పుజారా (35 బ్యాటింగ్, 42 బంతుల్లో 7 ఫోర్లు), అజింక్య రహానె (11 బ్యాటింగ్, 22 బంతుల్లో 1 ఫోర్) మూడో వికెట్‌కు అజేయంగా 41 పరుగులు జోడించటంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ సాధికారిక స్థితిలో నిలిచింది. మయాంక్ అగర్వాల్ (23), కెఎల్ రాహుల్ (8) ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 85/2తో 58 పరుగుల ముందంజలో కొనసాగుతోంది.
శార్దుల్ ఠాకూర్ షో : సెంచూరియన్ టెస్టులో ప్రభావం చూపని శార్దుల్ ఠాకూర్‌పై వాండరర్స్‌లో పెద్దగా అంచనాలు లేవు. వికెట్ల వేటలో ఆశలన్నీ బుమ్రా, షమి, సిరాజ్‌లపైనే. కెప్టెన్ డీన్ ఎల్గార్ (28, 120 బంతుల్లో 4 ఫోర్లు), కీగన్ పీటర్సన్ (62) జోడీ రెండో వికెట్‌కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తున్న తరుణంలో శార్దుల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. అర్థ సెంచరీ సాధించిన పీటర్సన్, ఫామ్‌లో ఉన్న ఎల్గార్ సహా డుసెన్ (1)ను సైతం పెవిలియన్‌కు చేర్చాడు. శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్ల ప్రదర్శనతో తొలి సెషన్‌ను భారత్ సంతృప్తికరంగా ముగించింది. 102/4తో దక్షిణాఫ్రికా సైతం కష్టాల్లో పడింది. లంచ్ విరామం అనంతరం సైతం దక్షిణాఫ్రికా మెడలు వంచింది ఠాకూరే. కైల్ వెరెన్నె (21), తెంబ బవుమా (51) వికెట్లతో ఠాకూర్ టెస్టులో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన సాధించాడు. చివరి సెషన్లో సఫారీ టెయిలెండర్లు విసిగెత్తించిన తరుణంలోనూ ఓకే ఓవర్లో మార్కో జాన్సెన్ (21), లుంగి ఎంగిడి (0)లను అవుట్ చేశాడు. 7/61తో టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై ఓ భారత పేసర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. నిరుడు గబ్బాలో 4/61 ప్రదర్శనను ఠాకూర్ వాండరర్స్‌లో మెరుగుపర్చుకున్నాడు.
సఫారీకి స్వల్ప ఆధిక్యం : భారత పేసర్లు రాణించినా తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యం సాధించింది. టాప్ ఆర్డర్లో కీగన్ పీటర్సన్ (62, 118 బంతుల్లో 9 ఫోర్లు), మిడిల్ ఆర్డర్లో తెంబ బవుమా (51, 60 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలు నమోదు చేశారు. బ్యాటింగ్ లైనప్‌లో ఇద్దరు అర్థ సెంచరీలు బాదినా ఠాకూర్ దెబ్బకు దక్షిణాఫ్రికా 179/9తో స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. టెయిలెండర్లు సఫారీలకు విలువైన తొలి ఇన్నింగ్స్ కట్టబెట్టారు. చివరి మూడు వికెట్లకు సఫారీలు 50 పరుగులు జోడించారు. మార్కో జాన్సెన్ (21, 34 బంతుల్లో 3 ఫోర్లు), కేశవ్ మహరాజ్ (21, 29 బంతుల్లో 3 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల విలువైన ఆధిక్యం సాధించింది. 79.4 ఓవర్లలో 229 పరుగులకు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
పుజారా దూకుడు : వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న పుజారా (35 నాటౌట్) కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు నిష్క్రమించిన వేళ ఎదురుదాడి చేసిన పుజారా ఏడు ఫోర్లతో అజేయంగా 35 పరుగులు చేశాడు. ఫామ్‌లో లేని మరో సహచర బ్యాటర్ అజింక్య రహానె (11 నాటౌట్) తోడుగా 41 పరుగులు జోడించాడు. పుజారా దూకుడుతో రెండో రోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ (8), మయాంక్ అగర్వాల్ (23) నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ లోటు 27 పరుగులు అధిగమించిన భారత్ మరో 58 పరుగుల ముందంజలో నిలిచింది. పుజారా, రహానె జోరు నేడు ఇలాగే కొనసాగితే దక్షిణాఫ్రికాకు 300 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించేందుకు భారత్ ఆడనుంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 202/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : ఎల్గార్ (సి) పంత్ (బి) ఠాకూర్ 28, మార్కరం (ఎల్బీ) షమి 7, పీటర్సన్ (సి) మయాంక్ (బి) ఠాకూర్ 62, డుసెన్ (సి) పంత్ (బి) ఠాకూర్ 1, బవుమా (సి) పంత్ (బి) ఠాకూర్ 51, వెరెన్నె (ఎల్బీ) ఠాకూర్ 21, జాన్సెన్ (సి) అశ్విన్ (బి) ఠాకూర్ 21, రబాడ (సి) సిరాజ్ (బి) షమి 0, మహరాజ్ (బి) బుమ్రా 21, ఒలీవర్ నాటౌట్ 1, ఎంగిడి (సి) పంత్ (బి) ఠాకూర్ 0, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం :(79.4 ఓవర్లలో ఆలౌట్) 229.
వికెట్ల పతనం : 1-14, 2-88, 3-101, 4-102, 5-162, 6-177, 7-179, 8-217, 9-228, 10-229.
బౌలింగ్ : బుమ్రా 21-5-49-1, షమి 21-5-52-2, సిరాజ్ 9.5-2-24-0, ఠాకూర్ 17.5-3-61-7, అశ్విన్ 10-1-35-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) మార్కరం (బి) జాన్సెన్ 8, మయాంక్ (ఎల్బీ) ఒలీవర్ 23, పుజారా 35 నాటౌట్, రహానె 11 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం :(20 ఓవర్లలో 2 వికెట్లకు) 85.
వికెట్ల పతనం : 1-24, 2-44.
బౌలింగ్ : రబాడ 6-1-26-0, ఒలీవర్ 4-0-22-1, ఎంగిడి 3-1-5-0, జాన్సెన్ 6-2-18-1, మహరాజ్ 1-0-8-0.