Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జకోవిచ్ వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా
- ప్రభుత్వ డిటెన్షన్ హోటల్లో జకోవిచ్
నవతెలంగాణ-మెల్బోర్న్
ప్రపంచ టెన్నిస్ స్టార్, మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) త్రిశంకు స్వర్గంలో పడిపోయాడు!. ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్బోర్న్ చేరుకున్న జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. విక్టోరియా ప్రభుత్వం అనుమతితో ఆస్ట్రేలియా వీసా పొందిన జకోవిచ్ అనూహ్య ఆందోళనలు, నిరసనతో వీసా వివాదంలో చిక్కుకున్నాడు. మెల్బోర్న్ విమానాశ్రయంలో జకోవిచ్‌ను ప్రశ్నించిన సరిహద్దు అధికారులు అనంతరం అదుపులోకి తీసు కున్నారు. కోవిడ్-19 టీకా తీసుకున్న వారికి మాత్రమే ఆస్ట్రే లియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. టీకా తీసుకోని జకోవిచ్ అందుకు విక్టోరియా ప్రభుత్వం నుంచి మినహాయింపు పొందాడు. కానీ టీకా తీసుకోనందుకు మినహాయింపు పొందిన కారణాలతో ఫెడరల్ ప్రభుత్వ అధికారులు సంతృప్తి చెందలేదు. వీసా రద్దు చేయడాన్ని జకోవిచ్ న్యాయవాదులు న్యాయస్థానంలో సవాల్ చేశారు. న్యాయస్థానంలో జకోవిచ్ వీసాపై నిర్ణయం వెలువడే వరకు అతడిని ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్భంద హోటల్లో ఉంచారు.
వివాదం ఏమిటీ? : కోవిడ్-19 టీకా తీసుకునే విషయంలో నొవాక్ జకోవిచ్ ఆది నుంచి వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ విషయంలో తన అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడించాడు. కోవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ వేదిక మెల్బోర్న్ ప్రపంచంలోనే అత్యధిక కాలం లాక్డౌన్ చవిచూసిన నగరం. ఇక్కడ 90 శాతం ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిడ్-19 టీకా తీసుకోని జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అంశంపై సందిగ్థత నెలకొంది. ఆ కారణంగానే సిడ్నీ ఏటీపీ టోర్నీకి జోకర్ దూరంగా ఉన్నాడు. కోవిడ్-19 టీకా మినహాయింపు కోరిన జకోవిచ్‌ను టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా ప్రభుత్వ వైద్య ప్రతినిధులు పరిశీలించి మినహాయింపు కల్పించారు. టీకా విషయంలో ప్రత్యేక మినహాయింపు పొందినట్టు జకోవిచ్ సోషల్‌మీడియాలో వెల్లడించాడు. స్టార్ క్రీడాకారుడి విషయంలో చట్టాలు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వటంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తొలుత విక్టోరియా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఫెడరల్ ప్రభుత్వం అనంతరం విమానాశ్రయంలో జకోవిచ్‌ను నిలువరించింది.
చట్టం ఏం చెబుతోంది? : ఆస్ట్రేలియాలోని రాష్ట్రాలు తమకు అనుగుణమైన కోవిడ్-19 నిబంధనలు రూపొందించుకున్నాయి. కోవిడ్-19 నిబంధనల విషయంలో రాష్ట్రాలు ప్రత్యేక మినహాయింపులు కల్పించుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ నిబంధనలు అంతర్జాతీయ సరిహ ద్దులకు వర్తించవు. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వ్యక్తులకు మాత్రమే ఆ మినహాయింపులు వర్తిస్తాయి. నొవాక్ జకోవిచ్ అంతర్జాతీయ సరిహద్దు గుండా విక్టోరియా రాష్ట్రంలోకి అడుగుపెడుతు న్నాడు. దీంతో జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీసా పొందాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఎలా? : ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వ అధికారులు వీసా రద్దు నిర్ణయాన్ని జకోవిచ్ న్యాయవాదులు కోర్టులో సవాల్ చేశారు. జకోవిచ్‌కు కోవిడ్-19 టీకా తీసుకోని అంశంలో మినహాయింపులు ఇచ్చిన అంశంలో కోర్టు ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు వెల్లడించనుంది. న్యాయస్థానంలో చుక్కెదురైతే జకోవిచ్ హోటల్ నుంచి నేరుగా స్వదేశానికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. తీర్పు అనుకూలంగా వస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డు 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ బరిలో నిలువనున్నాడు.
ఇదిలా ఉండగా, తొలుత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సైతం జకోవిచ్‌కు మినహాయింపులపై సానుకూలంగా స్పందించారు. కానీ ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకతకు తోడు ఈ ఏడాది మే నెలలో ఫెడరల్ ఎన్నికలు జకోవిచ్ విషయంలో టూ టర్న్ తీసుకునేలా చేశాయి. ప్రభుత్వ డిటెన్షన్ హోటల్లో జకోవిచ్‌ను హింసిస్తున్నారని సెర్బియా ప్రధాని చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా ప్రధాని తోసిపుచ్చారు.