Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాండరర్స్‌లో భారత్ అనూహ్య ఓటమి
- ఛేదనలో డీన్ ఎల్గార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
- 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
- టెస్టు సిరీస్ 1-1తో సమం
విదేశీ పర్యటనల్లో కంచుకోటలను బద్దలుకొట్టడమే అలవాటుగా మార్చుకున్న టీమ్ ఇండియా ఆ క్రమంలో తొలిసారి సొంత కోటను కోల్పోయింది. గత 30 ఏండ్లలో వాండరర్స్‌లో ఓటమెరుగని భారత జట్టు జొహనెస్‌బర్గ్‌లో టెస్టు ఓటమి రుచి చూసింది. 240 పరుగుల ఊరించే ఛేదనలో ఆతిథ్య దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కెప్టెన్ డీన్ ఎల్గార్ (00) ఛేదనను ముందుండి నడిపించాడు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బంతులేసినా సఫారీ బ్యాటర్లు పరుగుల వేటలో కదం తొక్కారు. రెండో టెస్టును 7 వికెట్ల తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
నవతెలంగాణ-జొహనెస్‌బర్గ్
దక్షిణాఫ్రికా గొప్పగా పుంజుకుంది. చారిత్రక సిరీస్ విజయం వేటలో టీమ్ ఇండియాకు గట్టి ఝలక్ ఇచ్చింది. సిరీస్‌పై కన్నేసి వాండరర్స్ టెస్టులో అడుగుపెట్టిన టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో అనూహ్య పరాజయం చవిచూసింది. అత్యుత్తమ పేస్ దళంతో ప్రపంచ జట్లను గడగడలాంచిన భారత్.. విచిత్రంగా మూడు దశాబ్దాలుగా ఓటమెరుగని వేదికపై అదే పేస్ దళంతో ఓటమి చవిచూసింది. 240 పరుగుల ఛేదనలో డీన్ ఎల్గార్ (96 నాటౌట్, 188 బంతుల్లో 10 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సెంచూరియన్ టెస్టులోనూ ఒంటరి పోరాటం చేసిన ఎల్గార్.. వాండరర్స్‌లో సహచరుల అండ దక్కించుకున్నాడు. ఎడెన్ మార్కరం (31, 38 బంతుల్లో 6 ఫోర్లు), కీగన్ పీటర్సన్ (40, 92 బంతుల్లో 5 ఫోర్లు) సహా తెంబ బవుమా (23 నాటౌట్, 45 బంతుల్లో 3 ఫోర్లు) అద్భుతంగా ఆడారు. రెండో టెస్టులో ఘన విజయంతో టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఛేదనలో అదిరే ఇన్నింగ్స్‌తో నమోదు చేసిన డీన్ ఎల్గార్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. నిర్ణయాత్మక మూడో టెస్టు జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ఆరంభం కానుంది.
ఎల్గార్ అదరగొట్టాడు : లక్ష్యం 240 పరుగులు. మూడో రోజు ముగిసే సమయానికి సఫారీ స్కోరు 118/2. 2018 పర్యటనలోనూ వాండరర్స్‌లో సఫారీ ఇదే పరిస్థితుల్లో ఓటమి చూసింది. 242 పరుగుల ఛేదనలో 142/2తో పటిష్టంగా కనిపించినా వరుస వికెట్ల పతనంతో 63 పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో తాజా టెస్టులోనూ భారత్‌కు విజయావకాశాలు గణనీయంగా ఉన్నాయని అనిపించింది. రెండు సెషన్ల పాటు కురిసిన వర్షం భారత పేసర్లకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు కనిపించాయి. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమాన సహనం, తెగువ చూపించారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ జట్టును ముందుండి నడిపించాడు. మార్కరం, పీటర్సన్, డుసెన్, బవుమాలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. బుమ్రా, షమి, సిరాజ్, ఠాకూర్‌లు మంచి బంతులేసినా సఫారీ బ్యాటర్లు సహనంతో ఆడారు. 131 బంతుల్లో 3 ఫోర్లతో అర్థ సెంచరీ సాధించిన ఎల్గార్ విన్నింగ్స్ షాట్‌తో 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాన్‌డర్ డుసెన్, తెంబ బవుమా సైతం అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరు మెరవటంతో మరో ఎండ్‌లో ఎల్గార్ పని సులువైంది. 67.4 ఓవర్లలో 3 వికెట్లకు దక్షిణాఫ్రికా 243 పరుగులు చేసింది.
వర్షం..వర్షం.. : నాల్గో రోజుకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. గురువారం ఉదయం నుంచే వర్షం మొదలైంది. భారీ వర్షం అనంతరం సూపర్‌సోపర్స్‌తో మైదానాన్ని సిద్ధం చేసినా.. కొద్ది విరామంలోనే మరోసారి కుండపోత వర్షం కురవటం సాధారణమైంది. దీంతో తొలి రెండు సెషన్ల పాటు ఆట సాధ్యపడలేదు. టీ విరామం అనంతరం పరిస్థితులు మెరుగుపడటంతో చివరి సెషన్లో ఆట ఆరంభమైంది. 118/2తో ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 202/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 229/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 266/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : ఎడెన్ మార్కరం (ఎల్బీ) శార్దుల్ ఠాకూర్ 31, డీన్ ఎల్గార్ 96 నాటౌట్, కీగన్ పీటర్సన్ (ఎల్బీ) అశ్విన్ 28, వాన్‌డర్ డుసెన్ (సి) పుజారా (బి) మహ్మద్ షమి 40, తెంబ బవుమా 23 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 25, మొత్తం :(67.4 ఓవర్లలో 3 వికెట్లకు) 243.
వికెట్ల పతనం : 1-47, 2-93, 3-175.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 17-2-70-0, మహ్మద్ షమి 17-3-55-1, శార్దుల్ ఠాకూర్ 16-2-47-1, మహ్మద్ సిరాజ్ 6-0-37-0, రవిచంద్రన్ అశ్విన్ 11.4-2-26-1.