Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిర్‌స్టో అజేయ శతకం
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 258/7
సిడ్నీ : యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ ప్రతిఘటన నేర్చుకుంది. తొలి మూడు టెస్టుల్లో చేతులెత్తేసిన ఇంగ్లీష్ జట్టు సిడ్నీ వేదికగా కొత్త ఏడాదిలో సరికొత్తగా ఆడే ప్రయత్నం చేస్తోంది. వర్షం అంతరాయం కలిగిస్తున్న టెస్టులో ఇంగ్లాండ్ మరోసారి పతనం దిశగా దూసుకెళ్లినా జానీ బెయిర్‌స్టో (103 నాటౌట్, 140 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. హసీబ్ హమీద్ (6), జాక్ క్రావ్లీ (18), డెవిడ్ మలాన్ (3), జో రూట్ (0) వైఫల్యంతో 36/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న ఇంగ్లాండ్‌ను జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ జోడీ ఆదుకుంది. నాల్గో వికెట్‌కు ఈ జోడీ 128 పరుగుల బారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఆస్ట్రేలియా పేసర్లు విజృంభిస్తున్న వేళ బెన్ స్టోక్స్ (66, 91 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో క్రీజులో కుదురుకున్నారు. ఎనిమిది ఫోర్లతో 70 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత వికెట్ కాపాడుకోలేదు. ఆరు ఫోర్లతో 80 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జానీ బెయిర్‌స్టో.. ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 138 బంతుల్లోనే శతకబాదాడు. 2018 తర్వాత జానీ బెయిర్‌స్టో సాధించిన తొలి శతకం ఇది. మూడో రోజు ఆట చివరి ఓవర్లో వంద పరుగుల మైలురాయి చేరుకున్న బెయిర్‌స్టో అజేయంగా నిలిచాడు. జోశ్ బట్లర్ (0) వికెట్‌తో ఆసీస్ పట్టు సాధించినా.. మార్క్‌వుడ్ (39, 41 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) జానీ వేగంగా పరుగులు పిండుకున్నాడు. జానీ బెయిర్‌స్టో తోడుగా జాక్ లీచ్ (4 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 258/7తో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు మరో 158 పరుగుల వెనుకంజలో నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416/8 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.