- స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధనలు - జనవరి16 నుంచి అమల్లోకి నయా రూల్స్ దుబాయ్ : ఆధునిక క్రికెట్‌కు ఊపుతీసుకొచ్చిన ఫార్మాట్ టీ20. పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా ఎదురవుతున్న సమస్య స్లో ఓవర్‌రేట్. షెడ్యూల్ సమయానికి ఓవర్ల కోటా పూర్తి కాకపోవటంతో టీ20 మ్యాచులు కొన్నిసార్లు అర్థరాత్రి వరకు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. స్లో ఓవర్‌రేట్ ఓ దశలో టీ20 క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించేలా కనిపించింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సరికొత్త నిబంధనలు రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్ అనంతరం కాకుండా మ్యాచ్‌లోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జనవరి 16న న్యూజిలాండ్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌తో ఐసీసీ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధన ఏమిటీ? : నిర్దేశించిన లేదా షెడ్యూల్ సమయానికి ఫీల్డింగ్ జట్టు 20 ఓవర్ల కోటా పూర్తి చేయాలి. ఒకవేళ అలా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆ జట్టు 30 గజాల సర్కిల్ ఆవల ఐదుగురు ఫీల్డర్ల స్థానంలో నలుగురిని మాత్రమే నిలుపుకోగలదు. ఈ నిబంధన మెన్స్, ఉమెన్స్ క్రికెట్‌కు వర్తిస్తుంది. ఐసీసీ శుక్రవారం వెల్లడించిన నూతన నిబంధన ప్రకారం షెడ్యూల్ సమయంలోగా ఫీల్డింగ్ జట్టు చివరి ఓవర్‌ను మొదలుపెట్టాలి. డ్రింక్స్ విరామం కోసం జట్లు ఇన్నింగ్స్ మధ్యలో 190 సెకండ్ల సమయం ప్రత్యేకంగా తీసుకోవచ్చు. ఓ సిరీస్ ఆరంభానికి ముందే ఇరు జట్లు అందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఓ ఇన్నింగ్స్ ఎంత సమయం? : ఇప్పటి వరకు ప్రతి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు 85 నిమిషాల సమయం ఉండేది. ఐసీసీ నూతన నిబంధనల ప్రకారం టీ20ల్లో 20 ఓవర్‌ను 85 నిమిషం లోగా మొదలుపెట్టాలి. ఇన్నింగ్స్‌ను ఏ సమయం లోగా పూర్తి చేయాలనే విషయాన్ని మ్యాచ్ అధికారులు ఇన్నింగ్స్ ఆరంభానికి ముందే ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు తెలియజేస్తారు. గాయాలు, డీఆర్‌ఎస్ సమీక్షలు, బంతి బయటపడటం, ఇతర ఏ కారణాలతో ఆలస్యం జరిగినా ఆ సమయన్ని లెక్కించి ఇన్నింగ్స్ ముగింపు సమయాన్ని రీషెడ్యూల్ చేస్తారు. మూడో అంపైర్ ఈ సమయాన్ని లెక్కిస్తాడు. రీ షెడ్యూల్ సమయాన్ని ఫీల్డ్ అంపైర్లతో పంచుకుంటాడు. ప్రభావం ఎలా ఉంటుంది? : ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ ఫార్ములాను దేశవాళీ సర్క్యూట్‌లో అమలు చేసింది. ఐసీసీ ఈ నిబంధనలను అమలు చేయనుండటంతో భవిష్యత్‌లో మెగా టీ20 లీగ్‌లు సైతం కొత్త రూల్స్‌ను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో డెత్ ఓవర్లలో చివరి ఓవర్ అత్యంత కీలకం. 30 గజాల సర్కిల్ ఆవల ఐదుగురు ఫీల్డర్లతోనే బౌండరీల ప్రవాహం ఆపలేం. అలాంటిది స్లో ఓవర్‌రేట్ కారణంగా ఓ ఫీల్డర్‌ను బౌండరీ లైన్ వద్ద కోల్పోవటం ఫీల్డింగ్ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బ అవుతుంది. ఈ నిబంధనతో చివరి ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పనుందని చెప్పవచ్చు. అసలు మ్యాచ్ ఫలితాన్ని శాసించనుందని చెప్పినా అతిశయోక్తి కాదు. గతంలో స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించారు. కానీ తాజా నిబంధనతో మ్యాచ్ ఫలితమే మారే ప్రమాదం ఉంది. దీంతో నిర్ణీత సమయంలో ఇన్నింగ్స్ ముగించేందుకు ఫీల్డింగ్ జట్లు ఇప్పుడు మెరుగైన ప్రణాళికతో వస్తాయని ఆశించవచ్చు.