Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అనిల్ కామినేని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్చరీ క్రీడకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అనిల్ కామినేని అన్నారు. దశాబ్ద కాలానికి పైగా నిలిచిపోయిన ర్యాంకింగ్ టోర్నీని ఆ ప్రక్రియలో భాగంగానే పున ప్రారంభించామని అనిల్ కామినేని చెప్పారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జాతీయ ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా అనిల్ కామినేని మీడియాతో మాట్లాడారు. 'ఎన్టీపీసీ సహకారంతో జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీమెంట్‌ను తిరిగి ప్రారంభించాం. 2000వ దశకంలో ఏటా ర్యాంకింగ్ టోర్నీ నిర్వహణ ద్వారా క్రీడాకారుల్లో పోటీతత్వం పెరిగేది. ప్రతిభావంతులైన ఆర్చర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభించేవి. క్రమం తప్పకుండా ఈ టోర్నీ నిర్వహించటంతో దేశ, రాష్ట్ర స్థాయిలో నాణ్యమైన ఆర్చర్లు తయారయ్యారు. ఆ పూర్వ వైభవం సాధించేందుకు తిరిగి ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ వేదికగా అందుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది టోర్నమెంట్ ఓవరాల్ ప్రైజ్‌మనీ రూ.90 లక్షలు. గతంలో కేవలం సీనియర్ విభాగంలోనే ర్యాంకింగ్ టోర్నీ ఉండేది. ఇప్పుడు జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నాం. నామమాత్రంగా కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీ రేంజ్‌ను నెలకొల్పి అందులో పోటీలు జరుపుతున్నాం. దీంతో ఆర్చర్లకు అంతర్జాతీయ ఈవెంట్‌లో పోటీపడిన అనుభూతిని అందివ్వగలుతున్నాం. ఇతర దేశాల్లో టోర్నీలకు వెళ్లినప్పుడు అక్కడి టెక్నాలజీ, సెటప్ చూసి ఒత్తిడికి గురవకుండా మెరుగైన ప్రదర్శన చేయడానికి ఈ ప్రయత్నం దోహదం చేస్తుంది. ఇక, గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్ ఆర్చరీ అకాడమీ నెలకొల్పడానికి కొంత స్థలం కేటాయించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డిని కోరాం. ప్రభుత్వం సహకరిస్తే అంతర్జాతీయ స్థాయిలో తప్పకుండా రెసిడెన్షియల్ అకాడమీ ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను ఆర్చరీ హబ్‌గా తీర్చిదిద్దుతామని' అనిల్ కామినేని అన్నారు.