Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమిష్టి కృషితో సిడ్నీ టెస్టు డ్రా
- క్రావ్లీ, స్టోక్స్, బెయిర్‌స్టో గొప్ప ప్రతిఘటన
- 388 ఛేదనలో ఇంగ్లాండ్ 270/9
- ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ ఆశలు ఆవిరి
టెస్టు క్రికెట్‌లో జీవం లేని పోరాటమే లేదేమో!. సిడ్నీ టెస్టుకు 3-0 ఆధిక్యంతో వచ్చిన ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో ఎదురులేని ఆధిపత్యంతో యాషెస్ క్లీన్‌స్వీప్‌పై స్వప్నించింది. బ్యాటర్లతో పాటు టెయిలెండర్లు సైతం గొప్ప పోరాటస్ఫూర్తి చూపించటంతో చివరి రోజు ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ పది వికెట్లు నిరాకరించింది. మూడు సెషన్ల పాటు ఆసీస్ బౌలర్లను ఎదురించి నిలిచిన ఇంగ్లాండ్ 102 ఓవర్లలో 270/9తో అద్భుతం చేసింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ త్రయం ఏకంగా 64 బంతులు కాచుకుని చివరి వికెట్‌ను ఆతిథ్య జట్టుకు నిరాకరించింది. ఆద్యంతంగా ఉత్కంఠగా సాగిన సిడ్నీ టెస్టును ఇంగ్లాండ్ అసమాన పోరాటంతో డ్రా చేసుకుంది. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు కంగారూలకు దీటైన ప్రదర్శనతో బదులిచ్చింది!.
నవతెలంగాణ-సిడ్నీ : యాషెస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే ఆస్ట్రేలియా ఆశలు ఆవిరైంది. ఆతిథ్య కంగారూలు ఆధిపత్యం చెలాయించిన సిడ్నీ టెస్టును ఇంగ్లాండ్ అద్భుత రీతిలో డ్రా చేసుకుంది. ఓపెనర్ జాక్ క్రావ్లీ (77, 100 బంతుల్లో 13 ఫోర్లు), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (60, 123 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలకు తోడు జానీ బెయిర్‌స్టో (41, 105 బంతుల్లో 3 ఫోర్లు), టెయిలెండర్ జాక్ లీచ్ (26, 34 బంతుల్లో 2 ఫోర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. తొలి రెండు సెషన్లలో ఆసీస్‌కు నాలుగు వికెట్లే కోల్పోయిన ఇంగ్లాండ్.. చివరి సెషన్లో ఐదు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రధాన బ్యాటర్లు అందరూ పెవిలియన్‌కు చేరుకున్న అనంతరం టెయిలెండర్లు కండ్లుచెదిరే రీతిలో పోరాడారు. జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ చివర్లో ఏకంగా 64 బంతులు కాచుకున్నారు. చివరి బంతి వరకు ఉత్కంఠకు దారితీసిన సిడ్నీ టెస్టును స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ఆస్ట్రేలియా వశం కానివ్వలేదు. 102 ఓవర్లలో 270 పరుగులకు ఇంగ్లాండ్ 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. 388 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఓవర్‌నైట్ 30/0తో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ విజయంపై కన్నేయకపోయినా.. డ్రా కోసం గొప్ప పోరాటపటిమ ప్రదర్శించింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌కు తోడు టెయిలెండర్ల పోరాటంతో ఇంగ్లాండ్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాను విజయానికి దూరంగా పెట్టింది. రెండు ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు బాదిన ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో చివరి టెస్టు జనవరి 14 నుంచి హౌబర్ట్‌లో జరుగనుంది.
టాప్ ఆర్డర్ ఫట్ : ఇంగ్లాండ్ 122/3
ఇంగ్లాండ్ 90 ఓవర్ల పాటు ప్రతిఘటిస్తుందనే అంచనాలు పెద్దగా లేవు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో శతకం ఇచ్చిన ఉత్సాహం ఇంగ్లాండ్ శిబిరంలో కొండంత ధైర్యం నూరిపోసింది. ఆ స్ఫూర్తి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆసాంతం కనిపించింది. ఓపెనర్ జాక్ క్రావ్లీ (77) టాప్ ఆర్డర్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 100 బంతుల్లోనే 13 ఫోర్లతో 77 పరుగులు పిండుకున్నాడు. మరో ఓపెనర్ హసీబ్ హమీద్ (9, 58 బంతుల్లో), డెవిడ్ మలాన్ (4, 29 బంతుల్లోక్ష్మి) సహకరించారు. చివరి రోజు ఆటలో తొలి సెషన్లో జాక్ క్రావ్లీ దూకుడుతో ఇంగ్లాండ్ వేగంగా పరుగులు పిండుకుంది. తొలి సెషన్లో ఏకంగా 90 పరుగులు సాధించింది. క్రావ్లీ ఆసీస్ బౌలర్లలో ఎవరినీ వదల్లేదు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఆస్ట్రేలియానే ఒత్తిడిలో పడేసిన జాక్ క్రావ్లీని కామెరూన్ గ్రీన్ వెనక్కి పంపించాడు. బొలాండ్ బంతికి హమీద్.. లయాన్ మాయలో మలాన్ పడిపోయారు. దీంతో తొలి సెషన్లో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడినా టాప్ ఆర్డర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఇంగ్లాండ్‌కు లేదు. కానీ రెండు సెషన్లలో మరో ఏడు వికెట్లు తీసే అవకాశం ఆస్ట్రేలియాకు ఉంది. దీంతో తొలి సెషన్‌ను ఆసీస్ సంతృప్తిగా ముగించింది.
స్టోక్స్ అదరగొట్టాడు : ఇంగ్లాండ్ 174/4
లంచ్ విరామం అనంతరం ఇంగ్లాండ్ అదరగొట్టింది. ఈ సెషన్లో ఇంగ్లీష్ జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ (24, 85 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా సెషన్‌ను మొదలెట్టిన బెన్ స్టోక్స్.. జానీ బెయిర్‌స్టోతో కలిసి టీ విరామానికి వెళ్లాడు. ఈ సెషన్లో ఇంగ్లాండ్ 52 పరుగులే చేసినా.. సిడ్నీ టెస్టును డ్రా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. 85 బంతుల్లో 24 పరుగులు చేసిన జో రూట్‌ను బొలాండ్ వెనక్కి పంపించాడు. నాయకుడు రూట్ నుంచి మరింత దృఢమైన ఇన్నింగ్స్ ఆశించినా.. జో రూట్ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. స్టోక్స్ మాత్రం మరో ఎండ్‌లో సాధికారిక ప్రదర్శన చేశాడు. ఆసీస్ పేసర్లు, స్పిన్నర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు. నమ్మకంగా షాట్లు ఆడిన స్టోక్స్ విలువైన పరుగులూ ఖాతాలో వేసుకున్నాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో మెరిసిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. రెండో సెషన్లో బెన్ స్టోక్స్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. సిడ్నీ టెస్టులో ఇంగ్లాండ్ డ్రా దిశగా ఇక్కడే బలమైన పునాది వేసుకుంది.
అద్భుతం చేశారు : ఇంగ్లాండ్ 270/9
చివరి సెషన్ అత్యంత నాటకీయంగా సాగింది. ఆస్ట్రేలియా ఈ సెషన్లో ఏకంగా ఐదు వికెట్లు కూల్చింది. తొలి రెండు సెషన్లలో ఆసీస్ నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగా.. చివరి సెషన్లో అందుకు భిన్నమైన ప్రదర్శన చేసింది. అజేయ ఇన్నింగ్స్ లాంఛనమే అనేలా ఆడిన బెన్ స్టోక్స్ ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 107 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఈ టెస్టులో బెన్ స్టోక్స్‌కు ఇది రెండో అర్థ శతకం. నాథన్ లయాన్ ఓవర్లో ఓ బంతిని ఆడేందుకు బెన్ స్టోక్స్ చూపిన మీమాంస అతడిని పెవిలియన్‌కు చేర్చింది. షాట్ ఆడాలా? వద్దా? అని ఆలోచించిన బెన్ స్టోక్స్ స్లిప్స్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. తీవ్ర అసహనంతో బెన్ స్టోక్స్ క్రీజును వీడాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 193/5. స్టోక్స్ నిష్క్రమించినా మరో ఎండ్‌లో జానీ బెయిర్‌స్టో (41, 105 బంతుల్లో 3 ఫోర్లు) గొప్ప తెగువ చూపించాడు. జోశ్ బట్లర్ (11, 38 బంతుల్లో)తో కలిసి జానీ బెయిర్‌స్టో ప్రతిఘటించాడు. పాట్ కమిన్స్ అద్వితీయ ఓవర్లో రెండు వికెట్లు కూల్చి ఆసీస్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. మెరుపు ఇన్‌స్వింగర్‌తో జోశ్ బట్లర్, మార్క్ వుడ్(0)లను వరుసగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆసీస్ కెప్టెన్ ఇన్‌స్వింగ్ విన్యాసంతో ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. జాక్ లీచ్ (26, 34 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి జానీ బెయిర్‌స్టో కథ సుఖాంతం చేస్తాడని అనుకుంటే.. తొలి ఇన్నింగ్స్ శతక హీరోను బొలాండ్ బోల్తా కొట్టించాడు. చివరి మూడు ఓవర్లలో ఆస్ట్రేలియాకు రెండు వికెట్లు అవసరం. ఈ దశలో స్టీవ్ స్మిత్ స్పిన్ మాయజాలంతో జాక్ లీచ్‌ను అవుట్ చేశాడు. కానీ చివరి 12 బంతులను టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్ (8 నాటౌట్), జేమ్స్ అండర్సన్ (0 నాటౌట్) సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతి బంతికి ఎనలేని ఉత్కంఠ కనిపించినా సీనియర్ టెయిలెండర్లు కంగారూలకు కంగారు మిగిల్చారు. చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ 91 ఓవర్లు ఎదుర్కొని ఆస్ట్రేలియా విజయ ప్రస్థానానికి బ్రేక్ వేసింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 416/8 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 294/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 265/6 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : జాక్ క్రావ్లీ (ఎల్బీ) కామెరూన్ గ్రీన్ 77, హసీబ్ హమీద్ (సి) కేరీ (బి) బొలాండ్ 9, డెవిడ్ మలాన్ (బి) లయాన్ 4, జో రూట్ (సి) కేరీ (బి) బొలాండ్ 24, బెన్ స్టోక్స్ (సి) స్మిత్ (బి) లయాన్ 60, జానీ బెయిర్‌స్టో (సి) లబుషేన్ (బి) బొలాండ్ 41, జోశ్ బట్లర్ (ఎల్బీ) పాట్ కమిన్స్ 11, మార్క్‌వుడ్ (ఎల్బీ) పాట్ కమిన్స్ 0, జాక్ లీచ్ (సి) వార్నర్ (బి) స్మిత్ 26, స్టువర్ట్ బ్రాడ్ నాటౌట్ 8, జేమ్స్ అండర్సన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(102 ఓవర్లలో 9 వికెట్లకు) 270.
వికెట్ల పతనం :1-46, 2-74, 3-96, 4-156, 5-193, 6-218, 7-218, 8-237, 9-270.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 18-2-68-0, పాట్ కమిన్స్ 22-5-80-2, స్కాట్ బొలాండ్ 24-11-30-3, నాథన్ లయాన్ 22-10-28-2, కామెరూన్ గ్రీన్ 10-1-38-1, మార్నస్ లబుషేన్ 2-0-9-0, స్టీవ్ స్మిత్ 4-1-10-1.