Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రషీద్ ఖాన్‌తోనూ జోరుగా చర్చలు
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన ప్రాంఛైజీ అహ్మదాబాద్‌కు స్టార్ ఆల్‌రౌండర్, బరోడా హీరో హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ మేరకు అహ్మదాబాద్ ప్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి. ముంబయి ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం అనంతరం హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ వేలంలోకి వదిలేసింది. గాయంతో లయ తప్పిన పాండ్యను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సైతం దూరం పెట్టింది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాంఛైజీ నాయకత్వ పగ్గాలు హార్దిక్ పాండ్యకు దక్కనుండటం అతడికి కెరీర్ పరంగా పెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. ముంబయి ఇండియన్స్‌కు వదిలేసిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్తోనూ అహ్మదాబాద్ ప్రాంఛైజీ మంతనాలు జరుపుతోంది. ఆరెంజ్ ఆర్మీ స్పిన్ మాస్టర్ రషీద్ ఖాన్ కోసం అటు లక్నో, ఇటు అహ్మదాబాద్ ప్రాంఛైజీలు జోరుగా చర్చలు జరుపుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తెగతెంపులు చేసుకున్న రషీద్ ఖాన్‌ను జట్టులోకి తీసుకునేందుకు అహ్మదాబాద్ డీల్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే మెగా వేలానికి ముందు కొత్త ప్రాంఛైజీలు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ సహా రషీద్ ఖాన్‌ను ఎంచుకునేందుకు అహ్మదాబాద్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారత జట్టు భవిష్య కెప్టెన్‌గా పిలువబడుతున్న కెఎల్ రాహుల్ దాదాపు లక్నో ప్రాంఛైజీ నాయకత్వ పగ్గాలు అందుకోవటం లాంఛనమైనట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ ప్రాంఛైజీ యాజమాన్యం బెట్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉందనే కారణంతో ఆ ప్రాంఛైజీ చట్టబద్దతపై కొన్ని అనుమానాలు ఉండేవి. న్యాయపరంగా అన్ని చిక్కులు అధిగమించిన బీసీసీఐ అహ్మదాబాద్ ప్రాంఛైజీకి క్రికెట్ వ్యవహారాలకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. భారత మాజీ పేసర్ ఆశీష్ నెహ్రాను అహ్మదాబాద్ చీఫ్ కోచ్‌గా తీసుకునే అవకాశం ఉంది.