Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్ణయాత్మక టెస్టు సమరంపై ఉత్కంఠ
- చారిత్రక విజయంపై కన్నేసిన కోహ్లిసేన
- నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టు
సఫారీ గడ్డపై భారత జట్టుకు చారిత్రక సిరీస్ విజయం. దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ను భారత్ ఏకంగా క్లీన్‌స్వీప్ చేయగలదు. భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ పండితుల అంచనాలు ఇవి. అందుకు తగినట్టుగానే సెంచూరియన్ కోటను టీమ్ ఇండియా బద్దలుకొట్టగా.. వాండరర్స్‌లో భారత్ రికార్డుకు దక్షిణాఫ్రికా చెక్ పెట్టింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ నిర్ణయాత్మక టెస్టు సమరం నేటి నుంచి కేప్‌టౌన్‌లో ఆరంభం కానుంది. చారిత్రక సిరీస్ విజయంపై భారత్ కన్నేయగా.. స్వదేశంలో భారత్‌పై ఎదురులేని రికార్డు నిలుపుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టు సమరం నేడు ఆరంభం.
నవతెలంగాణ-కేప్‌టౌన్
విదేశీ గడ్డపై అద్వితీయ విజయాలు. ఐదు రోజుల ఆటలో తిరుగులేని ప్రదర్శన. అన్ని విభాగాల్లోనూ ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు. ఏ పరిస్థితుల్లోనైనా విజయం సాధిస్తామనే దీమా. ఇటీవల కాలంలో టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అగ్ర జట్టుగా నిలిపింది. మరోవైపు దక్షిణాఫ్రికా కథ పూర్తి భిన్నం. దిగ్గజ ఆటగాళ్ల నిష్క్రమణతో సఫారీ శిబిరంలో తరం మార్పిడి జరుగుతోంది. కొత్త ఆటగాళ్లు జట్టులో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. కొత్త జనరేషన్ సఫారీ జట్టుకు వాండరర్స్ టెస్టు మ్యాచ్ ఓ మలుపు. అత్యుత్తమ జట్టుతో సఫారీ గడ్డపై చారిత్రక సిరీస్ విజయం దిశగా కోహ్లిసేన అడుగులు వేస్తుండగా.. వాండరర్స్ విజయం స్ఫూర్తితో టీమ్ ఇండియాకు కేప్‌టౌన్‌లోనూ చెక్ పెట్టాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఇరు జట్లు సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కేప్‌టౌన్ టెస్టు సమరం నేటి నుంచి ఆరంభం. మధ్యాహ్నాం 2 గంటలకు స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.
విరాట్ విజృంభించేనా? : సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి టెస్టు శతకం లేకుండా 15 టెస్టులు అయిపోయాయి. ఇన్ని టెస్టుల్లోనూ కోహ్లి శతకబాదకపోయినా అతడి బ్యాటింగ్ సగటు 50కి పైగానే ఉంది. వెన్నుపూస కండరాల నొప్పితో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి తిరిగి కేప్‌టౌన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాలోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. ఓ టెస్టు మ్యాచ్‌కు బెంచ్‌పై కూర్చున్న విరాట్ కోహ్లి నిర్ణయాత్మక సమరంలో భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై విరాట్ కోహ్లి ఫామ్ అందుకుంటే సఫారీ బౌలర్లకు చుక్కలే. వాండరర్స్ టెస్టులో రాణించిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు నేడు తుది జట్టులో చోటు నిలుపుకోనున్నారు. ఈ ఇద్దరూ వీరోచిత అర్థ సెంచరీలతో వాండరర్స్‌లో భారత్‌ను గెలుపు కోసం పోరాడే స్థితికి చేర్చారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వికెట్ కీపర్ విధ్వంసక బ్యాటర్ రిషబ్ పంత్ సైతం ఓ మెగా ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. షాట్ ఎంపికలో విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్ చివరి టెస్టులోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తాడేమో చూడాలి. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఆడే అవకాశం కనిపిస్తోంది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఉమేశ్ యాదవ్‌కు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలకు తోడు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయజాలం చేయనున్నాడు. తెలుగు తేజం హనుమ విహారి మరోసారి బెంచ్‌కు పరిమితం కానున్నాడు.
రబాడ స్పెషల్ : దక్షిణాఫ్రికా క్రికెట్‌లో తరం మార్పిడి జరుగుతోంది. క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఈ ఫార్మాట్‌లో సఫారీల స్టార్ ఆటగాడు కగిసో రబాడ మాత్రమే. ఆ స్థాయికి తగినట్టుగానే కగిసో రబాడ ఆట ఉంటోంది. వాండరర్స్‌లో కగిసో రబాడ బంతులకు భారత బ్యాటర్ల వద్ద సమాధానం కొరవడింది. కెప్టెన్ డీన్ ఎల్గార్ ప్రత్యేక ఇన్నింగ్స్‌తో జట్టులో గొప్ప స్ఫూర్తి నింపాడు. నేడు కేప్‌టౌన్‌లో కెరీర్ 50వ టెస్టు ఆడనున్న కగిసో రబాడ ప్రత్యేక ప్రదర్శన ఆశిస్తున్నాడు. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై రబాడ ప్రత్యేకత కోసం అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఎడెన్ మార్కరం, కీగన్ పీటర్సన్, తెంబ బవుమాలు ఫామ్‌లోకి రావటం, నిలకడగా పరుగులు చేయటం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు తుది జట్టులో చోటుపై కొన్ని ప్రశ్నలు నెలకొన్నాయి. అయినా, కేప్‌టౌన్ టెస్టు తుది జట్టు కూర్పులో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా లేడు. లుంగిసాని ఎంగిడి, ఒలీవర్ తోడుగా రబాడ పేస్ ప్రతాపంపై ప్రధానంగా ఆసక్తి కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : కరోనా మహమ్మారితో కేప్‌టౌన్ రెండేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైంది. ఈ సమయంలో క్యూరేటర్ మారటంతో న్యూలాండ్స్‌కు కొత్త పిచ్ వచ్చింది. కొత్త పిచ్‌పై బ్యాటర్ల పని తేలికైంది. ఇక్కడ జరిగిన దేశవాళీ మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 361గా ఉంది. దీంతో తాజా టెస్టులో భారీ స్కోర్లు నమోదు కానున్నాయి. టెస్టు సిరీస్ ఆరంభం నుంచీ వర్షం అంతరాయం కలిగిస్తోంది. కేప్‌టౌన్ టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం లేదు!. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ/ఉమేశ్ యాదవ్.
దక్షిణాఫ్రికా : డీన్ ఎల్గార్ (కెప్టెన్), ఎడెన్ మార్కరం, కీగన్ పీటర్సన్, డుసెన్, తెంబ బవుమా, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, ఒలీవర్, లుంగిసాని ఎంగిడి
0
కేప్‌టౌన్‌లో టీమ్ ఇండియాకు దారుణ రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు భారత జట్టు ఓ టెస్టు విజయం సాధించలేదు. మూడు టెస్టుల్లో పరాజయం చవిచూసిన భారత్..రెండు టెస్టులను డ్రా చేసుకుంది. కేప్‌టౌన్ సఫారీలకు కంచుకోట.
50
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ కేప్‌టౌన్‌లో మైలురాయి మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. న్యూలాండ్స్‌లో బారత్‌తో టెస్టు కగిసో రబాడకు కెరీర్ 50వ టెస్టు మ్యాచ్ కానుంది.
' గత 10-11 ఏండ్లుగా మూడు ఫార్మాట్లు సహా ఐపీఎల్‌లోనూ రెగ్యులర్‌గా ఆడుతున్నాను. నిలకడగా ఆడుతున్నప్పుడు పని భారం సైతం సహజంగానే ఉంటుంది. గాయంతో ఓ టెస్టుకు దూరంగా కావటం వింత అనుభూతి. ఈ గాయంతో వాస్తవిక పరిస్థితులు అవగతం అయ్యాయి. ఆట ఆడుతున్నప్పుడు శరీరం ఓసారి అలసిపోతుంది. ఆ పరిస్థితిని అంగీకరించాలి. ఇది కొంత ఇబ్బందికి గురిచేసినా ఆటలో గాయాలు సర్వసాధారణం'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్