Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లోనే ఐపీఎల్ 2022 సీజన్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త ప్రాంఛైజీలు అధికారికంగా చేరిపోయాయి. ఈ మేరకు లక్నో, అహ్మదాబాద్ ప్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) జారీ చేసేందుకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్, సీవీసీ సంస్థలు భారీ ధరతో ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లోనే రెండు కొత్త ప్రాంఛైజీలు ఖరారైనా.. సీవీసీ సంస్థ విదేశాల్లో బెట్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉందనే ఆరోపణలపై బీసీసీఐ లోతైన మదింపు చేసింది. న్యాయ బృందంతో విస్త్రృత సంప్రదింపుల అనంతరం సీవీసీ సంస్థకు అహ్మదాబాద్ ప్రాంఛైజీ ఏర్పాటు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ఆటగాళ్ల మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 12-13న బెంగళూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. అంతకుముందే రెండు కొత్త ప్రాంఛైజీలు ముగ్గురు క్రికెటర్లను (ఇద్దరు దేశీయ, ఓ విదేశీ) ఎంచుకోవాల్సి ఉంది. ఆటగాళ్లను ఎంచుకునేందుకు లక్నో, అహ్మదాబాద్ ప్రాంఛైజీలకు బీసీసీఐ 10-14 రోజుల గడువు ఇవ్వనుంది. ప్రాంఛైజీల ఆఫర్ నచ్చితేనే క్రికెటర్లు కొత్త ప్రాంఛైజీలకు వేలానికి ముందే వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. వచ్చే సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని, విదేశీ వేదికల ఆలోచనలు లేవని బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు.