Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థ సెంచరీతో ఆదుకున్న కోహ్లి
- భారత్ తొలి ఇన్నింగ్స్ 223/10
- నాలుగు వికెట్లతో మెరిసిన రబాడ
- దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 17/1
చారిత్రక సందర్భం. మేఘావృత వాతావరణం. బ్యాటింగ్‌కు కఠిన పరిస్థితులు!. భారత్, దక్షిణాఫ్రికా న్యూలాండ్స్ టెస్టు తొలి రోజు సన్నివేశమిది. సంయమనం, ఏకాగ్రత, డిఫెన్స్‌తో కూడిన బ్యాటింగ్ ప్రదర్శనతో విరాట్ కోహ్లి ఆకట్టుకోగా.. పదునైన పేస్‌తో, కండ్లుచెదిరే స్పెల్స్‌తో కగిసో రబాడ అభిమానుల మనసు దోచుకున్నాడు. కేప్‌టౌన్ టెస్టు తొలి రోజు భారత్ తరఫున విరాట్ కోహ్లి వన్‌మ్యాన్ షో చేయగా.. దక్షిణాఫ్రికా శిబిరంలో ఆ పని పేసర్ కగిసో రబాడ చేశాడు. విరాట్ కోహ్లి (79) అర్థ సెంచరీతో రాణించిన కగిసో రబాడ (4/73) విజృంభణతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే కుప్పకూలింది.
నవతెలంగాణ-కేప్‌టౌన్
కెప్టెన్ విరాట్ కోహ్లి (79, 201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత అర్థ సెంచరీతో కదం తొక్కాడు. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి కేప్‌టౌన్ టెస్టులో సత్తా చాటాడు. బ్యాటింగ్‌కు అనువైన పరిస్థితులు లేకపోయినా సఫారీ పేస్ ప్రతాపాన్ని ఎదురించి నిలిచాడు. విరాట్ కోహ్లి కెరీర్‌లో అత్యంత సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ కేప్‌టౌన్ అర్థ సెంచరీని భావించవచ్చు. విరాట్ కోహ్లికి తోడుగా చతేశ్వర్ పుజారా (43, 77 బంతుల్లో 7 ఫోర్లు) సైతం రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల గౌరవప్రద స్కోరు సాధించింది. అజింక్య రహానె (9), కెఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) నిరాశపరిచారు. పేసర్లు కగిసో రబాడ (4/73), మార్కో జాన్సెన్ (3/55) భారత పతనాన్ని శాసించారు. భారత స్టార్ పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కీలక కెప్టెన్ వికెట్‌ను కోల్పోయింది. డీన్ ఎల్గార్ (3) పెవిలియన్‌కు చేరగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 17/1తో కొనసాగుతోంది. ఎడెన్ మార్కరం (8 నాటౌట్, 20 బంతుల్లో 1 ఫోర్)కు తోడుగా నైట్‌వాచ్‌మన్ కేశవ్ మహరాజ్ (6 నాటౌట్, 12 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా క్రీజులో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌కు దక్షిణాఫ్రికా 206 పరుగుల వెనుకంజలో నిలిచింది.
వీరోచిత విరాట్ : కేప్‌టౌన్‌లో టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూలాండ్స్ కొత్త పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించటం లాంఛనమే అనిపించింది. కానీ మేఘావృత వాతావరణం, పిచ్ స్వభావంపై సఫారీ పేసర్ల మెరుగైన అవగాహనతో కోహ్లిసేనకు భంగపాటు తప్పలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఇద్దరూ ఆరంభంలో వికెట్ చేజార్చుకున్నారు. కెఎల్ రాహుల్ (12, 35 బంతుల్లో 1 ఫోర్) మరోసారి యువ పేసర్ ఒలీవర్ చేతికి చిక్కాడు. రాహుల్ ఫుట్‌వర్క్, కదలికలపై కన్నేసి బంతులు సంధిస్తున్న ఒలీవర్ మానసికంగా పైచేయి సాధించినట్టే ఉన్నాడు!. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (15, 35 బంతుల్లో 3 ఫోర్లు) కగిసో రబాడకు వికెట్ కోల్పోయాడు. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన భారత్ ఒత్తిడిలో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (79) అద్భుతంగా రాణించాడు. చతేశ్వర్ పుజారా (43)తో కలిసి నిర్మాణాత్మక భాగస్వామ్యం నమోదు చేశాడు. పుజారా, విరాట్ క్రీజులో ఉండగా భారత్ ఇన్నింగ్స్ చక్కబడినట్టే కనిపించింది. పుజారా దూకుడు కొనసాగించాడు. 7 ఫోర్లతో 77 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. జాన్సెన్ ఓవర్లో అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో వికెట్ల వెనకాల దొరికిపోయాడు. దీంతో విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా నిష్క్రమణ అనంతరం మరో బ్యాటర్ నుంచి విరాట్ కోహ్లికి సహకారం లభించలేదు. సహజంగా దూకుడుగా ఆడే విరాట్ కోహ్లి పరుగుల వేటలో బౌలర్లపై ఎదురుదాడి చేస్తాడు. కానీ కేప్‌టౌన్‌లో కొత్త కోహ్లి కనిపించాడు. 201 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లి 39.30 స్ట్రయిక్‌రేట్‌తో 79 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 158 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి శతక నిరీక్షణకు ముగింపు పలికే దిశగా సాగాడు. తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. లంచ్ విరామం అనంతరం సెషన్లో సైతం రెండు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె (9)ను అద్భుత బంతితో కగిసో రబాడ వెనక్కి పంపించాడు. టీ విరామ సమయానికి భారత్ 141/4 వద్ద నిలిచింది.
చివరి సెషన్లో భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ (27, 50 బంతుల్లో 4 ఫోర్లు) వైఫల్య ప్రస్థానం కేప్‌టౌన్‌లోనూ కొనసాగింది. టెయిలెండర్లు అశ్విన్ (2), శార్దుల్ ఠాకూర్ (12), జశ్‌ప్రీత్ బుమ్రా (0), మహ్మద్ షమి (7)లు పెద్దగా ఆకట్టుకోలేదు. 17 ఓవర్లలోనే భారత్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. అత్యద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లి (79) ఇన్నింగ్స్‌కు రబాడ ముగింపు పలకటంతో భారత్ పతనం లాంఛనమైంది. 77.3 ఓవర్లలో భారత్ 223 పరుగులకు కుప్పకూలింది. కెరీర్ 50వ టెస్టు ఆడుతున్న సఫారీ పేసర్ కగిసో రబాడ నాలుగు స్పెల్స్‌లో 22 ఓవర్లు వేసి భారత్‌ను వణికించాడు. రబాడ పేస్ ప్రతాపానికి భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారనటం అతిశయోక్తి కాదు. ఒలీవర్, ఎంగిడి, మహరాజ్‌లు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) వెరెన్నె (బి) ఒలీవర్ 12, మయాంక్ అగర్వాల్ (సి) మార్కరం (బి) రబాడ 15, చతేశ్వర్ పుజారా (సి) వెరెన్నె (బి) జాన్సెన్ 43, విరాట్ కోహ్లి (సి) వెరెన్నె (బి) రబాడ 79, అజింక్య రహానె (సి) వెరెన్నె (బి) రబాడ 9, రిషబ్ పంత్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 27, రవిచంద్రన్ అశ్విన్ (సి) వెరెన్నె (బి) జాన్సెన్ 2, శార్దుల్ ఠాకూర్ (సి) పీటర్సన్ (బి) మహరాజ్ 12, జశ్‌ప్రీత్ బుమ్రా (సి) ఎల్గార్ (బి) రబాడ 0, ఉమేశ్ యాదవ్ నాటౌట్ 4, మహ్మద్ షమి (సి) బవుమా (బి) ఎంగిడి 7, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (77.3 ఓవర్లలో ఆలౌట్) 223.
వికెట్ల పతనం : 1-31, 2-33, 3-95, 4-116, 5-167, 6-175, 7-205, 8-210, 9-211, 10-223.
బౌలింగ్ : కగిసో రబాడ 22-4-73-4, ఒలీవర్ 18-5-42-1, మార్కో జాన్సెన్ 18-6-55-3, లుంగిసాని ఎంగిడి 14.3-7-33-1, కేశవ్ మహరాజ్ 5-2-14-1.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : డీన్ ఎల్గార్ (సి) పుజారా (బి) బుమ్రా 3, ఎడెన్ మార్కరం 8 నాటౌట్, కేశవ్ మహరాజ్ 6 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (8 ఓవర్లలో ఓ వికెట్) 17.
వికెట్ల పతనం : 1-10.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 4-4-0-1, ఉమేశ్ యాదవ్ 2-0-10-0, మహ్మద్ షమి 2-0-7-0.