Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠగా కేప్‌టౌన్ టెస్టు
- సఫారీ లక్ష్యం 212, ప్రస్తుతం 101/2
కేప్‌టౌన్ : సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రసకందాయంలో పడింది. యువ బ్యాటర్ రిషబ్ పంత్ (100 నాటౌట్, 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా ముందు భారత్ సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఉంచింది. 212 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2తో దూసుకుపోతుంది. కెప్టెన్ డీన్ ఎల్గార్ (30, 96 బంతుల్లో 3 ఫోర్లు), కీగన్ పీటర్సన్ (48 నాటౌట్, 61 బంతుల్లో 7 ఫోర్లు) రెండో వికెట్‌కు విలువైన 78 పరుగులు జోడించారు. ఎడెన్ మార్కరం (16) ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. ఎల్గార్, పీటర్సన్ పరుగులు రాబట్టారు. ఈ జోడీ మెరుపులతో సఫారీ లక్ష్యం దిశగా దూసుకుపోయింది. మూడో రోజు ఆటలో చివరి ఓవర్లో ఎల్గార్‌ను అవుట్ చేసిన బుమ్రా మ్యాచ్‌లో భారత్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చాడు. దక్షిణాఫ్రికా విజయానికి మరో 111 పరుగులు అవసరం కాగా.. భారత్ 8 వికెట్ల దూరంలో నిలిచింది.
అంతకముందు, భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ (10), మయాంక్ (7)లకు తోడు చతేశ్వర్ పుజారా (9), అజింక్య రహానె (1)లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (29, 143 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి రిషబ్ పంత్ (100 నాటౌట్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. విరాట్ కోహ్లి నిష్క్రమణ అనంతరం పంత్‌కు మరో ఎండ్‌లో సహకారం కొరవడింది. అశ్విన్ (7), శార్దుల్ ఠాకూర్ (5) నిరాశపరిచారు. రిషబ్ పంత్ అజేయంగా నిలిచినా.. 67.3 ఓవర్లలో భారత్ 198 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని దక్షిణాఫ్రికాకు భారత్ 212 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.